ఇండియా శ్రీలంకల మధ్యగల బ్రిడ్జిని ‘ఆడమ్స్ బ్రిడ్జి’ అని అంటున్నాం. సంప్రదాయ వాదులు ‘రామాయణం’ ఆధారంగా దాన్ని రామసేతు’ – అని అంటారు. సనాతనవాదులు రాసుకున్న వారి లెక్కల్నే ఒకసారి వివరంగా చూద్దాం. ఆనాడు నిర్మాణ పనులు ఏ విధంగా జరిగాయి? ఎన్ని వానరాలు (కోతులు) ఈపనిలో పాల్గొన్నాయీ? వారధి పొడవూ వెడల్పులు ఎంతెంత? వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. మొదటిరోజు వానరాలు కష్టపడి పద్నాలుగు యోజనాల వంతెన నిర్మించాయట! రెండవ రోజు ఇరవై : మూడవ రోజు – ఇరవై ఒకటి, నాలుగవ రోజు – ఇరవై రెండు, అయిదవ రోజు – ఇరవై మూడు – మొత్తం కలిపి వంద యోజనాల వారధి నిర్మించాయని పవిత్ర రామాయణ గ్రంథంలో ఉంది. ఇదే విషయం అందులోని 74వ శ్లోకంలో ఉంది.
”దశయోజన్ విస్తీర్ణమ్ శతయోజన్ మాయతమ్||
దద్రు దేవ గంధర్వు నలసేతుమ్ సుదుష్కరమ్|”
అసాధ్యమైన వంద యోజనాల పొడవూ పది యోజనాల వెడల్పూగల ఈ వంతెనను చూసి యక్షులు, గంధర్వులు ఆనందించారని ఈశ్లోకం తెలియజేసింది. ఇకయోజన అంటే ఎంత అనేది చూద్దాం!విష్ణు పురాణం ప్రకారం ఒక యోజన అంటే 14.63 కి.మీ. ఆ లెక్కన, వంద యోజనాలంటే 1463 కి.మీ. రామాయణం ప్రకారం కోతులు కట్టిన వారధి పొడవు 1463 కి.మీ; వెడల్పు 150 కి.మీ. ఇది ఇలా ఉండనిచ్చి ఇప్పుడు మనం చూస్తున్న ఆడమ్స్ బ్రిడ్జి పొడవెంత? కేవలం యాభై కి.మీ. సనాతనుల 1463 కి.మీ.లకు, ఆధునికుల 50కి.మీ. పొంతనే లేదు. దీనితో మనకు అర్థమయ్యేది ఏమిటి? అంటే.. ఆ రామాయణం రాసిన మహానుభావుడికి వారధి పొడవూ వెడల్పుల లెక్కలేవీ తెలియవని! పైగా, అదొక సృజనాత్మక రచన. ఖచ్చితమైన లెక్కలు ఉండటానికి అదేమీ వైజ్ఞానిక గ్రంథం కాదు. మనం అర్థం చేసుకోగలం. ఇలా తప్పుల తడకలు రాసారేమని ఇండియా, శ్రీలంకల మధ్య 1463 కి.మీ. దూరం ఉండేదనీ, అది కాలక్రమంలో తగ్గిపోయి ఇప్పటి 50 కి.మీ.లుగా మిగిలిందని చెప్పినా చెప్పగలరు. వారి సామర్థ్యం మనకు తెలియనిదా?
ఇక రామసేతు నిర్మాణంలో పాల్గొన్న కోతుల సంఖ్య రామాయణంలో చెప్పిన ప్రకారమే వెయ్యి కోట్లు! ఇక రామ రావణయుద్ధంలో పాల్గొన్న సైన్యం ఎంత అనేది అందులో చెప్పలేదు కానీ, రాముని పక్షాన వెయ్యి కోట్ల వానరాలే పాల్గొన్నాయని అనుకుందాం. అప్పుడు రావణుడి సైన్యం కూడా వెయ్యి కోట్లే అనుకుంటే – యుద్ధంలో పాల్గొన్న ఇరుపక్షాల సైన్యం రెండు వేల కోట్లు. క్రమంగా పెరుగుతున్న ప్రపంచ జనాభా ఇప్పుడెంత ఉండాలీ? ఈ కాకి లెక్కలు పక్కనపెడితే ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారు ఏడు వందల కోట్లు. మరి వేల సంవత్సరాల క్రితం ఇంత జనాభా ఉండదుకదా? అలాంట ప్పుడు నోటికొచ్చిన సంఖ్య ఏదోరాస్తూ పోతే అది నిజమౌతుందా? రామాయణం రాసిన రచయితకు జనాభా గురించి ఏమీ తెలియదని, అది ఒక కల్పితగాథ అని – అంటే సరిపోతుంది కదా? కానీ సనా తనులు అలా అనలేరు. జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం రాముడనే మానవుడికి కోట్ల సంఖ్యలో కోతులు వచ్చి బాసటగా నిలబడ్డాయని గానీ, ఆ మానవుడి పక్షాన యుద్ధం చేసినట్టు గానీ, ఈ భూగోళ చరిత్రలో – ఖగోళ చరిత్రలో – విశ్వానికి సంబంధించిన ఏ చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు.
