రేషన్ కార్డులు, పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – వలిగొండ రూరల్
రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులను, 60 సంవత్సరాల నిండిన వృద్ధులందరికీ నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ‘సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న  ‘పోరుబాట’ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం దాసిరెడ్డిగూడెంలో  సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేకమంది పేదలకు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల రేషన్ బియ్యం తో పాటు వివిధ రకాల సంక్షేమ పథకాలకు వారు దూరమవుతున్నారన్నారు. మేము అధికారంలోకి రాగానే  రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం  ఇంతవరకు అమలు చేయలేదని, వెంటనే నూతన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అనేకమంది వృద్దులు 60 సంవత్సరాలు నిండిన తమకు పెన్షన్ అందక ఎదురుచూపులు చూస్తున్నారని, 60 సంవత్సరాలు నిండిన వారందరికీ వెంటనే నూతన పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాసిరెడ్డిగూడెం నుండి రెడ్ల రేపాకకు వెళ్లే రోడ్డులో ఉన్న కల్వర్టులు వర్షాకాలం సమయంలో నీరు చేరడం వల్ల ఆరోడ్డు మార్గంలో వెళ్లే రెడ్ల రేపాక, కంచనపల్లి గ్రామాల ప్రజలు ప్రయాణం చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వెంటనే  రెండు కల్వర్టుల స్థానంలో బ్రిడ్జిలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామంలో కొత్త కాలనీలో ఉన్న ఎస్సీ కాలనీలో ఓపెన్ డ్రైనేజీ వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఓపెన్ డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మార్చాలని డిమాండ్ చేశారు. దాసిరెడ్డిగూడెం నుండి వలిగొండ కు వచ్చే మార్గంలో మూలమలుపుల వద్ద హెచ్చరికల బోర్డులు లేక అనేక ప్రమాదాలు జరిగాయని, వాటిని  ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని  ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని, వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి కొమ్ము స్వామి, నాయకులు ఫాలోజు శంకరాచారి,కందుల బాలయ్య,అశోక్ నరసయ్య,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.