– సోషల్ మీడియా లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తి పై కేసు నమోదు..
– నిందితుడి ఇంటిపై దాడి చేసిన 9 మంది పైనా కేసు నమోదు..
– సీపీ డాక్టర్ బి. అనురాధ
నవతెలంగాణ – సిద్దిపేట అర్బన్
కొమురవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిపై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు సీపీ. డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఆదివారం సీపీ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన బాలిక ను మెడికల్ ట్రీట్మెంట్ కోసం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి అన్ని రకాల చికిత్సలు చేయించడం జరుగుతుందని, బాధితురాలితో పాటు, ఆమె తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందని తెలిపారు. కాగా గోప్యంగా ఉంచాల్సిన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేయడంతో పాటు, త్వరలోనే అతడి పై రౌడీ షీట్ కూడా తెరవనున్నట్లు, నిందితుడి ఇంటిపై దాడిచేసి వస్తువులను పగలగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు తోమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు సీపీ తెలిపారు.