
– నేటి రోజుల్లో రాఖీ పండుగ అవశ్యకతమే..
– జోరుగా ఆడపడచుల రాఖీ కొనుగోళ్లు
రాఖీ పండుగ సోదర సోదరీమణులు వారి బాంధవ్యం కలకాలం నిలవాలని అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ.సోదరికి అండగా సోదరుడు జీవితాంతం తోడుగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ రక్షా బంధన్ పండుగ. రాఖీ పండుగ అని,రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ.అనాధిగా ఆచారంగా వస్తున రాఖీ పౌర్ణమి పండుగ నేడు ప్రత్యేక అవశ్యకతను సంతరించుకుంది.
నవతెలంగాణ-బెజ్జంకి
సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో అన్నా చెల్లెళ్లు,అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు,విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది.రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని ఏమి లేదు.ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు,సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు,ఐకమత్యానికి,పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.మండల కేంద్రంలో రాఖీ విక్రయ కేంద్రాలు ఆడపడచులతో కిటకిటలాడాయి.
రాఖీ పౌర్ణమి ఆచారానికి ఈ కథే మూలం..
పూర్వం దేవతలు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా యుద్ధం సాగడంతో యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు,తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని,భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి ‘రక్ష’ను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు.ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం.ఆనాడు ప్రారంభమైన రక్షాబంధనమే ఇప్పటివరకు ప్రతి యేటా సోదరిసోదరుల ఆత్మీయతకు అద్దం పడుతుంది రాఖీ పౌర్ణమి పండుగ.
అన్నాచెల్లేల అనుబంధం ఎంతో గొప్పనైనది
మానావాళి చరిత్రలో ఒక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకు చిన్ననాటి నుండి వెన్నంటే ఉండి పెళ్ళి చెసి మెట్టినింటికి సాగనంపే రోజు నాటికి అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలిసివస్తుంది.అన్నాచెల్లెళ్ళ అనుబంధం ఎంతో గొప్పనైనది.రక్తం పంచుకుపుట్టిన అన్నాతమ్ముల్లకు తోబుట్టువులు ప్రతోయేటా ఈ ఒక్క రోజు మాత్రమే బాధ్యతగా గౌరవించడం జీవితంలో మరుపురాని రోజు.అన్నతమ్ముల క్షేమం కొరే తోబుట్టువులు ఉన్నంతకాలం అనుబంధం ఎప్పటికీ ఆనందంగా విరాజిల్లుతూ ఉంటుంది.