రామసేతు మూలాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు భారతీయ ఉపగ్రహాలు గుర్తించ లేదని కేంద్ర భూగోళ విషయాల మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ”భారత్-శ్రీలంక ప్రాంతాలను అనుసంధానం చేసే రామసేతు ఫొటోలను భారతీయ ఉపగ్రహాలు హైరెసలూష్యన్‌తో తీశాయి. కానీ ‘రామసేతు ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు’ అని సభలో ప్రకటించాడు. దీనివల్ల మనకు ఏమర్థమవుతోందీ అంటే- ఆడమ్స్ బ్రిడ్జ్ సహజ సిద్ధంగా ఏర్పడిందేగానీ ఎవరో నిర్మించిన వారధి కాదు. అందుకే చెప్పేది – రామాయణం చెప్పే ‘రామసేతు’ – అబద్ధం – అని !!
ఇకపోతే, భారత కేంద్ర ప్రభుత్వం – దేశ ప్రజల చెవుల్లో ‘పువ్వులు’ పెట్టే పని గత పదేండ్లుగా చేస్తూనే ఉంది (2014-2024) ఇప్పుడు తాజాగా అలాంటిదే మరొక పనిచేసింది. పురాణాల్ని చరిత్రగా మార్చి చూపెట్టాలని తాపత్రయపడింది. గిట్టనివాళ్లు దాన్ని ఎలాగూ ‘కుట్ర చేసింది’- అని అంటారు. అది వేరే విషయం! ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్’- అనే సంస్థ ద్వారా కొన్ని తేదీలు విడుదల చేయించింది. ఇది ఆరెస్సెస్ – బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఒక భజన సంస్థ – శ్రీరాముడు పుట్టిన తేదీ – సాధారణ శకానికి ముందు 5114 జనవరి 10-మధ్యాహ్నం 12.05 నిముషాలకు అనీ. శ్రీరాముడు లంకలోని అశోక వనంలో సీతను కలిసిన సంవత్సరం సాధారణ శకానికి ముందు 5076 సంవత్సరాలు సెప్టెంబర్ 12 అనీ… ఇక మహాభారత యుద్ధం సాధారణ శకానికి ముందు 3139 అక్టోబర్ 13 నుండి ప్రారంభమైందనీ – కొన్ని తేదీలు విడుదల చేయించింది. రామాయణ మహాభారతాలు కల్పిత కావ్యాలు కావనీ, అవి చారిత్రక గ్రంథాలని ఆ సంస్థ ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే, వారు లోగడ చెప్పిన యుగాల లెక్కలు వారికే అసమంజసంగా తోచి, ఇప్పుడు వాడుకలో ఉన్న మామూలు తేదీలు, నెలలు, సంవత్సరాల్లోకి వచ్చారన్నమాట! ఒక అడుగు వెనక్కి వేసి, భ్రమల్లోంచి వాస్తవంలోకి రావడానికి ప్రయత్నించారంటే అభినందించాల్సిందే. కానీ, ఇచ్చిన ఆధారాలు సరిగాలేనప్పుడు మనం వాటిని కాకమ్మ కథలనే అంటాం! అని చారిత్రక గ్రంథాలని అన్నప్పుడు చారిత్రక ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఆధారాలు చూపకుండా ఊరికే తేదీలు ప్రకటిస్తే – ఆ తేదీలకు ఏ విలువా ఉండదు.
సనాతన ధర్మం ఎలా ఉంటుంది? అనేది భారతంలో వ్యాసుడు చెప్పాడు- ”పరుషు రాముడు భూమ్మీద ఉన్న క్షత్రియులనందరినీ చంపేస్తాడు అప్పుడు భర్తలు లేని ఆ రాజుల భార్యలు బ్రాహ్మణులతో శారీరకంగా కలిసి, సంతానం పొందుతారు – అంటే వారసుల్ని కంటారు. రాజులకు పిల్లలు పుట్ట నప్పుడు ఆరాజు భార్యలు బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనొచ్చు”- భీష్ముడితో రచయిత వ్యాసుడు ఈ మాటలు చెప్పిస్తాడు. ఇదే సనాతన ధర్మమని – మహా భారతం : ఆది పర్వం 104వ అధ్యాయంలో వ్యాసుడు చెప్తాడు. అదే మహాభారతంలో 13వ, అనుశాసన పర్వం 88లో ధర్మరాజుతో భీష్ముడు ఇలా అంటాడు ”ఓ యుధిష్టరా ! శ్రార్దకర్మలో మనువు చెప్పిన ప్రకారం – చేపలు పెడితే పితదేవతలు రెండు నెలలు సంతోషిస్తారు. మాంసం పెడితే మూడు నెలలు, పక్షి మాంసం పెడితే ఏడు నెలలు; లేడీ మాంసంతో ఎనిమిది నెలలు, ఆవుమాంసంతో సంవత్సరమంతా పితదేవతలు ఆనందిస్తారు. ఇక శార్ధ కర్మలలో ఎద్దుమాంసం పెడితే ఏకంగా వారు పన్నెండు సంవత్సరాలు సంతోషిస్తారు!”- ఇక రామా యణం నుండి ఒక ఉదాహరణ చూద్దాం – అరణ్యకాండ 10 -9 వాల్మీకి రామాయణంలో ఇలా ఉంది: రాముడు సీతను ఉద్దేశించి ఇలా అంటాడు ” సీతా! నేను నిన్ను కూడా త్యజింతును. లక్ష్మణుడిని కూడా వీడుతాను. కానీ బ్రాహ్మణులకు చేసిన వాగ్దానమును విడువను.”
