. సంక్షేమ పథకాలతో ధీమాగా ఉన్న ఎమ్మెల్యే జాజాల సురేందర్
. కాంగ్రెస్లో సుభాష్ రెడ్డి, మదన్మోహన్రావు పోటాపోటీ
. మాజీ ఎమ్మెల్యే ఏనుగు కాంగ్రెస్ లోకి?.
. బిజెపిలో ఎవరిది దారి వారికే
నవతెలంగాణ- రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తంగా మారే అవకాశం ఉంది. ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంగా 1962లో ఏర్పడింది. 62 లో కాంగ్రెస్ అభ్యర్థి టిఎన్ సదాలక్ష్మి మొదటి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. టిడిపికి కంచుకోటగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గం వరుసగా 1989, 1994, 1999లో టిడిపి తరఫున నేరెళ్ల ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేశారు. తెలంగాణ సెంటిమెంట్తో ఏనుగు రవీందర్ రెడ్డి టిఆర్ఎస్ తరఫున 4 సార్లు గెలుపొందగా, 2018లో ఏనుగు రవీందర్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జాజాల సురేందర్ 35,148 భారీ మెజార్టీతో గెలుపొంది, ఆదిలోనే కాంగ్రెస్ పార్టీని వీడి కారు ఎక్కారు. టిఆర్ఎస్ లోకి సురేందర్ వెళ్ళగానే, రవీందర్ రెడ్డి బిజెపిలో చేరారు. ఈ సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 102 గ్రామాలు, 35 గిరిజన తండాల పరిధిలో 2 లక్షల 14 వేల 15 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1 లక్ష 3 వేల 166 మంది ఉండగా, ఒక 1లక్ష 10 వేేేల 864 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 65 శాతం బీసీలు, 15% ఎస్టీలు, 10 శాతం ఎస్సీలు, 10 శాతం ఇతరులు ఉన్నారు. ఈ సంవత్సరం జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి అధికార పార్టీ అభ్యర్థిగా జాజాల సురేందర్ బరిలో ఉండగా, సంక్షేమ పథకాలు, బి ఆర్ ఎస్ చేసిన అభివృద్ధితోపాటు, పక్కన గల కామారెడ్డి నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గెలుపు పై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి సుభాష్ రెడ్డి, మదన్మోహన్ రావు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో మదన్ మోహన్ రావు జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోగా, జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతూ, స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి, పార్టీ ఆది నాయకుల మద్దతుతో బి ఫాం తెచ్చుకుంటామని సన్నిహిత వర్గాలు చెప్తుండగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ కేటాయించి, అధిష్టానం వాపస్ తీసుకొని షబ్బీర్ అలీ ఆశీస్సులతో జాజాల సురేందర్ కు కేటాయించారు. గతంలోనే అన్యాయం జరిగిందని, నియోజకవర్గంలో పేదల కోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆరోగ్య శిబిరాలు, ఉచిత బస్సు సౌకర్యాలతో పాటు ప్రజాసేవ చేస్తున్నానని టికెట్ మాకేనని సన్నిహితులు చెప్తూ, ఏకంగా ప్రచార రథాలను ప్రారంభించడం చర్చనీయానికి దారి తీయగా, ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతాడని, గతంలోనే నవ తెలంగాణ చెప్పింది నిజం అవుతుందని, సెప్టెంబర్ 17న కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాదులో నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో రవీందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే, ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ అధిష్టానం ముగ్గురిని బుజ్జగించి, ఒకటి చేస్తే మాత్రం కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. బిజెపిలో గతంలో పోటీచేసిన బాణాల లక్ష్మారెడ్డి, పైళ్ళ కృష్ణారెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలదొక్కుకోవడానికి విఫలమవుతున్నారు. ఏది ఏమైనా ఎల్లారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది.