రేషన్‌ బియ్యం దందా…

Bhadrachalam should be kept as a single panchayat– దళారులు లబ్ధిదారుల దగ్గరే కొంటున్నారా
– డీలర్లతో డీల్‌ కుదిరించుకుంటున్నారా
నవతెలంగాణ-అశ్వాపురం
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా అందజేస్తున్న రేషన్‌ బియ్యం దళారుల చేతుల్లోకి ఎలా వస్తున్నాయనే ప్రశ్న ప్రశ్నార్ధకంగానే మిగిలిపోతోంది. పినపాక నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం దందా మూడు పువ్వులు, ఆరు కాయలులాగా విరాజిల్లుతోంది. అనునిత్యం ఓ పక్కన పోలీసులు, మరోపక్క సివిల్‌ సప్లై అధికారులు అక్రమ రేషన్‌ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా తరలుతున్న రేషన్‌ బియ్యానైతే పట్టుకుంటున్నారే తప్ప ఆ బియ్యం ఎక్కడినుంచి దళారుల చేతుల్లోకి వస్తున్నాయని రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు అంటున్నారు. నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రేషన్‌ బియ్యం వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకొని లబ్ధిదారుల దగ్గర రూ.10 నుంచి 12 వరకు చెల్లించి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఓ పక్కన వాదనలు వినిపిస్తుండగా, మరోపక్క లబ్ధిదారుల దగ్గర క్వింటాల కొలది ఎలా బియ్యం సేకరిస్తున్నారనే వాదనలు మరో పక్కన బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ బియ్యం దళారు చేతుల్లోకి ఎలా వస్తున్నాయి…? ఎవరిస్తున్నారనే అనేక సందేహాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి. అక్రమ బియ్యంతో పట్టుబడినప్పుడల్లా చిన్నాచితకా వ్యాపారులు బలవుతున్నారే తప్ప భారీ స్థాయిలో కొనుగోలు చేసే వ్యాపారులు దొరకకపోవడం కోసం మెరుపు.
కొందరు డీలర్లతో బియ్యం వ్యాపారులు డీల్‌ కుదుర్చుకున్నారా…?
పినపాక నియోజకవర్గంలోని కొందరు రేషన్‌ డీలర్లతో బియ్యం వ్యాపారులు డీల్‌ కుదుర్చుకుని వారి వద్ద నుండి క్వింటాలకొద్దీ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనే వాదనలు పలువురు నుండి వినిపిస్తున్నాయి. అయితే కొన్ని పల్లె ప్రాంతాలలోని రేషన్‌ లబ్ధిదారుల నుండి డీలర్లే వేలిముద్రలు వేయించుకొని బియ్యాన్ని వారే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని అధిక మొత్తంలో సేకరించి దళారులకు కొంత కమీషన్‌కు అమ్ముతున్నట్టు మరికొందరు అంటున్నారు.
మణుగూరులోని ఓ మిల్లర్‌ వ్యాపారి కొనుగోలు చేస్తున్న రేషన్‌ బియ్యం
నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు వంటి మండలాలలో రేషన్‌ దళారులు సేకరించిన బియ్యాన్ని మణుగూరు పట్టణంలోని ఓ రైస్‌ మిల్లులో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత రైస్‌ మిల్‌ పై గతంలో అనేక పత్రికలలో కథనాలు వెలువడినప్పటికీ మిల్లర్‌ వ్యాపారి మాత్రం దళారుల నుండి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నాడని పలువురు అంటున్నారు. అయితే సంబంధిత శాఖ స్థానిక అధికారులకు రేషన్‌ బియ్యం కొనుగోలు విషయంలో మిల్లర్‌ యజమాని భారీ ఎత్తున ముడుపులు ముట్ట చెబుతున్నాడనే వాదనలు లేకపోలేదు. ఈ వ్యాపారి గత కొన్నినేళ్లుగా రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ కొంత బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ మరికొన్ని బియ్యాన్ని రీసైక్లింగ్‌ ద్వారా సన్నబియంగా మార్చి స్థానికంగా ఉన్న బియ్యం వ్యాపారులకు అమ్ముతున్నాడనేది వినికిడి. ఈ తంతంగామంతా స్థానిక సివిల్‌ సప్లై అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా సదరు మిల్లరును అరికట్టడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రాకు తరులుతున్న రేషన్‌ బియ్యం
చిన్నచిన్న బియ్యం వ్యాపారుల నుండి కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని కొందరు మిల్లర్లతో పాటు కొంత పెద్ద ఎత్తున వ్యాపారం చేసే వ్యక్తులు డీసీఎం వ్యాన్లు, టాటా మ్యాజిక్‌ల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆంధ్రాలోని కోళ్ల ఫారాలు, చాపల చెరువుల వ్యాపారులకు ఈ బియ్యా న్ని అమ్ముతున్నారని పలువురు అంటున్నారు. అయితే ఈ తతంగమంతా గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి సమయాల్లో చేపట్టడం విశేషం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలడంపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి దళారులకు రేషన్‌ బియ్యం ఎక్కడినుండి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయననే అంశంపై దృష్టి సారించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.