రామలీల

Ramalilaఈ మధ్య చాలాకాలం నుండి రామలీల ఉత్సావాలకు వెళ్ళలేదు. కోతులు వికారపు వేషాలు వేసుకొని పొట్టి పొట్టి పైజామాలు తొడుక్కుని, నల్లరంగు చొక్కాలు వేసుకొని పొలికేకలు పెడుతూ గోలగోలగా పరుగెత్తే మనుషులను చూస్తే యిప్పుడేమిటో నాకు నవ్వుగా ఉంటుంది. మజాగా మాత్రముండదు. కాశీలో జరిగే లీలా ఉత్సవాలు మహాప్రసిద్ధి. ప్రజలు దూరప్రదేశాలనుండి కూడా చూడటానికి వస్తుంటారని విన్నాను. నేనూ ఎంతో హుషారుగా వెళ్ళాను. కాని నాకు మాత్రం అక్కడి లీలా ఉత్సవాలకూ, ప్రజప్రాంత పల్లెటూళ్ళలో జరిగే లీలా ఉత్సవాలకూ ఏమీ తేడా కనిపించలేదు. కాని రామనగర్‌ ఉత్సవాల్లో మాత్రం కాస్త ఆడంబరం అధికంగా ఉంటుంది. రాక్షసులు, వానరుల ముఖ కవచాలు ఇత్తడితో తయారైనవి. గదలుకూడా ఇత్తడివే. బహుశా వనవాస వేషంలో ఉన్న సోదరుల కిరీటాలు మాత్రం కాస్త ఎందుకన్నా అక్కరకొస్తాయేమో. కాని ఆడంబరం ఒక్కటి మినహాయిస్తే అక్కడా ఆ కేకలూ గోలా తప్పితే మరేమీ విశేషం లేదు. అయినా లక్షల జనం కిటకిట లాడుతూనే ఉంటుంది.
నాకూ రామలీలా ఉత్సవాలంటే ఆనందం కలిగేకాలం ఒకటుండేది. ఎబ్బే! ‘ఆనందం’ అనేమాట చాలదు. ఆ ఆనందం ఉన్మాదానికి తక్కువైందేమీ కాదు. అదృష్టవశాత్తూ ఆరోజుల్లో మా యింటికి చాలా దగ్గరలోనే ఉండేది రామలీలా మైదానం. లీలా పాత్రధారులు వేషాలు వేసుకునే ఇల్లు మా ఇంటికి ఆనుకునే ఉండేది. పగలు రెండు గంటలనుంచీ పాత్రధారులు అలంకరణ సాగించేవాళ్ళు. నేను మధ్యాహ్నానికే అక్కడికి వెళ్ళి కూర్చునేవాణ్ణి. పరుగులుతీస్తూ ఎంతో ఉత్సాహంతో చిన్న చిన్న పనులెన్నో చేస్తుండేవాణ్ణి. ఇప్పుడంత ఉత్సాహంతో నా పెన్షను కోసంకూడా వెళ్ళను. ఒక గదిలో రాకుమారుల అలంకరణ జరిగేది. వాళ్ళు శరీరాలకు పసుపుపచ్చని నాము అరగదీసి పట్టించేవాళ్ళు. ముఖానికి పౌడరు అద్దేవాళ్లు. దానిమీద ఎరుపువీ, ఆకుపచ్చవీ, నీలివీ చుక్కలద్దేవాళ్లు. నుదురూ, కనుబొమలూ, బుగ్గలూ, గడ్డం చుక్కలతో నిండిపోయేది. ఈ పనిలో నిపుణత ఒక్కడికే ఉండేది. అతనే వంతుల ప్రకారం ముగ్గురు పాత్రధారులనూ అలంకరించేవాడు. రంగుల గిన్నెలకు నీళ్ళు తేవటం, పచ్చనాము అరగదీయటం, విసనకర్రతో విసరటం ఇవ్వన్నీ నా పనులు. ఈ ఏర్పాట్లన్నీ కాగానే రథం బయలుదేరేది. అప్పుడు రథంలో శ్రీరామచంద్రమూర్తి వెనుక కూర్చుంటే నాకెంతటి గర్వం, ఉల్లాసం, పులకరింపు కలిగేవో ఏం చెప్పను? ఇప్పుడు గవర్నరు దర్బారులో కుర్చీమీద కూర్చున్నప్పుడు కూడా అలా అనిపించదు. ఒకసారి హోంమంత్రిగారు శాసనసభలో నా తీర్మాన మొకటి ఆమోదించినప్పుడుకూడా నాకు సరిగ్గా అలాంటి ఉల్లాసం, గర్వం, పులకరింపే కలిగాయి. ఒకేసారి మా పెద్దబ్బాయి ఆక్టింగ్‌ తహసీల్‌దారుగా నామినేట్‌ చెయ్యబడ్డప్పుడు గూడా అలాంటి తరంగాలే తలెత్తాయి మనస్సులో. కాని వీటికీ, బాలోత్సాహానికి బోలెడంత అంతరముంది. అప్పుడు నేను స్వర్గంలో ఉన్నట్లనిపించేది.
