– అయోధ్యలో ప్రాణప్రతిష్ట వెనుక వెయ్యేండ్ల ప్రణాళిక
– దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
– రాజ్యాంగమే ప్రత్యామ్నాయం
– సత్యాన్వేషణ జరగాలిొ సమీకరించడం, ఉద్యమించడం ప్రజల హక్కు
– పోరాటాలు మాని పార్లమెంటరీ వ్యవస్థపై వ్యామోహం వల్ల ప్రమాదం
– ప్రబీర్ పుర్కాయస్థ ‘కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్’ పుస్తకావిష్కరణలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాముడు నియంతృత్వాన్ని అంగీకరించబోడని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట వెనుక వెయ్యేండ్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు. ఇది అర్థం చేసుకోకపోతే నిజం మాత్రమే తెలుసుకుంటారనీ, సత్యాన్ని తెలుసుకోలేరని చెప్పారు. అందుకే సత్యాన్వేషణ జరగాలని సూచించారు. ప్రబీర్ పుర్కాయస్థ రచించిన ‘కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్ ఫ్రం ద ఎమర్జెన్సీ టు ద ప్రజెంట్ డే’అనే పుస్తకాన్ని సుదర్శన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. మొదటి ప్రతిని మాడభూషి శ్రీధర్‌కు ఇచ్చారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి ప్రత్యామ్నాయ ఆలోచన రాజ్యాంగమేనని అన్నారు. రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్నాయని చెప్పారు. రాజ్యాంగం అన్ని మతాలు, కులాలు, ప్రజలందరినీ సమానంగా గౌరవిస్తుందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో హక్కులు ప్రజలవి, బాధ్యతలు ప్రభుత్వాలవని వివరించారు. ఇప్పుడు ప్రజలకు హక్కులు కనిపించడం లేదన్నారు. ప్రతి మనిషీ ఎమర్జెన్సీ పరిస్థితులను తప్పకుండా ఎదుర్కొంటారని ప్రబీర్ పుర్కాయస్థ పుస్తకంలో రాశారని అన్నారు. సమీకరించడం, ఉద్యమించడం రాజ్యాంగ హక్కని చెప్పారు. ప్రజాపోరాటాలను మాని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మితిమీరిన వ్యామోహం ప్రదర్శించడం వల్ల ప్రమాదం వచ్చిందన్నారు. పోరాటాలను మరిచిపోవడం వల్ల అన్ని దారులూ మూసుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ భావజాలం లేకుండా ఒక పిచ్చితో రాజ్యాంగం, వాటి విలువలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే వెంటనే దానికి కారణాలను చెప్పాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అణుఒప్పందానికి వ్యతిరేకంగా, బాబ్రీ మసీదు కూల్చివేసినపుడు లౌకికవాదం కోసం ప్రబీర్ పుర్కాయస్థ ఉద్యమాలను నడిపారని చెప్పారు. న్యూస్‌క్లిక్ మీద దాడి జరిగితే పోరాడకుండా న్యాయవ్యవస్థపై గౌరవం ఉందన్నారని అన్నారు. ఇప్పుడు కావాల్సింది సత్యాన్వేషణ అని అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, అంబేద్కర్ చెప్పిన కులనిర్మూలన ఏమయ్యాయని అడిగారు. ఎస్వీకేలో ఇలాంటి సమావేశాలు మళ్లీ జరుగుతాయా?అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీరు పది అడుగులు వేస్తే నేను ఒక అడుగు వేస్తాను’అని సుదర్శన్‌రెడ్డి అన్నారు.
ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలి : మాడభూషి శ్రీధర్
ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ప్రశ్నించే వారికి అండగా ప్రజలు నిలబడాలని కోరారు. తాను జర్నలిస్టుగా ఉన్నపుడు పరిశోధన కథనాలను రాయొద్దన్నారని గుర్తు చేశారు. ఆర్టీఐ కమిషనర్ అయ్యాక వ్యాసాలు రాయొద్దన్నారని చెప్పారు. అయితే ఆర్టీఐ గురించే తాను వ్యాసాలు రాశానని అన్నారు. జర్నలిస్టు నిరంతరం ప్రశ్నించాలనీ, పరిశోధించాలని సూచించారు. అన్యాయాన్ని ఎదిరించేవాడు ఆరాధ్యుడు అన్న కాళోజీ మాటలను గుర్తు చేశారు. అందుకే అందరూ ప్రశ్నించాలని చెప్పారు. దేశంలో రాజ్యాంగం ఉందా?, ఆర్టికల్ 19 1(ఏ) ఉందా?అని ప్రశ్నించారు. అవి ఇంకా ఉన్నాయి కాబట్టే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాననీ, భావ ప్రకటనను వ్యక్తం చేస్తున్నానని వివరించారు.
