అయ్యా
సీతమ్మ రామయ్య
అయోధ్య పట్నాన
అరణ్యం ఏలుతున్నారో రామా!
వారు సాదుకున్న అతి రామచిలుకలు
అయోధ్య నేలుతున్నాయో రామా!
అరణ్యాన్ని ఏలుతున్నాయో రామా!
వాటికి ధాన్యంబు
వడ్లల్లో వడి గట్టి వనమెల్ల జల్లిరంటరమ్మో రామా!
జగతెల్ల గుప్పిరటరమ్మో రామా!
చాకలి బండకాడ చాకలి మాడెలు
కాని కూతలు కూసినారమ్మో రామా!
కాని మాటలు కూసినారమ్మో రామా!
మల్లె తోటలున్న తమ్ముడా లక్ష్మణా
ఇటు రమ్మని పిలిచేనమ్మో రామా!
ఇలాగనే పిలిచినమ్మో రామా!
అతి మేడలో వున్నది మీ వదిన సీతను
చంపి రాపో తమ్ముడో అయ్యో రామా!
తోలి రాపో తమ్ముడో అయ్యో రామా!
అతి మేడలో వున్న నా వదిన సీతను
ఎట్ల చంపి వద్దునో అయ్యో రామా!
ఎట్ల తోలి వద్దునో అయ్యో రామా!
ఎన్నడూ రాని నా మరిది లక్ష్మణుడు
నా వద్దకు వస్తున్నాడో రామా!
నా జాడకు వస్తున్నాడమ్మో రామా!
కూర్చోవు లక్ష్మణా! కుర్చీ పీటలపైన!
ఎత జెప్ప నేనొస్తే కథ జెప్ప మంటావు
ఏమి చెప్పను వదిన గారు!
ఎలా చెప్పను వదిన గారు !
ఎత ఏమి
కథ ఏమి
నాతోని ఎరుగవు ఏమి చెప్పవు మరిది గారు! నాతో
ఎలా చెప్పవు మరిది గారు నాతో!
నల్లనల్లని వాడు నామములు కలవాడు నా అన్న రాముడు
నీ ప్రాణ నాథుడు
నిన్ను చంపి రమ్మన్నాడు వదిన గారు!
నిన్ను తోలి రమ్మన్నాడు వదిన గారు!
నల నల్లని వాడు! నామములు కలవాడు
నీ అన్న రాముడికి నా ప్రాణ నాథునికి ఏమి తప్పు చేసినాను మరిది
ఏమి నేరం చేసినాను మరిది
ఎన్నడూ రానిది నా కోడలు సీతమ్మ
నా వద్దకొస్తుందమ్మో రామా!
నా జాడకు వస్తుందమ్మో రామా!
కూర్చోవు సీతమ్మ సిరిచాపల పైన
పసుపు కుంకుమ పెట్టవమ్మో రామా!
పూల మాలలు పెట్టవమ్మో రామా!
ఎత చెప్ప నేనొస్తే కథ జెప్పామంటావు
ఎలా చెప్పను అత్త గారు నీతో
ఏమి చెప్పను అత్తగారు నీతో!
ఎత ఏమి కథ ఏమి
నాతోని ఎరుగవు
ఏమి చెప్పవు సీత నాతో
ఎలా చెప్పవు సీత నాతో!
నల నల్లని వాడు నామములు కల వాడు నీకొడుకు రాముడు
నా ప్రాణ నాథుడు నన్ను చంపి రమ్మన్నాడు అత్త గారు!
నన్ను తోలి రమ్మన్నాడు అత్త గారు!
నల్ల నల్లని వాడికి నామములు కలవాడికి
నా కొడుకు రాముడికి నీ ప్రాణ నాథుడికి
ఏమి తప్పు జేసినావు సీత
ఏమి నేరం జేసినావు సీత
తలుచుకో సీతమ్మ నీ తల్లితండ్రుల
సూర్య బాణాలు వచ్చెనమ్మో రామా!
చంద్ర బాణాలు వచ్చెనమ్మో రామా!
తల్లితండ్రులు లేరు
ఆత్మ బంధువులు లేరు
రాముడే దిక్కన్నదో రామా
లక్ష్మణుడే దిక్కన్నదో రామా
తలచుకో సీతమ్మ నీ అన్నదమ్ముల
సూర్య బాణాలొచ్చెనమ్మో రామా!
చంద్ర బాణాలొచ్చెనమ్మో రామా!
అన్నదమ్ములు లేరు
ఆత్మ బంధువులు లేరు
రాముడే దిక్కన్నదో రామా!
లక్ష్మణుడే దిక్కన్నదో రామా!
(జనం నోళ్ళలో నానిన పాటను సేకరించాను)
– సేకరణ: చెలమల్లు మంజుల