1. ఒక రొట్టెముక్క కోసం వేడుకుంటున్న
ఖాళీ కడుపులా వుంది –
కుంగిన నెలవంక.
2. రాత్రి పొడవునా చేస్తున్న ప్రార్థన
ఎప్పటికీ ముగియదు –
రక్తమూ, కన్నీళ్ళలో తడిచి
ఒకరి చేతుల్లోకి ఒకరం ఒరిగిపోయాం.
3. పొద్దుటి ప్రార్థన ముగించి
రొట్టెను తీసుకోగానే –
ప్రతి తునకలో గాజా కనిపిస్తోంది.
4. మరణం నుండి దాక్కున్న పిల్లలు
శిథిలాలలో ఒకరినొకరు వెతుక్కుంటారు.
మూసిన వారి కనులు అడుగుతూనే వున్నాయి..
ఇది ఎవరి క్రీడని ?
5. సురాలన్నీ నా ఎడదకు తెలుసనుకున్నాను.
ఇప్పుడు- ప్రతి వాక్యమూ కొత్తగా,
వంద సవాళ్లు వేస్తోంది.
(సురాలు – ఖురాన్లోని అధ్యాయాలు)
6. అది ఇల్లు గానీ, బయలు గానీ
చుట్టూ తిరుగుతూనే వున్నాను.
ఏ కాసింత నేలయినా నా జనమాజే.
(జనమాజే – ముసల్మానులు ప్రార్థన చేసుకునే మోకాలి పట్ట)
7. ఈదురు గాలులకు ఎదురొడ్డి
ఈ ఉదయమిక్కడ ఒంటిగా నిల్చున్నాను.
నా అంతరంగాన్ని నివేదించి
ఇక్కడ వందసార్లు చచ్చి బతికాను.
8. ప్రతి క్షణం నేను పునర్జీవన వాగ్ధానం చేసినట్లుగా
ఇఫ్తార్ నా ముగింపు కాదు.
ప్రతి క్షణం నా యుద్ధనావను సిద్ధం చేసినట్లుగా
సెహ్రీ నా మొదలు కాదు.
(ఇఫ్తార్ – ఉపవాసం తర్వాత ముస్లిములు ఆరగించే విందు,
సెహ్రీ – ఉపవాసానికి ముందు ముస్లిములు తీసుకొనే ఆహారం)
9. ఫజర్ : నాతో స్వయం సంభాషణ మొదలుపెడతాను.
ఇఫ్తార్ : అది ఎక్కడ ముగిస్తానో చెప్పలేను.
నా ముఖాన్ని నువ్వు గుర్తించగలిగితే,
కాలము, ఖగోళము విఫలమవుతాయి.
(ఫజర్ – తెల్లవారుజాము ప్రార్థన)
10.నేను ఎప్పుడు రంజాన్ రొట్టె గురించి మాట్లాడినా
మొహర్రం రక్తం గురించి కూడా మాట్లాడతాను.
రొట్టె, రక్తం నా లోకంలో
ఎప్పుడూ వేరు వేరు కాదు.
ఇంగ్లిషు మూలం : అఫ్సర్
అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449