రణకణ ధ్వని

Ranakana sound”హలో…”
”హలోవ్‌…”
”హలో నాన్నగారూ”
”హా… నువ్వా!”
”నేనే నాన్నగారూ నెంబర్‌ వన్‌ని”
”చెప్పు… నంబర్‌ వన్‌”
”మేం వేటకు వెళ్దామనుకుంటున్నాం”
”సరిగ్గా వినపళ్లేదు.. ఎక్కడికీ?”
”వేటకి.. వేటకి… వే..ట..కి”
”ఓహో.. అలాగా.. ఎవరెవరు వెళ్తున్నారు?”
”హలో…”
”హలో.. ఎవరెవరు ఎవరెవరు?”
”అందరం… అందరమందరం”
”హలో డాడీ హలో హలో…”
”ఎవర్రా అది?”
”నేను డాడీ నంబర్‌ త్రీని”
”వోరి నువ్వట్రా! ఏంట్రా!”
”అదే అన్నయ్య చెప్పాడు కదా… అక్కడికి”
”అక్కడికంటే ఓహో.. వేటకేగా?”
”ఎగ్జాట్లీ డాడీ…”
”వోకే. డన్‌. తొందరగా వెళ్లి, ఎర్లీగా రండి”
”హలో.. అప్పా… హలో…”
”వోర్నీ నువ్వట్రా నంబర్‌ ఏడు!”
”అవునప్పా, అన్నయ్య దగ్గర్నుంచి లాక్కుని మాట్లాడుతున్నా”
”లాక్కోవడం, పీక్కోవడం, గోక్కోవడం నీకు అలవాటేకానీ ఈ అప్పా ఎవర్రా?”
”నువ్వేనప్పా. వెరైటీగా పిలిచా పితాశ్రీ”
”మళ్లీ మరో పిలుపా, ఇంతకీ మ్యాటరేంటో”
”ఏం లేదు మహరాజ్‌! మేమంతా వేట అనబడే పిక్నిక్‌ అనబడే విహారయాత్రకి వెళ్తున్నాం”
”హలో… అలాగా… ఏడుగురూ వెళ్తున్నారు కదా, ఏడు నిమిషాలకోసారి ఫోన్‌ చెయ్యండి”
”అందరం వెళ్తున్నాం. అందరం… బై చెప్తున్నాం… బై.. బై.. బై… బై.. బై.. బై.. బై…”
”హలో… హల్లో… హ్హల్లో…”
”హలో.. నంబర్‌ వన్‌ అన్నయ్యా.. చెప్పు”
”నువ్వెవ్వరివో తెలీడం లేదు”
”ఈ టీటా ఫోనింతే అన్నయ్యా. వినిపించి చావదు. చార్జింగ్‌ పట్టుమని పది డైలాగులు మించదు”
”తెల్సింది లేరా. నువ్వు నంబర్‌ టూ వి కదూ”
”ఎగ్జాట్లీ అన్నయ్యా! ఏంటన్నయ్యా! అర్జంటయితే మెసేజ్‌ పెట్టకపోయావా.. హలో..లో”
”అంతకంటే అర్జంటు బ్రదర్‌.. మనం తెచ్చామే.. వేటకు వెళ్లి… హలో”
”అవునవును. ఎంత వేటాడాం.. ఎంత వేటాడాం.. ఎంత వేటాడెంత అలసిపోయాం.. హలో…హలో…”
”ఎంత మాంసం తిన్నాం.. ఎంత మద్యం తాగాం..ఎంత పొర్లాం దొర్లాం… ఇవట్రా ముఖ్యం?”
”మరేమిటో చెప్పు.. హలో…హలో”
”ఏం లేదు, తెచ్చాం కదా ఏడు చేపలు”
”అవునవును… తలా ఒక్కటీ, కష్టపడి, ఇష్టపడి, ఎంతో అవస్థపడి పట్టుకొచ్చేం… హలో”
”హలో.. వాటిని ఎండబెట్టాం కదా”
‘హలో… కదా!?”
”హలో… వాటిల్లో ఆరు చక్కగా బాగా, బ్రహ్మాండంగా ఎండిపోయాయి”
”వుండుండు.. నన్ను చక్కగా బాగా బ్రహ్మాండంగా అర్ధం చేసుకోనీ… అర్థమయింది… హలో.. అంటే ఏడో చేప ఎండలేదనే కదా!”
”నువ్వనేది కరెక్టుగా కరెక్టయిన కరెక్ట్‌. హలో ఇప్పుడేం చేద్దాం?”
”డోంట్‌ వర్రీ బ్రదర్‌… నేను ఫోన్‌ చేసి కనుక్కుంటా”
”హలో.. హలో… హలో…”
”ఏరు.. ఏం సంగతి?”