ప్రగతి నిరోధక శక్తులకు అధికారం ప్రమాదకరం : హరగోపాల్
ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వస్తే దేశం ఎలా ఉంటుందో ఆనాడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించిన విషయాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ గుర్తుచేశారు. దేశానికే తలమానికంగా, సమగ్ర చర్చలకు నిలయమైన జేఎన్‌యూపై కావాలనే విషప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో ఆయా శాఖల విభాగాల అధిపతులకు తెలియకుండానే ఒకే భావజాలానికి చెందిన 80 మందిని ఫ్యాకల్టీగా నియమించడాన్ని తప్పుబట్టారు. తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న ప్రగతిశీల ప్రొఫెసర్లపై గూండాలతో దాడులు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి లేదని చెప్పారు. 75 సెంట్రల్ యూనివర్సిటీలలో కనీసం సెమినార్లు కూడా నిర్వహించలేని పరిస్థితి లేదని పలు ఉదహరణలతో వివరించారు. ఎమర్జెన్సీ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ చాలా నేర్చుకున్నదనీ, గుట్టుచప్పుడు కాకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోతున్నదని విమర్శించారు. నేరం చేసిన వాళ్లను సంస్కరించాల్సిన జైళ్లను పాలకులను ప్రశ్నించేవారితో నింపేస్తున్నారన్నారు. నేడు దేశంలో అమలవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ అత్యంత భయంకరమైనదనీ, సమాజంలో వచ్చిన మార్పుతో దేశమే ప్రమాదంలో పడిందని హెచ్చరించారు.
మాట్లాడటమే నేరమనే సమాజంలో మనమున్నాం : కె.నాగేశ్వర్
మాట్లాడటం, ప్రశ్నించడం నేరం, దేశద్రోహం, ధర్మద్రోహం అనే ప్రమాదకర సమాజంలో మనమున్నామని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛపైనే కాదు..అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లులపై ఓటింగ్ అడిగితే ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. దేశ బడ్జెట్‌పై ఎలాంటి చర్చ లేకుండా కేవలం నాలుగున్నర నిమిషాల్లోనే ఆమోదింపజేయడం దారుణమని విమర్శించారు. పార్లమెంట్ కాదు..రాజ్యాంగమే సుప్రీం అని ఎలుగెత్తి చాటాలన్నారు. మతం, భావోద్వేగాలలో మునిగిపోయిన ప్రజల్లోకి ప్రత్యామ్నాయ ఐడియాలజీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆలోచనల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలనీ, హక్కుల ఉల్లంఘన లేని సమాజ నిర్మాణం కోసం ముందుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. 95 శాతం ఈడీ, సీబీఐ కేసులు ప్రతిపక్ష పార్టీలపై ఉన్నాయన్నారు. మీడియా పూర్తిగా పాలక వర్గం గుప్పిట్లో ఉన్న సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆలోచనా ప్రపంచంలోకి ప్రత్యామ్నాయ భావజాలాన్ని జొప్పించాలన్నారు.
విద్యార్థి రాజకీయాలే దేశానికి అవసరం :తులసీ చందు
విద్యార్థి రాజకీయాలు దేశానికి ఎంతో అవసరమనీ, సమాజానికి ఉపయోగమని సీనియర్ జర్నలిస్టు తులసీ చందు అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ కంటే నేడు కనిపించని రీతిలో తీవ్రస్థాయిలో అణచివేత ఉందనీ, వాక్‌స్వాతంత్య్రంపై తీవ్ర దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం నేడు చనిపోయిందనీ, ఉన్నది ఉన్నట్టు చెప్పే ధైర్యం చేయట్లేదని వాపోయారు. పలు పార్టీలకు ఐటీసెల్స్, ట్రోల్ ముఠాలున్నాయనీ, వాటి బుట్టలో పడి ప్రశ్నించేతత్వాన్ని యువత కోల్పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీ, అదానీలకు దేశాన్ని రాసిస్తున్నా స్పందించని స్థితిలో యువత ఉందన్నారు. విద్యార్థులు బయటకు వచ్చి పాలకులను ప్రశ్నించాలనీ, మీడియా ప్రజల పక్షాన పనిచేయాలని పిలుపునిచ్చారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎ విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కె పార్థసారథి, 10 టీవీ మాజీ ఎండీ కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.