రామ‌మ‌యం కాదు రాజ‌కీయం

Ramamayam is not politics– బీజేపీ ఈవెంట్‌గా మారుతున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమం
– ఎన్నికల లబ్ది కోసం ఆరాటం
– వెళ్లాలా వద్దా అని ప్రతిపక్షాల డైలమా
– వెళ్లమని ఇప్పటికే స్పష్టం చేసిన సీపీఐ (ఎం)
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ యంత్రాంగం యావత్తూ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోనే మోహరిస్తోంది. తద్వారా రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టింది. మరోవైపు రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనే విషయంపై అనేక పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఒక్క సీపీఐ (ఎం) మాత్రమే తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి హాజరు కాబోనని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం బీజేపీ ఈవెంట్‌గా మారిపోయింది. రాబోయే ఎన్నికలలో మోడీకి, పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటోంది. ఎన్నికల విజయాల కోసం మతాన్ని వాడుకోవడం బీజేపీకి కొత్తేమీ కాదు. 1990వ దశకం నుండే అది ప్రారంభమైంది. 1991 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభలో బీజేపీ రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 1984 ఎన్నికలలో తొలిసారిగా బీజేపీ ఎన్నికల బరిలో దిగింది. అప్పుడు ఆ పార్టీకి లభించింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. ఒకప్పటి జనసంఫ్‌ు పొందిన స్థానాలతో పోలిస్తే ఇది తక్కువే. 1991 సాధారణ ఎన్నిక లలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నది ఆ రాష్ట్రం లోనే. సీట్లతో పాటు ఓట్ల శాతాన్ని కూడా బీజేపీ పెంచు కోగలిగింది. 1984లో 7.4 శాతం ఓట్లు పొందిన బీజేపీ, 1989లో 11.4శాతం, 1991లో 20.1శాతం ఓట్లు రాబట్టింది. హిందూత్వ పార్టీగా ముద్ర వేసుకొని 1996 ఎన్నికల నాటికి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
హిందూత్వ వాదమే బలం
1997లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని ఇతర హిందీ రాష్ట్రాలలోనూ గణనీయమైన సీట్లు సాధించింది. దేశంలో బీజేపీ బలం నిలకడగా పెరగడానికి ప్రధాన కారణం దాని హిందూత్వ వాదమే. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామమందిరాన్ని నిర్మించాలన్న ఏకైక డిమాండ్‌తో 1990లో ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథయాత్ర ఆ పార్టీకి మంచి ఊపు ఇచ్చింది. ఫలితంగా యూపీలో కల్యాణ్‌సింగ్‌ నేతృ త్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా గతం….
మళ్లీ తెరపైకి…
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ తన అమ్ములపొది నుండి హిందూత్వ అస్త్రాన్ని మరోసారి బయటికి తీసింది. ఈ నెల 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పూజారి అవతారం ఎత్తబోతున్నారు. గతంలో హిందూత్వ వాదాన్ని తెరపైకి తెచ్చి, ఎన్నికల విజయాలు సాధించిన కమలదళం ఇప్పుడు కూడా అందివచ్చిన ఏ అవకాశాన్నీ జారవిడవడం లేదు. అదే హిందూత్వ వాదంతో ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి మరోసారి ఎన్నికలలో విజయం సాధించేందుకు సమాయత్తమవుతోంది.
ప్రతిపక్షాల డైలమా
రాబోయే లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమిగా ఏర్పడి ఉమ్మడి పోరు సాగించేందుకు సమాయత్తమవుతున్న ప్రతిపక్ష పార్టీలను నిలువరించేందుకు అయోధ్య కార్యక్రమాన్ని బీజేపీ ఓ ఆయుధంగా ఉపయోగించు కుంటోంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే వంటి కాంగ్రెస్‌ అగ్రనేతలకు, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఐక్య జనతాదళ్‌ నేత నితీష్‌ కుమార్‌ తదితర నాయకులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానాలు అందినా లేకున్నా ఈ కార్యక్రమంపై ప్రతిపక్ష నాయకులు మాత్రం గందరగోళంలో పడ్డారు. అధికార పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరవ్వాలా వద్దా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. రామమందిర అంశం లక్షలాది మంది హిందువుల మత మనోభావాలతో ముడిపడింది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు హాజరైనా కాకపోయినా వారు ఓటర్ల ముందు రెండు వాదనలు విన్పించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 22వ తేదీ ప్రతిపక్షాలకు కూడా ముఖ్య మైనదే. జాతిపిత మహాత్మా గాంధీని గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రార్థనా సమావేశంలో ఉండగా ఆయన శరీరంపై తుపాకీ తూటాల వర్షం కురిసింది. ‘హే రామ్‌’ అంటూ ఆయన నేలకొరిగారు. రామ భక్తుడైన గాంధీజీ జీవితాన్ని బలిగొన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ సభ్యుడేనన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. ప్రతిపక్ష పార్టీలు మరో విషయాన్ని కూడా ఓటర్ల దృష్టికి తేవాల్సి ఉంది. ఒకవేళ తాము ఈ కార్యక్రమానికి హాజరైతే ఓ బీజేపీ నాయకుడి వెనుక నిలబడాల్సి వస్తుందని, ఆయన సామాజిక మాధ్యమాలన్నింటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకు న్నారని, వాటి ద్వారా ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రచారం ప్రారంభిస్తారని తెలియజేయాలి. ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు మీరే గౌరవనీయులైన రక్షకులు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం నడుపుతుంది. భారత్‌ సహా ఏ ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజ్యాంగం అయినా ప్రధానిని నిరంకుశుడుగా, మత పెద్దగా ఉండేందుకు అనుమతించదు. మనది రాచరికం కాదు’ అని బీజేపీయేతర పార్టీల నాయకులు ఓటర్లకు తెలియజేయాలి.
పాన్‌-ఇండియా కథనం తప్పదు
ఈ నెల 22న జరిగే కార్యక్రమానికి ఏ మత నాయకుడు నేతృత్వం వహించడం లేదు. నిర్వహణ అంతా మోడీదే. పూరీ శంకరాచార్య ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి ముందు మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి పాన్‌-ఇండియా కథనాన్ని వండి వార్చాలి. ఈ కథనం కాశ్మీర్‌ లేదా పాకిస్తాన్‌ అంశాల కంటే భావోద్వేగం కలిగించాలి. ముఖ్యంగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలకు ఈ వంటకం ఎంతో అవసరం. రామజన్మభూమి తీర్థ క్షేత్రకు చెందిన మందిర నిర్మాణ కమిటీకి మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడు, పీఎంఓ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించారు. మిశ్రా నేతృత్వంలోని ఈ ప్రాజెక్టు ఈ నెల 22న మోడీని ‘హిందువుల హృదయ సామ్రాట్‌’గా నిలిపేందుకు తీవ్ర కృషి చేస్తోంది.
ఓటర్లకు ఏం చెప్పాలి?
ఈ పరిస్థితులలో ప్రతిపక్షాలు ఓటర్లకు ఏం చెప్పాలి? రాముడు రాజకీయాలకు అతీతుడన్న విషయాన్ని ప్రజల మనసులో నాటాలి. ఎన్నికలలో విజయం సాధించాలని  కోరుకుంటున్న రాజకీయ పార్టీకి ప్రజల మత విశ్వాసాలు సాధనంగా మారడాన్ని అనుమతించకూడదని స్పష్టం చేయాలి. ఓ హిందువు, రాముడిని విశ్వసించే వాడు బీజేపీకి ఓటరు కానక్కరలేదని నచ్చచెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పు మేరకే రామ మందిరాన్ని నిర్మించారన్న వాస్తవాన్ని ప్రతిపక్షాలు ప్రజలకు గుర్తు చేయాలి.
పౌరులు ఇలా ప్రశ్నించాలి
ఏ రాజకీయ పార్టీకైనా ఓటు వేయాలని అనుకునే పౌరుడు తన రోజువారీ జీవితంపై ప్రభావం చూపే అంశాలపై ప్రశ్నించాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటర్లు మోడీ ప్రభుత్వాన్ని ఏమని అడగాలంటే… ఉద్యోగావ కాశాలు కల్పించేందుకు మీరు ఏం చేశారు? ధరలను అదుపు చేసేందుకు ఏం చేశారు? ప్రజలకు ఆరోగ్యం, విద్య అందుబాటులో ఉంచేందుకు ఏం చేశారు? మన సరిహద్దులు సురక్షితంగా, భద్రంగా ఉండేందుకు ఏం చేశారు?…ఈ ప్రశ్నలన్నీ సంధించాలి.