– ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులు
– సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని ఆవేదన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో అర్హులైన అనేక మంది రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో త్వరలో ఈ ప్రక్రియకు ముందడుగు పడనుంది. తాజా నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాంకేతిక తప్పిదాలతో కొంతమంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగిస్తున్నా కొత్త పేర్ల నమోదు ప్రక్రియ మాత్రం ముందుకు సాగకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్తగా వివాహమైన జంటలకు సైతం కొత్త కార్డులు అందడంలేదు. మరికొంత మంది పిల్లల వివరాలు కార్డులో నమోదు చేసుకునేందుకు ఏళ్లుగా మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం నగదు కూడా చాలా. మందికి అందని పరిస్థితి. ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్,ఆరోగ్యశ్రీ, విద్యార్థుల స్కాలర్ షిప్ తోపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కార్డుల మంజూరుపై ఆరా తీస్తున్నారు. రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు పొందే వెసులుబాటు ఫోర్టబిలిటీ ద్వారా కల్పించింది. దీంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
కొత్త సభ్యుల నమోదుకు..
మండలంలో ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పిల్లల పేర్లు కొత్తగా నమోదు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత 15 రోజులుగా మీసేవ కేంద్రాల్లో కొత్త పేర్లు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ ఆప్షన్ కల్పించడంతో మండలంలో పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో ప్రసుత్తం సంబంధిత వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. తాజాగా రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపడంతో కార్డుల మంజూరుకు మార్గం సుగమమం అయింది.అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ నుంచి పూర్తి స్టాయిలో మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులు దరఖాస్తు చేసుకునే వీలుంది.
ఏళ్లుగా నిరీక్షణ..
మండలంలో 19 రేషన్ దుకాణాలు, ప్రస్తుతం 8,906 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఏఏప్ ఎస్ కార్డులు 1,385, ఏప్ ఎన్ సి కార్డులు 7,521,అన్ని గ్రామాల్లో కలిపి యూనిట్లు 24,700 ఉండగా, వీటి ద్వారా ప్రతినెలా 3,99,0,35 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కొకరికి ఆరు కిలోల బియ్యం చొప్పున ఉచిత బియ్యం అందజేస్తున్నారు.మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 9,60 మంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం 2021 జూలైలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది నిరుపేదలను గుర్తించి కొత్త కార్డులు జారీ చేసింది. అయితే అర్హులైన చాలా మందికి రేషన్ కార్డులు అందలేదు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో వివాహం తర్వాత చాలా మంది ప్రత్యేక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. భార్య పేరు పొందుపరచడం, కొత్తగా పిల్లల పేర్లు చేర్చించేందుకు కూడా దరఖాస్తు చేసుకుని ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు.