పవర్ లూమ్స్ పరిశ్రమలకు పనులు కల్పించాలి: రాపోలు వీర మోహన్

నవతెలంగాణ – గంగాధర
జియో ట్యాగ్ విధానంతో నిమిత్తం లేకుండా పవర్ లూమ్స్ పరిశ్రమల్లో పని చేసే ప్రతి చేనేత పవర్ లూమ్స్ కార్మికులకు ప్రభుత్వం చేతినిండా పని కల్పించాలని  తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిందం, అంకారపు సునీత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం అధ్యక్షురాలు చిందం సునీత అధ్యక్షతన గర్శకుర్తి వస్త్రోత్పత్తి వ్యాపారులు, కార్మిక, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నేతన్న వెతలు.. చర్చా గోష్టిపై సమావేశంలో జరిగిగింది. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిందం, అంకారపు సునీత మాట్లాడుతూ గత ఎనిమిది మాసాలుగా పవర్ లూమ్స్ పై వస్తోత్పత్తులు నిలిచిపోయి పవర్ లూమ్స్ యజమానులు, ఆసాములు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పనులు లేక అవస్థ పడుతున్న పవర్ లూమ్స్ కార్మికులకు, పరిశ్రమలకు ప్రభుత్వం పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జియో ట్యాగ్ విధానాన్ని రద్దు చేసి ప్రతీ పవర్ లూమ్స్ కి ప్రభుత్వం వస్త్రోత్పత్తులు అందించి పనులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమ, పవర్ లూమ్స్ పై విజిలెన్స్ దాడులు జరుగకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పనులు లేక అవస్థ పడుతున్న నేత కార్మికులకు పనులు కల్పించే విధంగా చర్యలు చేపడతామని వారు భరోస కల్పించారు. చేనేత పవర్ లూమ్స్ పరిశ్రమల బాగోగులు తెలుసుకోవడానికి రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక పక్షాన తామ పర్యటిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవర్ లూమ్స్ కార్మికుల ఇబ్బందులు, సమస్యలను ఒక నివేదికగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు.
త్రిప్టు పథకం ప్రభుత్వం ఎనిమిది నెలలుగా డబ్బు జమ చేయక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఈ పథకాన్ని ప్రభుత్వం యధావిధిగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమలపై ఆధారపడ్డ చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద పనులు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత ఐక్యవేదిక నాయకులకు హామీని ఇచ్చారని, ఆ హామీని అమలు చేసే వరకు ప్రభుత్వం  వెంటపడి పథకం అమలు చేసేలా చేస్తామని అన్నారు. ప్రతి జిల్లాలో పవర్ లూమ్స్,  చేనేత వస్త్ర ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, టెస్కో షోరూమ్స్ ఏర్పాటు చేసి ఉత్పత్తులను అమ్మాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెస్కో షోరూం ఏర్పాటు చేస్తే తయారైన గుడ్డ ఉత్పత్తులు అమ్మకాలు జరిగితే చేనేత పవర్ లూమ్స్ కార్మికులు, ఆసాములు, యజమానుల పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లాల నాయకులు సదానందం, శ్రీనివాస్, రాపోలు వెంకటేశ్వర్లు, శ్రీగాద మైసయ్య, మోర ఆశన్న, వావిలాల శ్రీనివాస్, జడల చిరంజీవి, భాస్కర్, నారాయణ, లక్ష్మీనారాయణ, సురేష్, నాగన్న, కోటేశ్వరరావు, శారద, రమాదేవి, పద్మ, నీరజ, గంగాధర మండల పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి చిందం రాజమౌళి, వస్తోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అల్వాల విఠోభ, ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్  శ్రీనివాస్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు అన్నల్దాస్ లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి అల్వాల రాజేశం, పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు గుండా రాజేశం, చిందం సత్యనారాయణ, మాజీ సర్పంచులు కంటం రాజ మల్లయ్య, మహేశుని ఈశ్వరయ్యతోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు, యజమానులు, ఆసాములు పాల్గొన్నారు.