కేటీఆర్‌ వద్దకు ‘రామగుండం’ పంచాయితీ..

– ఇన్‌చార్జిగా కొప్పుల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రామగుండం బీఆర్‌ఎస్‌ పంచాయితీ మంత్రి కేటీఆర్‌ వద్దకు చేరింది. అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోరుకంటి సాయిచందర్‌కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు కొందరు కేటీఆర్‌కు విన్నవించారు. శుక్రవారం అసెంబ్లీ వద్ద వారు మంత్రిని కలిశారు. ‘నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేటీఆర్‌కు వివరించాం. వాటిపై ఎమ్మెల్యేతో మాట్లాడుతానంటూ ఆయన మాకు హామీనిచ్చారు. రామగుండానికి చెందిన ఐదుగురు నాయకులపై ఎమ్మెల్యే కేసులు నమోదు చేయించారు.
ఈ విషయం తనకు తెలియదంటూ ఆయన మాకు చెప్పారు…’ అని వారు వివరించారు. సర్వేల ఆధారంగానే టిక్కెట్‌ ఇస్తామంటూ మంత్రి వారికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎమ్మెల్యే మీద కోపంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రెస్‌మీట్లు పెట్టటం చేయొద్దంటూ సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ…రామగుండంలో నెలకొన్న సమస్య 90 శాతం సమసిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న వారందరూ గతంలో తన నాయకత్వంలో పని చేసిన ఉద్యమకారులేనని తెలిపారు.
వ్యక్తులు ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం…దానికోసమే అందరూ పని చేయాలని కోరారు. ఒక మంచి నియోజకవర్గాన్ని చందర్‌ చేతిలో పెడితే కాపాడుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.