సాయిధ పోరులో రంగ‌క్క స‌మ‌రం

Rangakka Samaram in armed combatదళ కమాండర్‌గా తెలంగాణా సాయుధ పోరాటంలో మహబూబ్‌నగర్‌ జిల్లాను వణికించింది కామ్రేడ్‌ రంగక్క. ఆమె పోరాటం గురించి స్వయంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో ప్రస్తావించాల్సి వచ్చింది. ఇంతటి చరిత్ర గల ఆ వీరవనితే కామ్రేడ్‌ కె.సత్యవతి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆ ధిశాలి పరిచయం నేటి మానవిలో…

నల్గొండ జిల్లా చివ్వెంల మండల కేంద్రం సత్యవతి జన్మస్థలం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యల్క అప్పారెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో ఈమె పెద్దవారు. మూడవ తరగతి వరకు సొంత ఊరిలోనే చదువుకున్నారు. సత్యవతికి 13 ఏండ్ల నాటికే ఆమె కుటుంబానికి పార్టీతో సంబంధాలు ఉన్నాయి. దేవులపల్లి వెంకటేశ్వరరావు, రాచకొండ రంగయ్య, కిషన్‌రావు(చందుపట్ల) వంటి నాయకులు వీరింటికి వస్తుండేవారు. దాంతో ఆ ఇంటిపై పోలీసులకు ప్రత్యేక దృష్టి ఉండేది. పోలీసుల ఒత్తిడి పెరగడంతో కొన్ని సందర్భాల్లో ఊరు విడిచి వెళ్లిపోయేవారు. ఆ పరిస్థితుల్లో ఆమె పార్టీకి మరింత చేరువయ్యారు.
ఉద్యమంవైపు ఆకర్షించబడి
డి.వి. వంటి నాయకులు రక్షణ కోసం వీరి ఇంటికి వెళ్లేవారు. వారికి భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఇలా పార్టీకి ఆమె కుటుంబం సహకరిస్తూ వుండేది. తన 13 ఏండ్లు వయసులో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించేవారు. లెవీ-గల్లా చెల్లింపుకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేవారు. లెవీ కింద వసూలు చేసిన ధాన్యాన్ని దాడుల ద్వారా స్వాధీనం చేసుకుని పంచిపెట్టేవారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని ప్రజలకు పిలుపిస్తే వేలాదిగా పాల్గొనేవారు. ఇవన్నీ ఆమెను ఉద్యమంవైపు ఆకర్షించబడి దళంలో చేరేలా చేశాయి.
దళ కమాండర్‌గా…
ఒకసారి వీరు అచ్చంపేట తాలుకా బల్మూర్‌ వద్ద హోంగార్డుపై దాడి చేశారు. అతని వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోసారి హుజూర్‌ నగర్‌ సమీపంలోని చౌటపల్లి వద్ద వీరి దళం విశ్రాంతి తీసుకుంటుంది. భూమి లోపలకు ఒక గుహ ఉండేది. పైన చిన్న రంద్రం ఉండి లోపల విశాలంగా అరలుఅరలుగా ఉండేది. అందులో ఉండగా మంచినీటి కోసం వీరి సభ్యులు బయటకు వచ్చారు. పిచ్చివాని రూపంలో ఉన్న పోలీసు ఇన్ఫార్మర్‌ చూసి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వీరిని చుట్టుముట్టారు. దళం అప్రమత్తమై అక్కడ నుండి సురక్షితంగా తప్పుకుంటుంది. అదే సమయంలో మిలట్రీ యాక్షన్‌ జరిగింది. దీంతో దళాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రజలను మిలట్రీ భయభ్రాంతులకు గురిచేయడంతో దళాలు అడవుల్లోకి వెళ్లాయి. అందులో భాగంగా సత్యవతి దళం నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. అక్కడే ఈమెకు దళ కమాండర్‌ బాధ్యతలు అప్పగించారు.
అంత జ్వరంలోనూ…
మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట, అమ్రాబాద్‌, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వీరి దళం సంచరించేది. అక్కడి చెంచులను, గిరిజనులను కూడగట్టి పోరాటాలు నిర్వహించేవారు. లెవీ కింద వసూలు చేసిన ధాన్యాన్ని స్వాదీన పరుచుకొని ప్రజలకు పంచిపెట్టేవారు. ఒకసారి అచ్చంపేట తాలుకా లక్ష్మాపురం వద్ద బోటిపై వీరి దళం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో సత్యవతికి జ్వరం వచ్చింది. ఆహారం దొరిక్క తేనే, తునికిపండ్లు, ఇతర దుంపలు తింటూ కాలం వెళ్లదీసేవారు. మిగతా సభ్యులు చెరువు వద్దకు నీళ్ళ కోసం వెళ్ళగా ఈమె ఒంటరిగా అక్కడే ఉన్నారు. శత్రువులు బైనాక్యులర్‌తో సత్యవతిని కనిపెట్టారు. పోలీసు అధికారి ఆమెపై కాల్పులు మొదలుపెట్టారు. అంత జ్వరంలోనూ ఆమె వెంటనే పోజిషన్‌ తీసుకుని కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. అక్కడ నుండి రాత్రి సమయంలో మూడు మైళ్ళ దూరం నడిచారు. నీరసం ఎక్కువవడంతో కానుగు చెట్టు ఆకులు కప్పుకుని ఆ రాత్రి గడిపారు. మరునాడు దగ్గర్లోని చెంచుగూడెనికి చేరుకుంటే వారు ఆమెను ఆదరించారు. నాలుగు రోజులు అక్కడే ఉండి జ్వరం తగ్గిన తర్వాత తిరిగి దళాన్ని కలుసుకున్నారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని దళ సభ్యులు భావించారు. ఇలాంటి సంఘటనలు కామ్రెడ్‌ సత్యవతి జీవితంలో ఎన్నో.
జిల్లాను వణికించింది
పోరాట విరమణ తర్వాత కూడా వీరి దళం అచ్చంపేట తాలుకా వల్లభాపురం, లక్ష్మాపురం తదితర ప్రాంతాల్లో ఉండేది. ప్రజలను కూడగట్టి పోరాటాలు నిర్వహించేవారు. దీంతో ఆమె గురించి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ఒక లేడీ మహబూబ్‌నగర్‌ జిల్లాను వణికిస్తుంది’ అన్నారు. ఆమెను లొంగిపోవల్సిందిగా సుందరయ్య ద్వారా బూర్గుల విజ్ఞప్తి చేశారు. దీంతో సుందరయ్య ఆమెను హైద్రాబాదుకు పిలిపించారు. నల్లకుంటలోని ఒక డెన్లో రక్షణ కల్పించారు. ఆ సమయంలో ఆమె గర్భవతిని (నల్లమల్ల ప్రాంతంలో ఉండగానే సహచరుడు. కె. నారాయణతో పార్టీ ఆధ్వర్యంలో వివాహం జరిగింది). కొద్దిరోజుల తర్వాత సత్తెనపల్లిలోని మిషనరీ హాస్పిట్‌కు డెలివరీ కోసం పంపించారు. తర్వాత మూడు మాసాల పాటు పార్టీ ఆదేశాల మేరకు అజ్ఞాతంలోనే గడిపారు. తర్వాత సూర్యాపేటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సూర్యాపేటకు వచ్చిన రెండు రోజులకు ఆత్మకూర్‌ (ఎస్‌)లో జరిగిన సూర్యాపేట రైతు మహాసభకు సత్యవతి, స్వరాజ్యం ప్రతినిధులుగా హాజరయ్యారు.
జైల్లోనూ పోరాటం
జైలు పరిస్థితులు అద్వానంగా ఉండేవి. చంటిపిల్లవాడు ఉండడంతో తన వంట తానే చేసుకుంటానని సత్యవతి మొండికేశారు. తన కోసం ఓ ఆయాను కూడా నియమించాలని కోరారు. చివరకు జైలు అధికారులు ఒప్పుకుని వంట చేసుకోనిచ్చారు. అంతేకాదు ఓ వృద్ధురాలిని సాయంగా కూడా ఇచ్చారు. వారానికి ఒకసారే సబ్బు, బకెట్‌ నీళ్లు ఇస్తానని జైలర్‌ నిబంధన పెట్టారు. దీన్ని వ్యతిరేకించి వారం రోజులు ఆందోళన చేశారు. చివరకు వారంలో రెండు సబ్బులు, రెండు బకెట్ల నీళ్లు ఇచ్చేలా ఒప్పుకున్నారు. తర్వాత సత్యవతిని చంచల్‌ గూడ జైలుకు తరలించారు. అక్కడ ఏడాది ఉన్నారు. ఇలా ఆమె చేసిన సాహసాలు ఎన్నో. పోరాట విరమణ తర్వాత కూడా ఈమె పార్టీలో చాలా కాలం కొనసాగారు. హూజూర్‌నగర్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మోటూరు ఉదయం, మానుకొండ సూర్యావతితో కలిసి ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఈమెకు ఏడుగురు కొడుకులు, ఒక కూతురు.

