– విదర్భ లక్ష్య్యం 538, ప్రస్తుతం 248/5
– కరుణ్ నాయర్, అక్షరు పోరాటొం కీలకంగా మారిన చివరిరోజు ఆట
ముంబయి: విదర్భ-ముంబయి జట్ల మధ్య వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. 538పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ జట్టు నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 248పరుగులు చేసింది. విజయానికి విదర్భ జట్టు చివరిరోజైన గురువారం మరో 290పరుగులు చేయాల్సి ఉండగా.. మరో ఐదు వికెట్లు కూల్చితే ముంబయి విజయం సాధించనుంది. ఈ క్రమంలో విజయం కోసం ఇరు జట్లూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 92ఓవర్లు ఆడి 5వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 10 పరుగులతో నాల్గోరోజు ఆటను కొనసాగించిన విదర్భ.. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించింది. ఓపెనర్లు అథర్వ తైడే(32), ధ్రువ్ షోరే(28)లు 18.5 ఓవర్ల పాటు నిలబడ్డారు. శామ్స్ ములానీ 19వ ఓవర్లో అథర్వను ఔట్ చేసి ముంబయికి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే తనుష్ కొటియాన్.. ధ్రువ్ వికెట్ తీసి విదర్భకు షాకిచ్చాడు. అమన్ మొఖడె(32) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. యశ్ రాథోడ్(7)ను ముషీర్ ఖాన్ ఔట్ చేశాడు. 133 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విదర్భను కరుణ్ నాయర్ తో పాటు కెప్టెన్ అక్షరు వాడ్కర్ (91 బంతుల్లో 56 నాటౌట్) ఆదుకున్నాడు. కరుణ్ నాయర్.. 220 బంతులాడి 74పరుగులు చేశాడు. ఐదో వికెట్‌కు అక్షరుతో కలిసి 90 పరుగులు జోడించాడు. నాలుగో రోజు మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా ముషీర్ ఖాన్.. విదర్భను మరోసారి దెబ్బతీశాడు. కరుణ్ నాయర్‌ను అతడు పెవిలియన్‌కు పంపాడు. దీంతో విదర్భ ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో అక్షరు వాడ్కర్(56)తో పాటు హర్ష్ దూబే(11) ఉన్నారు. వీరిద్దరిమీదే విదర్భ గెలుపు అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ముంబయి జట్టు రికార్డుస్థాయిలో 41సార్లు ఈ టైటిల్‌ను చేజిక్కించుకోవడంతోపాటు వరుసగా 15సార్లు టైటిల్‌ను చేజిక్కించుకొన్న చరిత్ర కలిగి ఉండగా.. విదర్భ జట్టు మూడుసార్లు మాత్రమే ఈ ట్రోఫీని సాధించింది.