నవతెలంగాణ-పరిగి
విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో అస్వస్థకు గురైన 26 మంది విద్యార్థులను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనారోగ్యంగా ఉన్నా 6 గురు విద్యార్థులకు వైద్యం అందించాలని ఆస్పత్రికి పంపించారు. ఇతర విద్యార్థులకు ఆహారం, పండ్లు ఎలా ఉన్నాయి అని, బియ్యం మంచిగా ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. అరటి పండ్లు పచ్చివి ఉన్నాయని ఇకపై ఇలాంటివి కాకుండా మంచివి తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని మంచి వైద్యం అందేటట్టు చూస్తానని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మందులు ఇవ్వాలన్నారు. వర్షాకాలం ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విద్యార్థుల భోజనం, శుభ్రతలో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.