మూడు నెలల బాబుతో…
రైతు మహాసభ నుండి సాయంత్రం ఇంటికి వచ్చీ రాగానే పోలీసులు వచ్చారు. సత్యవతిని అరెస్టు చేస్తామంటే పార్టీ వారు అడ్డుపడ్డారు. మహిళను సాయంత్రం పూట అరెస్టు చేసి తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారు. దీంతో ఎస్‌ఐ హామీ ఇచ్చి సత్యవతిని ఆ రాత్రి అతని ఇంట్లో ఉంచుకొని మర్నాడు కోర్టులో హాజరుపర్చారు. కాకి చంద్రారెడ్డి ఈమెను విడుదల చేయించారు. అయితే ఇంటికి వచ్చిన రెండు, మూడు గంటలలోపే మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన పోలీసులు మళ్లీ అరెస్టు చేసి నాగర్‌కర్నూల్‌ తీసుకెళ్లారు. అప్పుడు ఆమె వెంట మూడు నెలల బాబు ఉన్నాడు. చేతికి బేడీలు వేసి రక్షణ కల్పించిన వారి అచూకీ తెలుపమంటూ అడవంతా తిప్పారు. ఒకచేతికి బేడీలు, మరో చేతిలో చంటిపిల్లోడు. మే నెలలో పదిహేను రోజుల పాటు ఎర్రని ఎండలో అడవిలో నడిపించారు. అయినా వారు ఆమె నుండి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. తొమ్మిది కేసులు మాత్రం బనాయించారు. చివరకు నాగర్‌కర్నూల్‌ జైల్లో నెల రోజులు ఉంచారు. అక్కడ నుండి మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించారు.

సేకరణ: ‘వీర తెలంగాణ మాది’ పుస్తకం నుండి