మూడు నెలల్లో వలస, అసంఘటిత కార్మికులకు రేషన్‌ కార్డులు ఇవ్వాలి

– రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం
– స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ : ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదైన వలస, అసంఘటిత కార్మికులకందరికీ రేషన్‌ కార్డులను మూడు నెలల్లోగా అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వలస కార్మికులకు డ్రై రేషన్‌, ఓపెన్‌ కమ్యూనిటీ కిచెన్‌లపై 2021లో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు హర్ష్‌ మందర్‌, అంజలి భరద్వాజ్‌, జగదీప్‌ చోకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ తాజా జనాభా లెక్కలు లేకపోవడం వల్ల 10 కోట్ల మందికి పైగా జాతీయ ఆహార భద్రతా చట్టం-2013లోని రక్షిత గొడుగు నుంచి రేషన్‌ కార్డులు కూడా లేకుండా మినహాయించబడ్డారని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించబడిన ఆహార భద్రతా చట్టం కింద కవరేజీ సరిపోదని తెలిపారు.
”ప్రస్తుతం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ప్రయోజనాలను పొందేందుకు విస్తృత ప్రచారం కల్పించాలి. సంబంధిత రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడంతో ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి రేషన్‌ కార్డులను జారీ చేయడానికి కసరత్తును చేపట్టడానికి సంబంధిత రాష్ట్రాలకు మరో మూడు నెలల సమయం ఇస్తున్నాం. జిల్లా కలెక్టర్ల కార్యాలయాన్ని సంప్రదించడం, తద్వారా పోర్టల్‌లో నమోదైన ఎక్కువ మందికి రేషన్‌ కార్డులు జారీ చేయబడతాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రయోజనాన్నీ పొందవచ్చు” అని ధర్మాసనం పేర్కొంది. స్టేటస్‌ రిపోర్టును దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్‌ 3న వాయిదా వేసింది. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదైన 28.55 కోట్ల మంది వలస, అసంఘటిత కార్మికులు రేషన్‌ కార్డులను కలిగి ఉన్నారా? వారందరికీ ఆహార ప్రయోజనాలను అందించారా? లేదా? అనేది తెలియజేయాలని గత విచారణలో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, గ్రామీణ, పట్టణ పేదలకు టార్గెటెడ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (టీపీడీఎస్‌) కింద సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పొందేందుకు కార్మికులు అర్హులేనని, పోర్టల్‌లో నమోదు మాత్రమే సరిపోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటికు జస్టిస్‌ ఎం ఆర్‌ షా సూచిస్తూ ”రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య డేటాను పంచుకోవడంపై మాకు ఆసక్తి లేదు. నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని వలస కార్మికుల పథకాల ప్రయోజనం పొందుతున్నారా? అనే దానిపై మాకు ఆసక్తి ఉంది” అని పేర్కొంది.