పద్యం తెలుగుల ఆస్తి, వారసత్వ సంపద. వందలాది సంవత్సరాలుగా పెద్దలతో పాటు పిల్లలను కూడా అలరించింది పద్యం. నేటి ఆధునిక బాల సాహిత్య వికాసానికి ముందు ఈ పద్యమే తెలుగు పిల్లలను పాల్కురికి సోమన, బమ్మెర పోతన, వేమన, సుమతి శతకకారుల ద్వారా ఆనంద పరిచింది, దారి చూపింది. అంతేకాదు తరతరాలుగా తెలుగును వెలిగేలా చేసింది. ఆ కోవలోనే నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపెల్లికి చెందిన ‘కర్షకకవి’ కళ్లెపు రాజేశ్వరరావు తెలుగు పద్యాన్ని పద్య కథల ద్వారా పిల్లల పరం చేశారు. శ్రీమతి చిలుకమ్మ – శ్రీ కళ్లెపు రాయుడు వీరి అమ్మానాన్నలు. జూన్ 6, 1949న వరంగల్ జిల్లా గుడాడుపల్లిలో పుట్టిన వీరు యాభయ్యవ దశకంలోనే వరంగల్ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ప్రీ యునివర్సిటి చదువు మద్యలో ఆపేసి సేద్యం వైపు మళ్ళారు.
ఈ డెబ్బై అయిదేండ్ల తాతయ్య పాఠశాల దశలో ‘జొన్నకంకులు’ పద్య ఖండికతో తన పద్యవిద్యా ప్రస్థానానికి తొలి మైలు రాయిని లిఖించుకున్నారు. యాభైయేండ్ల వయస్సులో మళ్ళీ ఆ పద్య జెండాను నెత్తికెత్తుకుని పద్య పరుసవేది తెలిసిన రవవేదిగా మారారు. పద్యకవిత్వంలో కళ్ళెపు పుస్తకాలు అచ్చంగా ఇప్పటికి ఆరు అచ్చయ్యాయి. ‘శ్రీ హనుమత్ శతకము’ 2025లో వచ్చింది. ఇది తన స్వగ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై చెప్పింది. ‘వనములు హరించిపోయెను/ కవ వాతావరణమెల్ల కలుషితమయ్యెన్/ మనిషికి మనిషికి మధ్యను/ అనుబంధములంతరించె అక్కట’ అంటూ కందంలో అందంగా చెబుతారిందులో. తరువాత వచ్చిన ‘శ్రీ శివ శతకము’ రెండవ ముద్రణ పొందింది. ‘శ్రీ దాశరధీ! దయానిధీ శతకము’, ‘శ్రీ సత్యసాయి శతకము’, ‘శ్రీ కోటంచ లక్ష్మినారసింహ శతకము’, ‘శ్రీ వేంకటేశ శతకము’ ఇతర రచనలు. మరో రచన ‘గుడాడుపల్లి చిరుపరిచయము’ అచ్చుకు సిద్ధంగా ఉంది. ‘గోడకేసిన సున్నము యూడిరాదు/ కరిగిపోయిన కాలము తలిరిగిరాదు’, ‘అప్పులేనివాడు గొప్ప శ్రీమంతుడు/ తప్పుచేయకున్న ధర్మమూర్తి/ గొప్పచెప్పకున్న గొప్పవాడే యౌను/ విన్నపాలు వినుము వేంకటేశ’ వంటి పద్యపాదాలు వీరి రచనా పటిమకు తార్కాణాలు. పద్యకవిగా గుర్తింపుతో పాటు వివిధ సందర్భాల్లో కళ్లెపు రాజేశ్వరరావు సత్కారాలు గౌరవాలు అందుకున్నారు. వాటిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్తమ సాహితీవేత్త సత్కారం, స్వతంత్ర భారత అమృతోత్సవ సత్కారం, తెలంగాణ ఎనమిదవ ఆవిర్భావ దినోత్సవ సత్కారం, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విశేష సత్కారం వంటివి వాటిలో కొన్ని.
