రామవ్వ.. సింహం!

రామవ్వ.. సింహం!అదొక దట్టమైన అడవి. అడవిలో పులులు, సింహాలతో పాటు వివిధ రకాల పక్షులు, జంతువులు కూడా ఉండేవి. ఆ అడవిని దాటి వెళ్తే జంగల్‌పురి అనే పట్టణం, అడవికి పశ్చిమాన గువ్వలపల్లి అనే గ్రామం ఉండేవి. గువ్వలపల్లి గ్రామంలో రామవ్వ అనే వృద్ధురాలు నివసించేది. ఆ గ్రామం పక్షుల కిలకిలా రావాలతో ఎప్పుడూ సందడిగా ఉండేది.
రామవ్వ అడవిలో కాసే పండ్లు, ఫలాలను తెంపుకొని జంగల్‌పురి పట్టణానికి వెళ్లి, పండ్లను అమ్మి జీవనాన్ని కొనసాగించేది. ”ఎందుకే రామవ్వ! అడవి గుండా వెళ్తే పులులు, సింహాలు ఉంటాయి. ఈ వయసులో ఎవరి కోసం కష్టపడుతున్నావు. నువ్వు ఒక్క దానివే కదా” అని ఆ ఊరి వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు.
రామవ్వ పట్టణంలో పండ్లను అమ్మి చీకటి పడేలోపే ఇంటికి చేరుకునేది. సాయంత్రం కాగానే ఆ ఊర్లోని పిల్లలందరూ రామవ్వ పూరిగుడిసె దగ్గరకు చేరుకునేవారు. అవ్వ పనులు ముగించుకుని వచ్చి వారితో ప్రేమగా మాట్లాడుతూ పండ్లను పంచి పెట్టేది. ”అవ్వా! అవ్వా! కథ చెప్పవా?” అని పిల్లలు అడుగుతుంటే చాలా సంతోషించేది. పిల్లలకు రకరకాల కథలను చెప్పేది. ఈ కథలే పిల్లల్లో ఆలోచనా శక్తిని, స్నేహాన్ని పెంచుతాయని అవ్వ నమ్మకం. అందుకే ప్రతిరోజూ పిల్లలకు కథలు చెప్పేది. అందుకే పిల్లలందరికీ రామవ్వ అంటే చాలా ఇష్టం. రామవ్వకు కూడా పిల్లలకు కథలు చెప్పడం, వారితో గడపడం అంటే ఇంకా ఇష్టం.
రామవ్వ కథలు చెబుతుంటే చందమామ పచ్చని చెట్టు కొమ్మల మధ్య నుండి తొంగి చూస్తూ కథలు వినేది. ఆకాశంలోని నక్షత్రాలు రామవ్వ పూరిగుడిసె చుట్టూ తిరిగేవి. పిల్లలంతా కథాలోకంలో సీతాకోకచిలుకల్లా విహరించేవారు. చెట్టు మీది పక్షులన్నీ మౌనవ్రతాన్ని పాటించేవి.
ఒకరోజు రామవ్వ అడవిలో చెట్ల మీద పండిన సీతాఫల పండ్లను గంపనిండా తెంపుకొని, పక్షుల కిలకిలారావాలను వింటూ.. కమ్మని పాటలు పాడుతూ గంపనెత్తిన పెట్టుకొని జంగల్‌పురి పట్టణానికి బయలుదేరింది. ఒక్కసారిగా సింహగర్జన వినబడింది. ఇన్ని సంవత్సరాల నుండి నేను పట్టణానికి వెళ్లి వస్తున్నాను. ఎప్పుడూ సింహగర్జన వినపడలేదని మనసులోనే అనుకొని భయపడింది. ఎందుకైనా మంచిదని గంప దించి పక్కనే ఉన్న చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంది.
ఓరి భగవంతుడా! నీవే నాకు దిక్కు. ఎలాగైనా ఈ ఆపద నుండి కాపాడమని దేవున్ని వేడుకుంది. అవ్వ ముడతలు పడిన శరీరమంతా చెమటలతో తడిసిపోయింది. చేతులు గడగడా వణుకుతున్నాయి. అప్పుడే పొదలమాటు నుండి గంభీరంగా బయటికి వచ్చి సింహం నిలబడింది. రామవ్వను చూసి జూలు విదిలిస్తూ గర్జించింది. ఈరోజుతో నాకు నూకలు చెల్లాయని భయపడసాగింది రామవ్వ.
అంతలోనే చెట్టు కొమ్మమీద ఉన్న కపిల అనే కోతి రామవ్వ ముందుకు దూకింది. గజగజా వణికిపోయింది రామవ్వ.
”మృగరాజా! ప్రణామాలు. నేను రోజూ మీతో చెప్పే రామవ్వ ఈమెనే. ప్రతిరోజూ ఈ అవ్వ పిల్లలకు కథలు చెప్తుంది. ఆ కథలను నేను పూరిగుడిసె పక్కనే ఉన్న చెట్టుకొమ్మ మీద కూర్చుని వినేదాన్ని. అలా విన్న కథలనే మీకు చెప్పేదాన్ని. ఇన్ని రోజులకు రామవ్వ కథ చెప్తే వినే భాగ్యం మీకు కలిగింది” అన్నది కపిల.
సింహం ఆనందించింది. ”నువ్వేనా! రామవ్వ అంటే! నీ గురించి మా మంత్రి ప్రతిరోజూ చెబుతుంది. కానీ ఈరోజు నిన్ను చూశాను. చాలా సంతోషంగా ఉంది. నాకు కథలు వినడమంటే చాలా ఇష్టం. నాకు ఈరోజు కమ్మని కథ చెప్పు. నిన్ను వదిలిపెడతాను. అప్పుడప్పుడు వచ్చి నాకు కథలు చెప్పి వెళ్ళు” అని సింహం అనగానే రామవ్వ ప్రాణం కాస్త కుదుటపడింది. ధైర్యాన్ని కూడా కట్టుకొని సింహానికి చక్కని కథను చెప్పింది.
సింహం చాలా సంతోషించింది. ఇచ్చిన మాట ప్రకారం రామవ్వను వదిలేసింది.
‘కథలే నా ప్రాణాన్ని నిలబెట్టాయి. చేసిన మంచి ఊరికే పోదు’ అనుకొని సమయానికి వచ్చి ప్రాణాలు కాపాడిన కపిలకు కృతజ్ఞతలు చెప్పింది. సీతాఫలపండ్ల గంపను నెత్తికి ఎత్తుకొని ఆనందంగా జంగల్‌పురి పట్టణానికి బయలుదేరింది.
– ముక్కామల జానకీరామ్‌
6305393291