”నేనెవర్నో తెలీకుండానే సంగతంటావ్‌?”
”ఎవరైతేనేం భారుసాబ్‌, యహా సబ్‌కుచ్‌ చల్తాహై… ఫిర్‌ తాహై… జాడ్‌లూ హై”
”నేను నంబర్‌ టూ ని. నిన్న మేం సెవెన్‌ ఫిష్‌లు పట్టుకొచ్చాం. అందులో నువ్వొకడివి. నువ్వు ఎండలేదుట. హలో.. చేపేశ్వరరావ్‌… ఎందుకు?”
”ఓ.. హలోవ్‌… అదా సంగతి. నెంబర్‌ టూ నవాబూ… ఆరు చేపలూ ఎండాయి కానీ, గడ్డిమోపు అడ్డం రావడం వల్ల నేను ఎండలేదు అంతే… హలో.. హలో.. నాకో అర్జంట్‌ కాల్‌ రావాలి. ఫోన్‌ పెట్టెరు”
”హలో.. హలో.. గడ్డిమోపేనా? హలో”
”ఆ.. ఏమిటో చెప్పేడువు”
”ఏరు.. ఏమిటా పొగరు. కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి మేస్తున్నావా?”
”సారీ.. ఎండీ ఎండక.. చిరాకొస్తున్నది”
”అయితే.. హలో… చెప్పు.. ఏడో చేప ఎండకుండా ఎందుకు అడ్డుపడ్డావు?”
”ఏం చెయ్యను. ఆవు మేస్తే ఈ ప్రాబ్లం వుండేది కాదు”
”హలో.. హలో.. ఆవూజీ.. ఆవూజీ…”
”అవును నేనే. కౌగర్ల్‌ని. మ్యాటరేంటి?”
”గడ్డెందుకు మేయలేదు. హలో ఎండుగడ్డి ఎందుకు మేయలేదు?”
”నువ్వెవరో నాకు తెలీదు జహాపనా! సాధువుని కనుక చెప్తున్నా. గొల్లవాడు మేపకపోతే నేనేం చేస్తాను. వంట వాడూ, వడ్డించేవాడూ లేకపోతే నువ్వేం చేస్తావు.. హలో…”
”హలో… హలో… హలో యాదవ్‌జీ”
”హలో.. హలో… కహీయే క్యా బాత్‌హై?”
”ఆవుకి గడ్డి ఎందుకు వెయ్యలేదు. అంతా నువ్వే మేసేద్దామనా?”
”నేను ఏ గడ్డి తింటే నీకెందుకు? అవ్వ బువ్వ పెట్టకపోతే ఏదో ఓటి మెయ్యాలి కదా.. హలో..”
”హలో.. హలో… అవ్వా… వినపడుతోందా? నేనేనవ్వా..”
”హల… హల… నేనంటే ఎవరు? నేను…”
”నువ్వు కాదు నేనంటే నేను. నీకసలు కళ్లు అగుపడ్తున్నయా? కట్టుడు పళ్లు బావున్నయా? చెవుల సంగతేమిటి? నీ గొల్లవాడికింత బువ్వ పెడితే నీ సొమ్మేం పోయింది. హలో… వినపడిందా?”
”పిల్లాడు చంక దిగకుండా, గుక్కతిప్పుకోకుండా, ఏడ్చీ మొత్తుకుని బేజారు చేస్తే తెలుస్తుంది”
”పిల్లాడా! వాడెవడు? మనవడా. వాడి చెవిలో పెట్టు ఫోన్‌.. అరే.. ఒరే.. ఉరే… ఎందుకేడ్చావురా పుండాకోర్‌!”
”జావ్‌.. బే.. జావ్‌.. చీమ కుడితే తెలుస్తుందిరా!”
”అమ్మనా కొడకా! చెవి పోటు వచ్చేట్టు అరిచావు గదరా! బాబోరు! నాన్నోరు!”
”హలో.. హలో… ఏడుగురిలో నేనొకడ్ని. చీమగారున్నారా ప్లీజ్‌.. మాటాడాలి… హలో”
”నేనే చీమగారిని.. ఏం కావాలి? ఎవర్ని కుట్టాలి?
”ఎవర్నెందుకు కుట్టాలసలు. చెప్పు.. ఆ పిల్లాడ్ని, ఆ అవ్వ మనవడ్ని ఎందుకు కుట్టావు.. చెప్పు ప్లీజ్‌..”
”నా బంగారు పుట్టలో వేలు పె..డి..తే.. ”
”హలో… హలో.. హలో..హలో..!”
అన్ని దారులూ బిజీగా వున్నాయి. దయచేసి కాస్పేపు ఆగి ఫోన్‌ చెయ్యండి!!

– చింతపట్ల సుదర్శన్‌, 9299809212