రామ్మా గౌరమ్మ

Ramma Gaurammaపల్లవి : రామ్మా గౌరమ్మా పూవుల స్వాగతమే ఇస్తాం
పూవుల దండలో పసుపు ముద్దగనే పెడుతాం (కోరస్‌)
ఎన్నో యుగాల ఆవల పార్వతి
పూవులపైన ముచ్చట పడెనట
అన్న చేతిలో ప్రాణం పోయిన చెల్లినే బతికించిందట
ఏటేటా బతుకమ్మను చేసి ఆట ఆడమని ఆజ్ఞ ఇచ్చెనట
ఎంగిలి బతుకమ్మా నీవే సద్దులు బతుకమ్మా
వరాలు ఇవ్వమ్మా స్త్రీలకి పండగలివ్వమ్మా (కోరస్‌)
అనుపల్లవి: పొద్దూ పొద్దున లేచి దొరవారి చేను కెళ్లి ఒక్కొక్క పువ్వు తెచ్చి ఒడిలోన దాచుకున్నా బంతిపువ్వును తెంచి గునుగూ పువ్వును గుంజి నిలకడగా ఉన్న నీట తామర పూలు కోసి
చరణం : మబ్బులే గుమ్మిగూడి వచ్చేనట నీ ఆటలే చూసి కురుసునట
పువ్వులోని రంగులన్నీ చూసి హరివిల్లు చిన్నబోయెనట
పువ్వుల బతుకమ్మ పున్నమి వెన్నెల నీవమ్మా
బతుకుని ఇవ్వమ్మా మంచి భవితని ఇవ్వమ్మా
పసుపు గౌరమ్మ…
పసుపు కుంకుమలు ఇవ్వమ్మా
మా పచ్చని కాపురమే నీవు మెచ్చిన కైలాసం
చరణం : మీ అండనే మాకు ఉండగా
దిగులింకా మాకు లేదులే
భక్తి శ్రద్దల గౌరమ్మను పూజించి
ఏటేటా బతుకమ్మ చేస్తాములే
ఊరిని కాపాడు. వృద్ధుల, పిల్లల కాపాడు
పాడి పంటలని నీవు పచ్చగా కాపాడు
మగ మృగాలనీ చంపి ఆడపిల్లల కాపాడు
అడుగడుగున తోడుండీ
నీవే పండగ మాకివ్వూ
రామ్మా గౌరమ్మ పువ్వుల స్వాగతమే ఇస్తాం
పువ్వుల దండల్లో పసుపు ముద్దగా నిను పెడతాం (2)
– ఇ. నిర్మల