– కలెక్టర్ సీరియస్.. విచారణకు ఆదేశం
– హుటాహుటిన పాఠశాలకు డీఈవో
నవతెలంగాణ- వైరా
ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 15మంది విద్యార్ధునీలపై ఎలుకలు దాడి చేసిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మను కలెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు సోమశేఖరశర్మ హుటాహుటిన వైరాకు చేరుకున్న ఆయన విద్యార్ధుల గదులను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
అనంతరం ఎలుకల దాడికి సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ బత్తుల రమను, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల పరిసరాలు, డార్మేటరీలు అధ్వానంగా తయారై ఎలుకల మందలు పెరిగిపోయినట్టు విద్యార్థినులు డీఈఓకు వివరించారు. కిచెన్‌ను పరిశీలిస్తున్న సమయంలో ఎలుకలు సంచారం చేయడంతో గమనించిన సిబ్బంది.. డీఈవో సమక్షంలోనే ఒక ఎలుకను చంపారు. దాంతో టీఎస్‌ఆర్‌ఎస్ ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిపై డీఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. ఎలుకలను పూర్తిస్థాయిలో నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈఓ వెంట సూపరింటెండెంట్ ప్రసాద్ ఉన్నారు.