తన మనవలు, మనవరాళ్ళ వంటి పిల్లల కోసం ఈ ‘కళ్ళెపు తాత’ తన చేనులో చెల్కలో పండిన మక్క కంకులు, కాయలు, పండ్లలాగే పిల్లల కోసం ఏర్చి కూర్చి రాసి అందించిన పద్య తాయిలం ‘నీతి పద్య కథా మంజరి’. ఇది మూడు వందల పుటల బృహత్ పద్య కథా విపంచి. తేట తెలుగు నుడికారాన్ని ఆటవెలది ఛందస్సులో కూర్చి, భాషకు అందాన్నిచ్చిన కందాన్ని సేద్యం చేసి కూర్చిన ఈ గ్రంథం నూటా పదకొండు పద్య కథల సంపుటి. తరతరాలుగా అలరిస్తున్న ‘ఆవు-పులి’ కథ మొదలుకుని ‘దురాశ’ అనే స్నేహితుల కథ వరకు పద్యరూపంలో ఉన్నాయి. ఇవేకాక కళ్లెపు రాసిన పద్య కథలూ ఉన్నాయి. ‘గోమాతయొకనాడు కొడుకుకు పాలిచ్చి/ వెడలెను మేతకై యడవిలోకి’ ఇది ఈ గ్రంథంలోని తొలి పద్యం. అచ్చంగా ఆబాల గోపాలానికి అర్థమయ్యే పద్యం. ఇంకో కథ ‘కోడిపుంజు-కుక్క-నక్క’ పద్య కథలో ‘కోడిపుంజు కోర్కెతోడ శునకముతో/ చెలిమి చేయుచుండె బలముగాను/ కుక్కకూడ పుంజుకోస మెల్లప్పుడు/ ఎదురుచూచుచుండె ముదముగాను’ అని రాస్తారు. కళ్లెపు రాసిన కథలన్నీ పద్యంలో అలరారినప్పటికీ బాల బాలికల మనసు దోచే విధంగా రాయడం ఆయనకు తెలిసిన విద్య. కందంలో రాసిన కథ ‘కుందేలు-తాబేలు’. ఇందులో ‘కుందేలున్ తాబేలును/ అందముగా కలిసిమెలిసి హాయిగనుండన్/ కుందేలు అప్పుడప్పుడు/ మందగమనవనుచు దెప్పుమరి తాబేలున్’ అని రాసారు. స్నేహితులు కథ ‘ఇద్దరు మిత్రులు కలసియు/ చద్దన్నము కట్టుకొనియు జాగ్రత్తగనూ/ ప్రొద్దుననే పయనంబయి/ బుద్ది గను నడిచివారు పోవుచునుండెన్/ పట్టణంబునందు వ్యాపారమున్ జూడ/ నడిచిపోవుచుండ నడమనొక్క/ అడవి యుండెనందు నడచుచు నుండగా/ ఎలుగుబంటి యొకటి యెదురు వడియె’ అని సాగుతుంది. ‘కొంటెకోతి’ కథ ‘రామాపురమను ఊరిలొ/ రామునిగుడి కట్టుచుండ్రి రాముని భక్తుల్’ అంటూ మనకు తెలవని దానిలో తలదూర్చితె అనర్దాలు ఎలా వస్తాయో చెబుతారు. ఇటువంటివే ‘కోతులు-పావురము, ఎద్దులు-సింహము, పిల్లి-యెలుక-ముంగిస, పిసినారి నక్క, జింకపిల్లల స్నేహము, మిత్ర ద్రోహము, సింహము-నక్క’ వంటి అనేకానేక కథలు ఇందులో ఉన్నాయి. ఒక్కో కథ ఒక్కో కోణంలో బాలబాలికలనే కాదు చదివిన పెద్దలను సైతం మళ్ళీ బాల్యంలోకి తీసుకెళ్తాయనడంలో ఏ సందేహమూ లేదు. పద్యవిద్యా పట్టభద్రుడు, తెలంగాణ నేల మీద ప్రభవించిన కర్శక కవిరత్నము ‘బాలల పద్య కథల సింధువు’ కళ్లెపు రాజేశ్వరరావు కథలు తెలుగు బాల సాహిత్యంలో కొత్త చార్మినార్… బాలల పద్య సారస్వతంలో నూటొక్క వెలుగుల కోహినూర్. ఈ ‘కథల తాతయ్య’ పద్యకథలు బాలలకు చక్కని దశ, దిశ చూపె దారిచుక్కలు కావాలని మనసారా కోరుతూ… జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548.