ఆనాడు నిషద నౌకాలీల, ఇద్దరు ముగ్గురు పిల్లలు నన్ను రెచ్చగొట్టినందువల్ల బిళ్ళంగోడు ఆడుతున్నాను నేను. ఆ రోజు అలంకారం చూడటానికి వెళ్ళలేదు. రథంకూడా బయలుదేరింది. అయినా నేను ఆట మానలేదు. నేను నా ఆట పెట్టించుకోవాల్సుంది. నా ఆట వదులుకోవాలంటే నా శక్తికి మించిన స్వార్థత్యాగం అవసరం. నేనే ఆట పెట్టవలసివచ్చినట్లయితే ఎప్పుడో పారిపోయి వచ్చేసేవాణ్ణి. కాని ఆట పెట్టించుకునే పరిస్థితిలో అదంతా వేరుగా ఉంటుంది. సరే ఆట పూర్తయింది. నేను కావాలనుకుంటే మరో పదినిమిషాలు తిప్పలు పెట్టగలిగేవాణ్ణి. అందుకు మంచి అవకాశం కూడా ఉంది. కాని అప్పుడు తగిన టైము లేదు. నేను తిన్నగా కాలువ వైపుకు పరుగెత్తాను. రథం అప్పటికే నీళ్ళ ఒడ్డుకు చేరుకుంది. నేను దూరంనుండే చూశాను. పడవవాడు బోటు తీసుకువస్తున్నాడు. పరుగుతీశాను. కాని జనంలో గుండా పరుగెత్తటం చాలాకష్టం. చివరకు గుంపును తప్పించుకుంటూ ప్రాణాలకు తెగించి ముందుకుసాగి ఎలాగైతేనేం ఒడ్డుకు నేను చేరాను. అప్పటికే పడవవాడు పడవ వదిలాడు. రామచంద్రుడంటే నాకంత శ్రద్ధ! నా పాఠాల సంగతి కూడా చూచుకోకుండా అతన్ని చదివించేవాణ్ణి. అతను ఫేలు కాకూడదని నాకోరిక. నాకంటే వయస్సులో పెద్దయినా, అతను క్రింది తరగతిలో చదువుతున్నాడు. కాని ఆ రామచంద్రుడే ఈ రోజు ఓడమీద కూర్చుని నాతో అసలు పరిచయమే లేదా అన్నట్లుగా ముఖం తిప్పుకుపోతున్నాడు. నకలులో కూడా కొంతకు కొంత అసలులో లక్షణాలు అగుపిస్తూనే ఉంటాయి. భక్తుల నెప్పుడూ కఠినంగా చూస్తూ వచ్చిన ఆయన నన్నేం ఉద్ధరిస్తాడూ? తొలిసారిగా మెడమీద కాడివేయబడినప్పుడు చిందులు త్రొక్కే కోడెదూడలాగా గంతులు వేయసాగాను నేను. ఒకసారి ఎగిరి గంతువేసి కాలువవైపుకు వెళ్ళేవాణ్ణి. ఇంకొకసారి ఎవరైనా సహాయం దొరుకుతారేమోనని వెనుకవైపుకు పరుగెత్తేవాణ్ణి. అందరూ ఎవరి గొడవలో వాళ్ళున్నారు. నా గగ్గోలు ఎవరికీ వినబడలేదు. ఆ తరువాత యిప్పటివరకూ గొప్పగొప్ప బాధలనుభవించాను. కాని ఆ సమయంలో కలిగినంత దు:ఖం మరెప్పుడూ కలుగలేదు.
ఇక రామచంద్రునితో ఎప్పుడూ మాట్లాడనేవద్దను కున్నాను. తింటానికి యిక ఎప్పుడూ ఏమీ పెట్టనేపెట్టకూడదనుకున్నాను. కాని కాలువదాటి వంతెన వద్దకు వచ్చాడో లేదో నేను పరుగెత్తి రథంమీద ఎక్కాను. అసలేమీ జరగనే లేదన్నట్లు పొంగిపోయాను.
రామలీల సమాప్తమైంది. ఇక పట్టాభిషేకం కాబోతోంది. కాని ఎందుకనో ఆలస్యమౌతోంది. బహుశా చందా తక్కువగా వసూలైనట్లుంది. ఇప్పుడు రామచంద్రుణ్ణి పలకరించేవాళ్ళే లేరు. ఇంటికి పంపలేదు. సరిగా భోజనమైనా ఏర్పాటు చెయ్యలేదు. చౌదరీ సాహెబుగారింట్లో రోజుకొక్కసారి పగలు ఏమూడు గంటలకో తిండి పెట్టేవాళ్ళు. మిగతారోజంతా మంచినీళ్ళుకావాలా? అని అడిగే దిక్కయినా ఉండేది కాదు. కాని అతనంటే నాకు గల భక్తి శ్రద్ధలు యిప్పటికీ అలాగే ఉన్నాయి. నా దృష్టిలో అతను యిప్పుడుకూడా రామచంద్రుడే. ఇంట్లో నాకేమైనా చిరుతిండి పెడితే అది తీసుకెళ్ళి రామచంద్రుడికిచ్చి వచ్చేవాణ్ణి. అతనికి పెట్టినప్పుడు కలిగే ఆనందం నేనుతింటే ఎప్పుడూ కలిగేదికాదు. మిఠాయో, పండో ఏది దొరికినా వెనకాముందూ చూడకుండా రచ్చచావిడి వైపుకు పరిగెత్తువాణ్ణి. రామచంద్రుడక్కడ దొరక్కపోతే నలువైపులా గాలించేవాణ్ణి. అతనా వస్తువు ఆరగించేవరకూ నా మనసు కుదుటపడేదికాదు.
సరే, పట్టాభిషేకపురోజు వచ్చింది. రామలీలా మైదానంలో ఒక బ్రహ్మాండమైన పందిరివేశారు. దాన్ని చక్కగా అలంకరించారు. భోగంమేళంకూడా వచ్చింది. సాయంత్రానికి శ్రీరామచంద్రుని ఊరేగింపు బయలుదేరింది. గడపగడపకూ హారతులిచ్చారు. వాళ్ళ వాళ్ళ శ్రద్ధాభక్తులకు తగినట్లుగా ఒకడు రూపాయలిస్తే, మరొకడు రూకలిచ్చాడు. మానాన్న పోలీసు ఆఫీసరు. అందువల్ల ఆయన ఏమీ యివ్వకుండానే హారతిచ్చాడు. అప్పుడు నాకు ఎంత లజ్జ వేసిందో చెప్పలేను! ఆ సమయంలో అదృష్టవశాత్తూ నావద్ద ఒకరూపాయి ఉంది. దసరాకుముందు మా మామయ్య వచ్చినప్పుడు యిచ్చిందా రూపాయి. అది నేను దాచి ఉంచుకున్నాను. దాన్ని దసరా రోజుల్లో కూడా ఖర్చు పెట్టలేకపోయాను. వెంటనే నే నా రూపాయి తెచ్చి హారతి పళ్ళెంలో వడ్డించాను. నాన్నగారు నావైపు క్రోధంగా చూచి ఊరుకున్నారు. ఆయన నన్నేమి అనలేదు. కాని ముఖం చూస్తే మాత్రం నా ఈ ‘పోకీరీ’ పని వల్ల ఆయన గొప్పతనానికి ‘మచ్చ’ వచ్చినట్లు భావించాడని మాత్రం తోస్తుంది. రాత్రి పది గంటలు కావచ్చేసరికి ఊరేగింపు పూర్తయింది. హారతిపళ్ళెం రూపాయలతోనూ, కానులతోనూ నిండిపోయింది. సరిగ్గా చెప్పలేనుగాని, యిప్పుడు నా అంచనాప్రకారం