చెత్తను తరలిస్తున్న సామాజిక కార్యకర్త రామకృష్ణ..

నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తుండడంతో మండల కేంద్రంలో ప్రతి వీధిలోను చెత్త కుప్పలు పేరుకుపోయాయి. దుర్గంధ భరితంగా మారిన గ్రామాన్ని తన శక్తి మేరకు పరిశుభ్రంగా ఉంచాలని సంకల్పంతో సామాజిక కార్యకర్త అయిన తుమ్మల రామకృష్ణ స్వయంగా రిక్షాతో చెత్తను తరలించి తన వంతు కర్తవ్యాన్ని నెరవేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం జిపి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి పేరుకుపోయిన చెత్తను తొలగించే విధంగా కృషి చేయాలని అన్నారు. 163 వ జాతీయ రహదారి వెంట గ్రామం పొడవున చెత్త కుప్పలు పెరిగి మురికి కంపు కొడుతున్నాయని సాధ్యమైనంతవరకు చెత్తను నివారించాలన్న సంకల్పంతో తరలించడానికి ప్రయత్నించానని అన్నారు. పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉన్నందున ప్రజలు వ్యాపారులు సాధ్యమైనంత వరకు తమ చెత్తను తామే స్వయంగా తరలించుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా రామకృష్ణ సేవా కార్యక్రమాన్ని చూసి గ్రామస్తులు అభినందించారు.