బాలల కోసం ‘మల్లేల’ బొమ్మల రామాయణం

బాలల కోసం 'మల్లేల' బొమ్మల రామాయణంఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థంలో రామాయణ రచన అన్న మాట వినగానే కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘మరల ఇదేల రామాయణంబన్న’ అన్న మాటలు మదిలో మెదులుతాయి. అందులోనూ తెలుగులో ‘రంగనాథ రామాయణం’ వచ్చిన నాటి నుండి నేటి వరకు వందలాది రామాయణాలు వచ్చాయి. యింకా వస్తూనే ఉన్నాయి. ఇంతెందుకు ఇటీవల సౌత్‌ ఆఫ్రికాలో ఉంటున్న పదేండ్ల తెలుగు పిల్లవాడు రాపోలు ఆద్విక్‌ తాను విన్న, చవివిన రామాయణాన్ని తన మాటల్లో ‘ఆద్విక్‌ రామాయణం’ గా రాసుకున్నాడు. నేను ఇంతలా రామాయణం గురించి చెప్పడానికి కారణం ఇటీవల మరో రచయిత్రి బాలల కోసం సరళ వచనంలో, అందమైన చక్కని బొమ్మలతో రామాయణాన్ని చెప్పింది. బాలల కోసం కథలు రాసింది, గేయాలు రాసింది, పద్యాలు రాసారు… ఇంకా అన్నింటికి మించి మూడు దశాబ్దాల పాటు పిల్లలకు పాఠాలు చెప్పి, విద్యాబుద్ధులతో తీర్చిదిద్ది, ఇప్పుడు ఉద్యోగ జీవితం నుండి విశ్రాంతి తీసుకుని నేడు తనకు నచ్చిన రచనా రంగంలో కృషి చేస్తున్నారు. ఎంవీఎల్‌గా అందరికీ తెలిసిన ఆమె మల్లేల విజయలక్ష్మి.
2 జులై, 1963న ఖమ్మం పట్టణంలో పుట్టారు, విద్యాభ్యాసం అక్కడే జరిగింది. మల్లేల సరస్వతి, కేశవరావు తల్లిదండ్రులు. తన ఉద్యోగ జీవితం ప్రారంభించిన తొలినాటి నుంచి పదవీ విరమణ ఉపాధ్యాయినిగా వెలిగిన మల్లేల విజయలక్ష్మి తాను పనిచేసిన ప్రతిచోట పాఠాలు చెప్పడమే కాదు బడి కోసం, బడి పిల్లల వసతుల కోసం శ్రమించారు. ఉపాధ్యాయినిగానే కాక కవయిత్రిగా, వ్యాఖ్యాత్రిగా, వివిధ ఉద్యమాలతో మమైకమైన స్త్రీమూర్తిగానే కాక బాల సాహితీవేత్తగా, వివిధ సామాజిక మాధ్యమాల్లో వివిధ ప్రక్రియలు, రచనలు చేసిన రచయిత్రిగా సుపరిచితులు. విద్యార్థి దశలోనే కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షురాలుగా ఉన్న వీరు తర్వాత జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల పదవులను చేపట్టారు. సంగీత, సాహిత్య, అధ్యాత్మిక సేవలతో పాటు రచనల వైపు కూడా తన దృష్టిని కేంద్రీకరించిన మల్లేల ఐదు పుస్తకాలు ప్రచురించారు. వాటిలో ‘మమతల బంధాలు – జ్ఞాపకాల సుగంధాలు’ కవితా సంపుటి. ‘కరుణించి కాపాడు భద్రకాళి’ పద్య గేయ సంపుటి. ఇవేకాక ‘రక్షనీవే ముక్తీశ్వర!’ పేరుతో తన సంపాదకత్వంలో పద్య సంకలనం తెచ్చింది. ఇందులో ముక్త్యాల వాసుడైన శ్రీ ముక్తీశ్వర స్వామిని ‘అన్నపూర్ణ తోడ నరుదెంచు స్వామి / యాకలనిన వారి యార్తి దీర్ప / నలక బూనకయ్య హరుడ ముక్తీశ్వరా! / భక్తకోటి బాధ బాపు దేవ!’ అని ప్రార్థిస్తారీ కవయిత్రి. పద్యరచనలోనూ మల్లేల విజయలక్ష్మి శైలి మల్లెలాగా హాయిగా సాగడం విశేషం. పద్యం, గేయం, వచనమే కాకుండా ఆధ్యాత్మిక రచనలు కూడా మల్లేల చేసింది, ‘శ్రీదేవీ నివాసం – మణిద్వీపం’ ప్రచురించబడిన ఆధ్యాత్మిక గ్రంథం. సామాజిక మాధ్యమాల్లో రచనలు చేసేవారికి మల్లేల ‘మనసులో మాట’ బాగా తెలుసు. జాతీయ సేవా పథకం పురస్కారం, ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవ పురస్కారం, ఉత్తమ వ్యాఖ్యాతగా గౌరవ సత్కారాలు వీరు అందుకున్న సత్కారాల్లో కొన్ని. వీరి తాజా పుస్తకం ‘ఉత్తరాల ఊసులు – కవితల కబుర్లు’.
‘అమ్మే మన ఆది గురువు / అమ్మే మన పెద్ద బాలశిక్ష’ అంటూ అమ్మను గురించి అందంగా, అర్థమయ్యేలా చెప్పిన మల్లేల విజయలక్ష్మి గాయకురాలు కూడా! అందుకే పిల్లల కోసం వందలాది గేయాలు రాశారు. కథలు చెప్పారు. అన్ని దిన పత్రికల్లో వీరి రచనలు అచ్చయ్యాయి. తెలుగునాట వెలువడ్డ అనేక సంకలనాల్లో వీరు రచనలు వచ్చాయి. ‘అన్నా.. అన్నా.. / అయ్య వచ్చాడు / అరటి పండ్ల / గెల ఒక్కటి / మోసుకొచ్చాడు / చిక్కనైన / జున్నుపాలు / తీసుకొచ్చాడు / కొత్తవైన అంగీలు / పట్టుకొచ్చాడు / చక్కనైన పలకొక్కటి / చేతి కిచ్చాడు / బడికి వెళ్ళమంటు / బలప మిచ్చాడు..’ అంటూ బడి ముచ్చటను ఒక చోట వ్రాప్తే… మరోచోట ‘..తెలగంటె అమృతం / తెలుగేను అమరం’ అంటారు తేటగా.. తీయగా.. మల్లెల సువాసనలా మన ‘మల్లేలా.’ పిల్లల కోసం చక్కని కథలను కూడా రాశారు మల్లేల. అటువంటిదే ‘దాహం తీర్చిన ఇల్లు’ కథ. ఈ కథలో ఏమీ మాయలు, మర్మాలు, తంత్రాలు, మంత్రాలు ఉండవు. మన ఊర్లు, ఊరులోని సజీవ సంస్కృతిలో భాగమైన సాటి జీవాల పట్ల ఆచరించాల్సి విధానం చెబుతారు. ఒక కొంగకు, కొంగ కుటుంబానికి నీటికి ఇబ్బంది వస్తుంది. ఆ సమయంలో ఒక ఇంట్లో జీవాల కోసం పెట్టిన కుండీల్లో నీళ్ళుంటాయి. వాటితో అవి దాహం తీర్చుకుంటాయి. ఇంతే కథంతా! కానీ కథ చెబుతున్న విషయం, నేర్పుతున్న బాధ్యత కొండంత. మల్లేల బాలల కోసం ప్రచురించిన వాటిలో ప్రధానంగా చెప్పాల్సింది నేను పైన పేర్కొన్న ‘సంపూర్ణ బాలల బొమ్మల రామాయణం’. చక్కని శైలిలో, పిల్లలకు నచ్చే అందమైన బొమ్మలతో సాగే ఈ బాలల రామాయణం ఏడు కాండలతో సాగుతుంది. పిల్లలకు సంక్షిప్తత, క్లుప్తత ఉంటే బాగా దగ్గరవుతుంది ఆ రచన. ఆ రెండు మల్లేల బాలల రామాయణంలో ఉన్నాయి. ప్రతి కథను సాధ్యమైనంత తొందరగా ముగించడం, ప్రతి పాత్రను క్లుప్తంగా పరిచయం చేయడం ఇందులో మనం చూడవచ్చు. బాలకాండ, అయోధ్య కాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్దకాండ, ఉత్తరకాండలతో పాటు ఇందులో రామదాసు కీర్తలను కూడా పొందుపరిచారు రచయిత్రి. బాలల రామాయణమేకాక వీరి బాలల కథల సంపుటి ‘బాలలు మెచ్చే బహుచక్కని కథలు’ అచ్చులో ఉంది. త్వరలో మన పిల్లలకు తాయిలంగా అందనుంది. కవిత్వం, కథ. గేయం, వచన కవిత్వంతో పాటు బాధ్యతగా బాల సాహిత్య సృజన చేస్తున్న మల్లేల విజయలక్ష్మికి అభినందనలు. త్వరలో రానున్న వీరి ‘బాలల బొమ్మల భాగవతం’, బాలల కథలకు సాదరంగా స్వాగతం… జయహో బాల సాహిత్యం.
డా|| పత్తిపాక మోహన్‌
9966229548