నాలుగైదువందలకు తక్కువ ఉండవనుకుంటాను. చౌధరీగారు అంతకంటే ఎక్కువే ఖర్చుచేశారు. ఏదోవిధంగా కనీసం మరో రెండువందలైనా వసూలయ్యేదెలాగా అని ఎంతగానో ఆలోచిస్తున్నాడు. అందుకు వేశ్యలద్వారా సభలో వసూలుచేయటమొకటే ఆయనకు ఉత్తమమైన ఉపాయమనిపించింది. జనం అంతా వచ్చి కూర్చున్న తరువాత సభ మంచి రసపాకంలో ఉన్నప్పుడు, చంచలీబాయి గనుక రసికుల చేతులు తాకుతూ తన హావభావాలన్నీ ప్రదర్శిస్తుంటే యింకా సందేహమెందుకూ! సిగ్గుపడుతూ గూడా ఎంతోకొంత యిచ్చి తీరాల్సిందే! చచ్చి తీరాల్సిందే! చందలీబాయి, చౌధరీగారు మంతనాలు సాగించారు. అదృష్టవశాత్తు నేనా రెండు జీవాల మాటలూ వింటూనే ఉన్నాను. ‘కుర్రకుంక ఏమి అర్థం చేసుకు ఏడుస్తాడులే’ అనుకున్నట్లున్నాడు చౌధరీగారు. కాని భగవంతుడి దయవల్ల కాస్త బుర్ర ఉన్నవాళ్ళే ఉన్నారిక్కడ. కథంతా అర్థమౌతూనే ఉంది.
చౌధరీ: నా మాట విను చంచలీ! నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు. మన వ్యవహారానికి యిదే మొదలు కాదుగా! భగవంతుడు కరుణిస్తే నువ్వు ఎన్నడూ యిక్కడికి వస్తూ పోతూనే ఉంటావు. ఈసారి చందా చాలా చాలా స్వల్పంగా వచ్చింది. లేకుంటే నీతో యింత గట్టిపట్టు పట్టేవాణ్ణా!
చంచలీ: తమరు నా మీద జమీందారీ ఎత్తులు ప్రదర్శిస్తున్నారే! అయ్యగారి పప్పులు యిక్కడేమీ ఉడకవు. బలేబాగుంది! రూపాయలేమో వసూలు చెయ్యాలి? తమరేమో దర్జాగా కూచుంటారూ? సంపాదనకు భలే మార్గం కనిపెట్టారే! ఈ రాబడితో నిజంగా తమరు కొద్దిరోజుల్లోనే మహారాజులైపోతారు. దీనిముందు జమీందారీ దాసోహమనాల్సిందే. ఇంతెందుకూ! రేపటి నుంచీ వేశ్యాగృహ మొకటి ప్రారంభించండి. దేవుని సాక్షిగా చెబుతున్నాను; కోట్లకు పడగెత్తుతారు!
చౌధరీ: నీకేమో పరిహాసంగా వుంది. ఇక్కడేమో ఉక్కిరి బిక్కిరిగా ఉంది నాపని.
చంచలీ: తమరు నాకే పాఠాలు నేర్పుతున్నారు. నిత్యం తమ వంటివారి నెందరినో తైతక్కలాడిస్తున్నాను తెలుసాండీ?
చౌధరీ: ఇంతకీ నీ అభిప్రాయమేమిటో చెప్పు
చంచలీ: వసూలైనదాంట్లో సగం నాకూ సగం మీకూ! మరి ”ఊ” అనండి!
చౌధరీ: అయితే సరేకానీ!
చంచలీ: సరే! అయితే ముందు నా వంద నాకిచ్చెయ్యండి. తర్వాత మళ్ళీ పేచీ పెడతారు.
చౌధరీ: బలేదానివే! యిదీ, అదీ రెండూ కాజేద్దామనే?
చంచలీ: అబ్బా! అయితే నా కిరాయి వదులుకుంటాననుకున్నారు కాబోలు పాపం! ఏమండీ మీ తెలివితేటలూ! తాడెక్కే వాడికి తలదన్నేవాళ్ళూ ఉంటారండోరు!
చౌధరీ: అయితే కిరాయి రెండుసార్లు తీసుకుందామనుకున్నావా?
