రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈవీఎంల ర్యాండమైజేషన్‌

– కలెక్టర్‌ హనుమంతు కె జెండగే
నవతెలంగాణ-భువనగిరి రూరల్‌
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి విడుత ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ హనుమంతు కే జెండగే తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేటులో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి ఆన్లైన్‌ విధానం ద్వారా బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వివి ప్యాట్స్‌ ల కేటాయింపు (ర్యాడామేషన్‌ ప్రక్రియ) పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్స్‌ (ఈవీఎం) బ్యాలెట్‌ యూనిట్స్‌, కంట్రోల్‌ యూనిట్స్‌, వివి ప్యాట్స్‌, కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. మొదటి విడుత ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో 25 శాతం అధికంగా బ్యాలెట్‌ యూనిట్స్‌, కంట్రోల్‌ యూనిట్స్‌, వివిప్యాట్స్‌ కేటాయించడం జరిగిందని తెలిపారు. భువనగిరి నియోజక వర్గం సంబంధించి 257 పోలింగ్‌ కేంద్రాలకు 321 బ్యాలెట్‌ యూనిట్స్‌, 321 కంట్రోల్‌ యూనిట్స్‌, 359 వివిప్యాట్స్‌ కేటాయించడం జరిగిందని, అలేరు నియోజక వర్గానికి సంబంధించి 309 పోలింగ్‌ కేంద్రాలకు 386 బ్యాలెట్‌ యూనిట్స్‌, 386 కంట్రోల్‌ యూనిట్స్‌, 432 వివిప్యాట్స్‌ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు రిటర్నింగ్‌ అధికారి (జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌) జి వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఏ భాస్కరరావు, భువనగిరి రిటర్నింగ్‌ అధికారి అమరేందర్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి కూర వెంకటేశ్వర్లు, సయ్యద్‌ ముల్తానిషా బహుజన సమాజ్‌ పార్టీ నుండి బట్టు రామచంద్రయ్య, భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి నితీష్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నాగేశ్వరా చారి, ఇడిఎం సాయికుమార్‌లు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో నోడల్‌ అధికారులు పూర్తి యాక్షన్‌ ప్లాన్‌ తో పని చేయాలి..
ఎన్నికల నిర్వహణలో నోడల్‌ అధికారులు పూర్తి యాక్షన్‌ ప్లానుతో పనిచేయాలని కలెక్టర్‌ జెండగే ఆదేశించారు. వివిధ టీముల నోడల్‌ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ స్టేషన్లలో కావలసిన స్టేషనరీ మెటిరియల్‌ సిద్దం చేసుకోవాలన్నారు. ఫేస్బుక్‌, ట్విట్టర్‌ ఇతర సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ చేపట్టాలని, ఎలక్టోరల్‌ జాబితాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటరు హెల్ప్‌ లైన్‌ రిజిష్టర్స్‌ సరిగా నిర్వహించాలని, ఫిర్యాదులు పెండింగులో వుండవద్దని, ప్రతి పోలింగ్‌ కేంద్రాలలో వీల్‌ ఛైర్స్‌, వాలంటీర్లను సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల నిర్వహణలో వైద్య శిబిరాలు, పూర్తి స్టాక్‌ మందులతో, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్ళతో సిద్దం కావాలని నోడల్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు జి వీరారెడ్డి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ భాస్కరరావు, భువనగిరి ఆర్డిఓ అమరేందర్‌, ఎసిపిలు శివరాంరెడ్డి, వెంకటరెడ్డి, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.