– నెలవంక దర్శనం
– ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. మంగళవారం నుంచి నెలరోజులపాటు రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వారి పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్‌మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారనీ, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని గుర్తుచేశారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని హామీ ఇచ్చారు. వారి సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి, వారి అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.
ముస్లింలకు కేసీఆర్ శుభాకాంక్షలు
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో జరిపే ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల నడుమ శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన పదేండ్ల ప్రగతి పాలన ద్వారా సంక్షేమం సమాహారంగా రాష్ట్రాన్ని గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా, దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.