జర్నలిజానికి నిజమైన మార్గదర్శి రామోజీరావు

– జర్నలిస్టులు ఘన నివాళి
నవతెలంగాణ-కొత్తగూడెం
జర్నలిజానికి నిజమైన మార్గదర్శి రామోజీరావు అని, ఎంతోమంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన ఘనత ఈనాడుకే సొంతమని పలువురు జర్నలిస్టులు అన్నారు. ఇమంది ఉదరు కుమార్‌ అధ్యక్షతన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన రామోజీరావు సంతాప సభలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టులు దుద్దుకూరు రామారావు, జనుమాల రమేష్‌, వాహబ్‌, రాజేందర్‌, రాజేష్‌, నాగ చారి తదితరులు మాట్లాడారు. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందన్నారు. ఆయన మరణం పత్రిక రంగానికి తీరని లోటు అని జర్నలి స్టులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వెంకటేశ్వర్లు, ఈశ్వర్‌, దశరథ రజువ, భాస్కర్‌, పాపారావు, కుమార్‌, వాసు, విష్ణు, మహే ష్‌, నాగేశ్వరరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.
లాయర్స్‌ యూనియన్‌ నివాళి
ఈనాడు అధినేత రామోజీ రావు మృతికి ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ప్రగాఢ సంతపాన్ని వ్యక్తం చేసింది. ఏఐఎల్‌యూ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రమేష్‌ కుమార్‌ మక్కడ్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ యాభై సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఒక స్థానిక చిన్న పత్రికగా ప్రారంభం అయిన ఈనాడు, నాలుగేళ్ల వ్యవధిలోనే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల నుంచి వెలువడి, లక్ష సర్క్యులేషన్‌ గలిగిన పత్రికగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. వాడుక భాషలో వార్తలు ముద్రించడం, తాజా వార్తలు తెల్లారేలోపు పాఠకులకు చేర్చడం, వ్యక్తుల పేర్ల ముందు వెనుక అనవసరమైన గౌరవాలను తొలగించడం ఈనాడు ప్రారంభిస్తే, ఆ తరువాత అది జర్నలిజం విధానంగా మారిపోయిందని మక్కడ్‌ అన్నారు. ఈనాడు తొలి రోజుల్లో వామపక్ష మేధావులను, రచయితలను రామోజీరావు ఈనాడులో రిక్రూట్‌ చేసుకున్నారని, అభ్యుదయ భావాలతో పాఠకులను ఆకట్టుకుని పత్రికను అనతికాలంలోనే శరవేగంతో అభివృద్ధి చేసే వ్యూహంలో రామోజీరావు సఫలీకృతిలయ్యారని రమేష్‌ కుమార్‌ మక్కడ్‌ కొనియాడారు. జర్నలిజం స్కూలు స్థాపించి మేలు రకం జర్నలిస్టులను తయారు చేయటంలో, జర్నలిస్టుల్లో నైతిక ప్రమాణాలను అభివృద్ధి చేయటంలో రామోజీ రావు కృషి చేశారని ఆయన ప్రశంసించారు. కొన్ని మినహాయింపులున్నప్పటికీ తెలుగు జర్నలిజానికి రామోజీరావు సేవలు ప్రశంసనీయమని ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. సంతాపం తెలిపిన వారిలో ఏ.ఐ.ఎల్‌.యూ.కేంద్ర కౌన్సిల్‌ సభ్యులు జలసూత్రం శివరాం ప్రసాద్‌, కొత్తగూడెం కోర్టు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కటికం పుల్లయ్య, కిలారు పురుషోత్తమ రావు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.