చంచలీ: తమకు నూటికి నూరుపాళ్లు యిష్టమైతేనే, లేకపోతే నాకు వంద రూపాయలకేమీ డోకాలేదుగా! ఊళ్ళో వాళ్ళ జేబులు తవుడుతూ తిరగటానికి నాకేం తీటా?
చౌధరీ ఎత్తులేమీ పారలేదు. చంచలీబాయికి లొంగక తప్పలేదు. నాట్యం ప్రారంభమైంది చంచలీబాయి బహు పోకిరీ పిల్ల. అసలే మంచి వయస్సులో ఉంది. పైగా మంచి అందగత్తెకూడాను. ఆమె ఒయ్యారం, హావభావాలూ అతి విలక్షణమైనవి. నాకుకూడా మత్తెక్కిస్తున్నాయి. ఏ మనుషుల స్వభావాలు ఎటువంటివో పసిగట్టటంలో అందువేసిన చెయ్యి. ఎవరి ఎదుట మోడీవేసి కూర్చున్నా ఎంతో ఒకంత రాబట్టిందన్నమాటే. ఐదు రూపాయలకు తక్కువ ఎవడూ యిచ్చి ఉండడు. నాన్నగారి ఎదుటికి కూడా పోయి బైఠాయించింది. నేను సిగ్గుతో క్రుంగిపోయాను. ఆమె నాన్నగారి చెయ్యి పట్టుకున్నప్పుడు కుంచించుకుపోయాను. ‘నాన్నగారు తప్పకుండా దాని చేతిని విదిలించేస్తారు. బహుశా చివాట్లు కూడా పెడతారు’ అనుకున్నాను. కాని ఇదేమిటి? ఆరిభగవంతుడా! నాకళ్ళేమీ దగా పడటంలేదు గదా! నాన్నగారు మునిపళ్ళతో నవ్వుతున్నారు. అటువంటి మందహాసం ఆయన ముఖంలో నేనెన్నడూ చూడలేదు. ఆయన నేత్రాల్లో అనురాగం పొంగులువారుతున్నది. ఆయన రోమాలన్నీ పులకిస్తున్నాయి. కాని భగవంతుడు నాపరువు కాపాడాడు. అదుగో, ఆయన మెల్లగా చంచలీబాయి కోమల హస్తాలనుండి తన చేతిని విడిపించుకున్నాడు. అరె! మళ్ళీ అదేమిటి! చంచలీ ఆయన మెడచుట్టూ చేతులు వేస్తోందే. ఈసారి తప్పకుండా నాన్నగారు దాన్ని బాదేస్తారు. లంజకు బొత్తిగా సిగ్గేలేదు.
ఇంతలో ఒక మహాశయుడు చిరునవ్వుతో యిలా అన్నాడు – చంచలీ! నీ పప్పులు ఉడకవు తెలుసా! ఎందుకుగాని మరోచోటికి వెళ్ళటం మంచిది.
ఆయన నా మనసులో ఉన్నమాటే అన్నాడు. ఉన్నదున్నట్లుగానే అన్నాడు. కాని
ఎందుకనో తెలియదు. నాన్నగారు ఆయనవంక క్రోధంగా చూచారు. మీసాలు కూడా మెలివేశారు. నోరు తెరచి ఏమీ అనలేదు కాని ఆయన ముఖవైఖరి చూస్తే మాత్రం ”కోమటికి నీకేం తెలుస్తుంది. మనసంగతి? ఇటువంటి సందర్భాల్లో ప్రాణత్యాగం చెయ్యటానికికూడా సిద్ధమే. రూపాయ లోకలెక్కా? జమా? దమ్ములుంటే కాచుకో! నీ కంటె రెట్టింపు యివ్వకపోతే నా ముఖం చూపిస్తే అప్పుడను” అని సంతోషంగా గర్జిస్తూ అంటున్నట్లనిపించింది. ఎంత ఆశ్చర్యం! ఎంత అనర్థం! ఓ భూదేవీ! నీ వింకా బ్రద్దలు కావేం; ఓ ఆకాశమా! నీ వింకా అలాగే ఉన్నావేం? అరె! నాకు చావైనా రాదేం? నాన్నగారు జేబులో చెయ్యి పెడుతున్నారు. ఆయనేదో వస్తువు బయటికితీసి శ్రేష్ఠిగారికి చూపించి చంచలీ చేతిలో పెట్టారు. అమ్మో! అది నవర్సు. నలువైపులా చప్పట్లు మ్రోగినరు. అవమానం పొందినది శ్రేష్ఠిగారో, నాన్నగారో తేల్చిచెప్పలేనుగాని నాన్నగారు నవర్సుతీసి చంచలీకి యివ్వటం మాత్రం చూచాను. అప్పుడు ఆయన కళ్ళల్లో గర్వం, ఉల్లాసం ఎంతగా మెరసిపోతున్నాయనుకున్నారూ? తానేదో గొప్ప ఉదారమైన మహోపకారం చేశాడా అన్నంతగా పొంగిపోతున్నారు. నేను హారతిపళ్ళెంలో రూపాయి వేసినప్పుడు నన్ను నమిలి మ్రింగివేస్తారా అన్నట్లుగా నావంక చూచింది. ఈనాన్నగారే! నేను చేసిన ఆ సత్కార్యం ఆయన హోదాకు హాని కలిగించేదయింది. కాని యిప్పుడీ అసహ్యమూ, నీచమూ, నింద్యమూ అయిన తన ప్రవర్తనకు మాత్రం గర్వంతోనూ, ఆనందంతోనూ ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నారు.
