– సుప్రీంకోర్టుకు క్షమాపణలు
– మళ్లీ ఆ విధంగా చేయమని హామీ
– పతాంజలి ఆయుర్వేద్ సిఇఒ బాలకృష్ణ అఫిడవిట్
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ వ్యాపారి, యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి ఆయుర్వేద సంస్థ జారీ చేసిన తప్పుడు ప్రకటనలపై క్షమాపణలు చెప్పింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేసినందుకుగాను క్షమాపణలు కోరుతూ గురువారం ఆఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఇంతకాలం జారీ చేసిన తప్పుడు ప్రచారాన్ని రాందేవ్ బాబా అంగీకరించినట్లయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీపై రాందేవ్ బాబా తదుపరి విచారణకు స్వయంగా హాజరు కావాలని మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాము జారీ చేసిన షోకాజ్ కంటెప్ట్ పిటిషన్‌కు వివరణ ఇవ్వడానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తులు హిమాకోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. డ్రగ్స్ అండ్ రెమెడిక్స్ యాక్ట్ 1954లోని 3,4 సెక్షన్లను రాందేవ్ బాబాతో పాటు పతంజలి ఆయుర్వేద్ సిఇఒ ఆచార్య బాలకృష్ణ ఉల్లంఘించినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ 2022లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం అసత్య ప్రచారాలను వెంటనే నిలిపేయాలంటూ పతాంజలి గ్రూపును గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ఆ హామీలను సంస్థ విస్మరించింది. దీనిపై కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాజాగా పతంజలి సంస్థ తప్పును ఒప్పుకుంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని సంస్థ డైరెక్టర్ బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కోర్టు నోటీసులకు బదులు చెప్పకుండా ఉన్నందుకు క్షమాపణ కోరుతున్నామని తెలిపారు.