– మండలంలో చెలరేగిపోతున్న పీడీఎస్ దందా
– నామమాత్రపు కేసులతో నిందితులను వదిలేస్తున్న పోలీసులు
నవతెలంగాణ-మాడుగులపల్లి
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యక్తులను మరియు కొంతమంది డీలర్లను ఏజెంట్లుగా నియమించుకుని పక్కదారి పట్టిస్తున్నారు. మాడుగులపల్లి, ఉమ్మడి మండలమైన వేములపల్లి పలు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ రేషన్ బియ్యాన్ని ప్రజల వద్ద నుండి కిలో ఐదు నుండి ఆరు రూపాయలకు కొని వారు దళారులకు పది నుంచి 12 రూపాయలు చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఒక రహస్య ప్రాంతంలో నిల్వ చేసి అదును చూసుకొని భారీ ఎత్తున క్వింటాళ్లకు క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. డీలర్లు, చిరు వ్యాపారులు మాడుగులపల్లి మండల కేంద్రం, చెరువుపల్లి, దాచారం, కనేకల్లు, అభంగాపురం గజాలపురం, పూసలపాడు గ్రామాల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యం నల్గొండ వైపు తరలించి అక్కడ స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అలాగే తోపుచెర్ల, పాములపాడు, ఆగమోత్కూర్, చిరుమర్తి, ఆమనగల్లు, బొమ్మ కళ్ళు, సల్కునూరు గ్రామాల నుండి సేకరించిన బియ్యం మిర్యాలగూడ వైపు తరలించి అక్కడ స్థానిక దళారులకు విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులు సేకరించిన బియ్యాన్ని చిన్నచిన్న ఆటోలలో తరలించి రెవెన్యూ మరియు పోలీస్ పర్యవేక్షణ తక్కువగా ఉన్న మారుమూల గ్రామాలలో నిల్వ ఉంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా వాటిని పెద్ద వాహనాలలో రాష్ట్ర నలుమూలలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి మండలంలో ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ అక్రమ రేషన్ బియ్యం దంధా ని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం: మిర్యాలగూడ నియోజకవర్గంలో పరిసర ప్రాంతాలలో కొంతమంది దళారులపై పలుమార్లు కేసు నమోదు అవుతున్నప్పటికీ ఖాతర్ చేయకుండా అక్రమార్కులు వారి దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్న కాని సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా దళారులు రెవెన్యూ మరియు పోలీసు అధికారులతో కుమ్మకై ప్రతినెల మామూలు పంపిస్తూ దందా కొనసాగిస్తున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అసలు దందా చేసే వారిని వదిలేసి వాళ్ళ దగ్గర పనిచేసే గుమస్తాలపై, డ్రైవర్లపై కేసులు పెట్టి నామమాత్రంగా విచారణ జరిపి అసలైన వారిని వదిలేస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి. దళారులపై కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయం లేకుండా వ్యాపారులు అధికారుల అండదండలతో అక్రమ రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు.
దందా జరిగే ప్రాంతాలు ఇవే: ముఖ్యంగా దందా సాగించేవారు మారుమూల ప్రాంతాల నుండి రెవెన్యూ పోలీసుల నిఘా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎంచుకుంటారు. అందులో మాడుగులపల్లి మండల కేంద్రం గజలాపురం, అభంగాపురం, కన్నెకల్, ధర్మాపురం, చెరువుపల్లి, దాచారం, గారగుంటపాలెం పెద్దదేవలపల్లి, కుక్కడం, పూసలపాడు, పాములపాడు,ఆమనగల్లు చిరుమర్తి, ఆగమోత్కూర్, బొమ్మకల్ ఈ ప్రాంతాల నుండి నిత్యం కొనుగోలు చేసి పెద్దవాహనాలలో సరిహద్దులు దాటిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
సివిల్ సప్లై అధికారి జావీద్ వివరణ: మండలంలో రేషన్ బియ్యం దందా డీలర్ల ద్వారా జరుగుతున్నట్లు తమ దష్టికి ఏమి రాలేదు అని ఒకవేళ అలా జరిగితే అది ఎవరైనా ఉపేక్షించేది లేదని వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.