ప్రతిదాంట్లో ఇలా బ్రాహ్మణాధిక్యత, మనువాదధోరణీ కనిపిస్తుంటే- వీటిని మనం చారిత్ర గ్రంథాలని అంగీకరించాలా? ఇలాంటి అతి ఘోరమైన అంశాల్ని పక్కనపెట్టి మనం వీటిని చారిత్రక గ్రంథాలుగా స్వీకరించాలని మన మనువాద ఆరెస్సెస్-బీజేపీ నాయకులు తాపత్రయపడుతున్నారు. వాస్తవంగా ఈ దేశంలో పుట్టి, ఈ నేల నాలుగు చెరగులా తిరిగిన వారే చారిత్రక పురుషులవుతారు. ఒక రచయిత మెదడులో జన్మించిన కల్పితపాత్రలు, సంఘటనలూ చరిత్రలో భాగమెలా అవుతాయీ?-అదేమిటో ఇలాంటి ప్రశ్నలతో కొందరి మనోభావాలు దెబ్బతింటాయి.
”భారతీయులు సంప్రదాయపరంగా ఎక్కువ విశ్వాసాలతోనూ, తక్కువ వివేచనతోనూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా సాధారణానికి విరుద్ధంగా అందరి దష్టికి విడ్డూరంగా ఏదైనా చేస్తే- అతణ్ణి విదేశాల్లో పిచ్చివాడంటారు. కానీ, మన దేశంలో అలాంటి వాణ్ణి మహాత్ముడంటారు. యోగి, గురువు, బాబా అని కూడా అంటారు. పిచ్చిజనం అతణ్ణి గొర్రెల్లా అనుసరిస్తారు” – అని అన్నారు భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్. వైదిక దేవీ దేవతలను రూపొందించుకున్న మన పూర్వీకుల వివేకం ఏ స్థాయిలో ఉండేదో ఒకసారి గమనించండి- శివుని వాహనం ఎద్దు. పార్వతి వాహనం సింహం. శివుని మెడలో పాము. ఒక కొడుకు వాహనం నెమలి. మరో కొడుకు వాహనం ఎలుక. పిట్ట కథలు తోచింది తోచిన విధంగా అల్లుకున్నారు. కానీ, ఇందులో లాజిక్ ఏడ్చిందా? శివుని వాహనం ఎద్దును పార్వతి వాహనం సింహం తినేస్తుంది. శివుని మెడలోని పాము ఒక కొడుకు వాహనమైన ఎలుకను తింటుంది. మరొక కొడుకు వాహనమైన నెమలి శివుని మెడలోని పామును చంపుతుంది. ఇది ఒక కుటుంబమైతే అందరూ కలిసి ఎలా ఉంటారూ! అందరు కలిసి ఉండకపోయినా, అప్పుడప్పుడు కలిసినా ఈ ప్రమాదం తప్పదు.
రామసేతు నిర్మాణంలో ప్రముఖపాత్ర వహించాడన్న ఆంజనేయుడిది కోతి తల అయినప్పుడు అందులో ఉండేది కోతి మెదడే కదా? వినాయకుడిది ఏనుగు తల అయినప్పుడు అందులో ఉండేది ఏనుగు మెదడే కదా? ఇవన్నీ జంతువుల మెదళ్లు ఆని ఈ మనుషులెప్పుడు గ్రహిస్తారో కదా? జంతు వుల మెదళ్లకన్నా మనిషి మెదడు ఎన్నోరెట్లు అభివద్ధి చెందిందనీ, అది, లోతుగా ఆలోచించగలదనీ, విశ్లేషించిగలదనీ ఈ మూఢభక్తులు ఎందుకు ఆలోచించరూ? అదే ఈ దేశంలోని విచిత్రం. జంతువుల తలలున్న ‘దేవుళ్ల’కు భజనలు చేస్తుంటారు. తమను తాము తెలుసుకోరు. తమ మెదడులోని వివేకాన్ని నిద్రలేపరు. త్వరలో ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం! అంతకుముందు మూర్ఖపాలకుల్ని దించే యడం అత్యవసరం! జంతు మెదడ్లకు ప్రాముఖ్యమిచ్చే పాలకులు దేశ ప్రజల అవసరాలు తీర్చలేరు.
– సుప్రసిద్ధ సాహితీవేత్త,
జీవశాస్త్రవేత్త(మెల్బోర్న్‌నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు