నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌

ఖాట్మండు: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌ చంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన 78 ఏండ్ల పౌడెల్‌కు 33,702 ఎలక్టొరల్‌ ఓట్లు (64 శాతం)లభించగా, ఆయన ప్రత్యర్థి సీపీఎన్‌(యుఎంఎల్‌)కు చెందిన సుభాష్‌ చంద్ర నెంబ్‌వాంగ్‌కు 18,518 ఓట్లు (35.23 శాతం) లభించాయి. దీంతో పౌడెల్‌ ఎన్నికైనట్లు నేపాల్‌ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఎలక్టొరల్‌ కాలేజీలో మొత్తం 882 మంది ప్రజా ప్రతినిధులు (332 మంది ఎంపీలు, 550 మంది ఎమ్మెల్యేలు)ఉండగా ఓటింగ్‌లో 831 మంది (313 మంది ఎంపీలు, 518 మంది ఎమ్మెల్యేలు) మాత్రమే పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పిపి), నేపాల్‌ వర్కర్స్‌ అండ్‌ పీజెంట్స్‌ పార్టీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. పౌడెల్‌కు అనుకూలంగా 214 మంది ఎంపీలు, 352 మంది ఎమ్మెల్యేల ఓటు చేేశారు.పౌడెల్‌కు నేపాలీ కాంగ్రెస్‌తోబాటు ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ నేతత్వంలోని ఎనిమిది పార్టీల కూటమి మద్దతు తెలిపింది. మొదట నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్‌) అభ్యర్థికి మద్దతు ఇస్తానని చెప్పి, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్లేటు ఫిరాయించి, నేపాలీ కాంగ్రెస్‌ అభ్యర్థిని బలపరుస్తున్నట్టు ప్రధాని ప్రచండ ప్రకటించడంతో ఆయన ప్రభుత్వానికి యుఎంఎల్‌ తన మద్దతు ఉపసంహరించుకోవడం. ఆ వెంటనే నేపాలీ కాంగ్రెస్‌ ఆయనకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నా స్నేహితుడు రామ్‌ చంద్ర పౌడెల్‌కి హదయపూర్వక అభినందనలు’ అని నేపాలీ కాంగ్రెస్‌ చీఫ్‌ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ట్వీట్‌ చేశారు.2008లో నేపాల్‌ రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత జరిగిన మూడవ అధ్యక్ష ఎన్నిక ఇది. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది. అధ్యక్షుని పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. 1944 అక్టోబరు 14న ఓ మధ్యతరగతి రైతుల కుటుంబంలో జన్మించిన పౌడెల్‌ తన16 వయేటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు స్పీకర్‌గా, ప్రతిపక్ష నాయకునిగా వివిధ హౌదాల్లో పనిచేశారు.