రామ్‌ చరణ్‌ కొత్త సినిమా మొదలైంది

Ram Charan New movie startedరామ్‌ చరణ్‌ కథానాయకుడిగా, తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌ బస్టర్‌ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ ఆర్‌సి16 బుధవారం ఘనంగా ప్రారంభ మైంది. ఇందులో రామ్‌చరణ్‌కి జతగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌ కొట్టగా, బోనీ కపూర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ చేతుల మీదుగా చిత్ర యూనిట్‌ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. నా రెండో సినిమాకే నా కల నేరవేరుతుందని అనుకోలేదు. మా అందరికీ ఇది మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా జరగటానికి ప్రధాన కారణమైన మా గురువు సుక్కుసార్‌కి థ్యాంక్స్‌’ అని చెప్పారు.
‘సుకుమార్‌ చెప్పినట్లు బుచ్చిబాబు క్రేజీ పర్సన్‌. తన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. తను నన్ను కలిసినప్పుడు ఐదు సిట్యువేషన్స్‌ చెప్పి, ఒక్కోదానికి మూడేసి సాంగ్స్‌ ఉండేలా ప్లాన్‌ చేసిన ఓ ఫైల్‌ ఇచ్చాడు. తనలోని ఆసక్తి చూసి ముచ్చటేసింది. ఇప్పటికే మూడు ట్యూన్స్‌ పూర్తి చేశాం’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌.రెహ్మాన్‌ తెలిపారు.
హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ, ”బుచ్చిబాబు ఈ కథను నెరేట్‌ చేయటానికి వచ్చినప్పుడు ఆయనకు సినిమాపై ఉన్న క్రేజ్‌ చూసి సినిమా చేయాలనుకున్నా. ప్రేక్షకులందరూ మెచ్చుకునేలా మంచి సినిమాలో భాగమవుతాను’ అని అన్నారు. ‘బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. రంగస్థలంలో సుకుమార్‌ అసిస్టెంట్‌గా తను ట్రావెల్‌ అయ్యాడు. రంగస్థలం నెరేషన్‌ను సుకుమార్‌ నాకు నలబై నిమిషాలే ఇచ్చారు. అయితే అక్కడి నుంచి ప్రతిరోజూ రెండేసి గంటల నెరేషన్‌ను ఇస్తూ వచ్చింది మాత్రం బుచ్చిబాబునే. ఈ స్టేజ్‌ పై ఉన్న ప్రముఖులను చూస్తుంటేనే తన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. తను ఉప్పెనతో పెద్ద సక్సెస్‌ చూశాడు. నేను నాకెరీర్‌లో ఇంత త్వరగా ఎ.ఆర్‌.రెహమాన్‌గారితో పని చేస్తానని అనుకోలేదు. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. నేను, జాన్వీ కలిసి జగదేకవీరుడు-అతిలోక సుందరి అనే సినిమా చేయాలని చాలా మంది అనుకున్నారు. మా కాంబినేషన్‌ ఈ సినిమాతో నిజం కాబోతుండటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.