స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కంటే

– సీఐపీఏ మరింత సమగ్రమైనది
– ఇన్వెస్ట్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కంటే సమగ్ర ఆర్థిక ఒప్పందం(సీఈపీఏ) మరింత సమగ్రమైనదని ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. యూఏఈ-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(యూఐబీసీ) న్యూఢిల్లీ సహకారంతో ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్కుహోటల్‌లో సమగ్ర ఆర్థిక ఒప్పందం(సీఐపీఏ), సంబంధిత వ్యాపార అవకాశాలపై వ్యాపార సమావేశాన్ని నిర్వహించారు. ఇది తెలంగాణకు మరింత అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోందనీ, దీనికి ప్రధాన సంధానకర్త (శ్రీకర్‌ కె.రెడ్డి) తెలంగాణకు చెందినవారు కావడంతోపాటు తమ ఎగుమతి సామర్థ్యం, ఫార్మాస్యూటికల్స్‌, ఇంజనీరింగ్‌ వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్స్‌, మినరల్స్‌, వ్యవసాయ ఉత్పత్తులు వంటి అనేక రంగాల బలాలు కారణమని అన్నారు.
ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రం లాభపడుతుందని తెలిపారు. ఎగుమతులు పెరగడానికి అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. దేశంలో అనేక రంగాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. మానవ వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తిలో 40 శాతం ఇక్కడే తయారవుతుందనీ, తెలంగాణను ‘బల్క్‌ డ్రగ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తున్నారని వెల్లడించారు.
ప్రపంచంలోని ఒకే ప్రాంతంలో యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదిత ఔషధ తయారీకి సంబంధించిన 214 యూనిట్లు హైదరాబాద్‌ జిల్లాలోనే ఉండటం గర్వకారణమనీ, రెండో స్థానంలోని న్యూజెర్సీలో 189 యూనిట్లు ఉన్నాయని తెలిపారు. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మరో ఆశాజనక రంగమనీ, ఇది రెండెంకల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని వివరించారు.
ఎఫ్‌టీసీసీఐ నూతన అధ్యక్షులుగా మీలా జయదేవ్‌
ఎఫ్‌టీసీసీఐ నూతన అధ్యక్షునిగా మీలాజయదేవ్‌ గురువారం అర్థరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ఇది భారతదేశం-యుఎఇ సీఈపీఏ అమలు మొదటి వార్షికోత్సవమని అన్నారు. ఈ వ్యాపార సెషన్‌ సమయానుకూలమైనదనీ, సమయోచితమైనదని అన్నారు. ఈ బిజినెస్‌ సెషన్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌కుమార్‌ సింఘాల్‌, ఎఫ్‌˜టీసీసీఐ సీఈఓ ఎంఎస్‌ ఖ్యాతి నరవాణే తదితరులు పాల్గొన్నారు.