చంచలీ మనోహరమైన ఒక మందహాసం విసిరి నాన్నగారికి నమస్కరించి ముందుకుసాగింది. కాని నేనక్కడ ఉండలేకపోయాను. సిగ్గుతో నాతల వాలిపోతోంది. నేను కళ్ళారా చూసిన విషయం కాకపోతే ఎంతమాత్రం నమ్మేవాణ్ణికాదు. నేను బయట విన్నవీ, కన్నవీ అన్ని విషయాలూ అమ్మకు తప్పకుండా రిపోర్టు చేసేవాణ్ణి. కాని యీ సంగతి వింటే ఆమెకు చాలా కష్టం కలుగుతుందని తెలుసు నాకు. అందుకనే నీవిషయాన్ని మాత్రం దాచిపెట్టాను.
రాత్రంతా కచ్చేరీ జరుగుతూనే ఉంది. తబలా దరువులు చెవులకు వినిపిస్తూనే వున్నాయి. మనసులోమాత్రం పోయి చూదామనే ఉంది. కాని ధైర్యం చాలటంలేదు. నాముఖం లోకానికెలా చూపించనూ? అక్కడెవరైనా నాన్నగారి ప్రస్తావనతెస్తే నేనేం చెయ్యనూ?
మరునాడుదయమే రామచంద్రుడికి అంపకాలు. నేను నిద్రమంచంమీది నుంచి లేవగానే కళ్ళు నులుముకుంటూ పందిరివైపుకు పరుగెత్తాను. రామచంద్రుడప్పటికే వెళ్ళిపోయాడేమోనని భయపడ్డాను. అక్కడికి పోయి చూస్తే వేశ్యలబళ్ళు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. మంగళ్ళచేత తీరుగా ముఖాలు దిద్దించుకుని డజనుల కొలదీ గుంపుగా ఆ వేశ్యలచుట్టూ ముట్టడిచేశారు. నేను వాళ్ళవైపు కన్నెత్తికూడా చూడలేదు. తిన్నగా రామచంద్రుని వద్దకు వెళ్ళాను. లక్ష్మణుడూ, సీతా యిద్దరూ ఏడుస్తున్నారు. రామచంద్రుడు మూటా ముల్లె భుజానికి తగిలించుకుంటూ వాళ్ళను సముదాయిస్తున్నాడు. అక్కడ నేనుదప్ప మరెవరూలేరు. నేను కుంచించుకుపోయిన స్వరంతో రామచంద్రుణ్ణి ప్రశ్నించాను.
– ”నిన్ను సాగనంపటం అయిందా?”
”కావటానికి అయింది. మమ్మల్నింకా సాగనంపే దేముంటుందీ? చౌధరీగారు వెళ్ళిపొమ్మని చెప్పేశారు. వెళ్ళిపోతున్నాం.”
”మరి డబ్బూ, గుడ్డలూ యివ్వలా?”
”ఇంకా యివ్వలేదు. ప్రస్తుతం పైకం మిగలలేదు. మరోసారి వచ్చి తీసుకు వెళ్ళు అన్నారు చౌధరీగారు.”
”ఏమీ ఇవ్వలేదన్నమాట.”
” ఒక్క కానీ ఇవ్వలేదు ఏమీ మిగలలేదంటున్నారు. కాసిని డబ్బులిస్తారేమో చదువుకునేందుకు పుస్తకాలు కొనుక్కుందాం అనుకున్నాను. కాని కానీ గూడా యివ్వలేదు. ప్రయాణ ఖర్చులైనా ఇవ్వలేదు. ఎంతదూరంలే నడిచిపోదురూ అంటున్నారు.”
చౌధరీవద్దకు పోయి నోటికివచ్చినట్లు తిడదామన్నంత కోప మొచ్చిందిననాకు. వేశ్యలకేమో రూపాయలూ, బండ్లూ అన్నీ ఏర్పాటా? రామచంద్రునికీ, అతని స్నేహితులకూ మాత్రం బండిస్తున్నానా? గత రాత్రి చంచలీబాయికోసం పదులూ, ఇరవైలూ త్యాగంచేసిన వాళ్ళదగ్గర వీళ్ళకివ్వటానికి బేడలు, పావలాలైనా లేకపోయినా యేం? నాన్నగారు కూడా చంచలీకి ఒక నవర్సు ఇచ్చారు. మరి వీరికెంత యిస్తారో చూద్దాం. నేను పరుగెత్తుకుని నాన్నగారి దగ్గరకెళ్ళాను. వారు ఎక్కడికో ఆచూకీకి వెళ్ళబోతున్నారు. నేను రావటం చూచి ”ఎక్కడ తిరుగుతున్నావురా? చదువుకునే టైములో తిరగాలనిపిస్తోందా?” అన్నారు.
”పందిరి వద్దకు వెళ్ళాను. రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకు చౌధరీగారు ఏమీ యివ్వలేదు.” అన్నాను.
”అయితే నీకెందుకురా దిగులు?”
”వాళ్ళు వెళ్ళేదెట్లా? వాళ్ళవద్ద ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులులేవు”.
”అయితే ప్రయాణ ఖర్చులైనా యివ్వలా? చౌధరీగారు బలే అన్యాయం చేశారే!”
”మీరు రెండు రూపాయిలిస్తే పాపం వాళ్ళకిచ్చి వస్తాను. ఆ మాత్రం ఉంటే వాళ్ళు ఇల్లు చేరతారు”
”ఫో అవతలికి! నీ పాఠాలు చదువుకో నాదగ్గర డబ్బులేదు” ఉరిమి చూస్తూ అన్నారు నాన్నగారు.
ఈ మాటంటూ గుర్రంమీదెక్కి వెళ్ళిపోయారు. ఆ రోజునుండీ నాన్న గారంటే నాకుండే గౌరవం అంతరించిపోయింది. ”నాకు ఉపదేశాలివ్వటానికి మీకెంతమాత్రం హక్కులేదు” అనేది నా హృదయం. నాకు ఆయన ముఖం చూస్తేనే అసహ్యంవేసేది. ఆయన చెప్పినదానికి సరిగా వ్యతిరేకమైన పనిచేసేవాణ్ణి. అందువల్ల నాకే అపకారం జరిగినాసరే అప్పుడు నా అంతరాత్మ తిరుగుబాటు ఆలోచనలలోనే మునిగి ఉండేది.
నావద్ద రెండణాలకానులు మాత్రమున్నాయి. నేనవి తీసుకువెళ్ళి సిగ్గుపడుతూ రామచంద్రుని కిచ్చాను. ఆ డబ్బులు చూచి రామచంద్రునికి అంత సంతోషం కలుగుతుందనుకోలేదు నేను. దప్పిగొన్నవాడికి నీళ్ళు లభించినట్లుగా ఎగిరి గంతేశాడు.
ఆ రెండణాల డబ్బులూ తీసుకుని వాళ్ళు ముగ్గురూ సెలవు తీసుకున్నారు. వాళ్ళను ఊరిబయటదాకా సాగనంపటానికి వెళ్ళింది నే నొక్కడినే.
వాళ్ళను సాగనంపి తిరిగివస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళునిండాయి. కాని హృదయంమాత్రం ఆనందంతో పొంగిపోయింది.

ప్రేమ్‌చంద్‌