డా.నరేంద్ర దాభోల్కర్ వృత్తిరీత్యా వైద్యుడు. సాంఘిక కార్యకర్త, హేతువాది. వైద్యుడిగా సుమారు 12 ఏండ్లు పనిచేసిన అయన సామాజిక కార్యకర్తగా సేవలందించారు. సామాజిక న్యాయంకోసం పోరాడారు. ఒకే వూరు, ఒకే బావి కార్యక్రమంతో అతని సాంఘిక పోరాటం మొదలైంది. మహారాష్ట్రలోని చాలా గ్రామాల్లో ఈ 21వ శతాబ్దంలో కూడా అస్పశ్యులకు వేరే బావి ఉండేది. దానికి వ్యతిరేకంగా ఒకేవూరు ఒకేబావి నినాదంతో ఉద్యమించారు.
అలా ఉద్యమిస్తూనే అయన మూఢనమ్మకాల నిర్మూలన కోసం సమయం కేటాయించేవారు. గ్రామాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన కోసం ”మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలన సమితి”ని 1989లో స్థాపించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను జాగురూకులను చేసేవారు. తమని తాము బాబాలమని, మాంత్రికులమని చెప్పుకునే వాళ్లను ఎదిరించేవారు. మాయలు మంత్రాలూ చేసి రోగాలను నయం చేస్తామనే దొంగ బాబాలను ఎండగట్టేవారు.
వ్యవస్థాపక సభ్యులుగా అయన సతారా జిల్లాలో ‘పరివర్తన్’ (మార్పు) సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసింది. ఈ వర్గాల వారూ మనలో ఒకరనీ, మనలాగే వాళ్లూ స్వాభిమానంతో, అభివృద్ధి పథంలో సాగాలన్నది ఈ సంస్థ ఆశయం. దభోల్కర్ ‘ఫెడరేషన్ అఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్’కు (భారతీయ హేతువాద సంస్థ) ఉపాధ్యక్షుడుగానూ పనిచేశారు. ప్రఖ్యాత మరాఠీ వారపత్రిక ‘సాధన’కు సంపాదకులుగానూ సేవలందించారు.
20 ఏండ్లుగా దళితుల సమాన హక్కుల కోసం ఆయన పెద్దపోరాటమే చేశారు. దేశంలోని కుల వ్యవస్థకు, కులమతాలద్వారా ప్రేరేపింపబడే హింసను వ్యతిరేకించేవారు. అయన కషివల్లనే మరాట్వాడా విశ్వవిద్యాలయం.. ‘అంబేద్కర్ విశ్వవిద్యాలం’గా పేరు మార్పు జరిగింది.
ఆశారాం బాపూని ఎండగట్టే విషయంలో ఆయన కృషి ఎంతో ఉంది. అది 2013 మార్చి.. మహారాష్ట్ర అంతటా కరువు విలయతాండవం చేస్తున్న రోజులు. ప్రజలకు దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఆశారాంబాపూ, ఆయన శిష్యులు హోలీ పండుగ రోజు, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని రంగులు చల్లుకుంటూ, జలకాలాడుతూ.. తాగు నీటిని వృథా చేయడాన్ని అయన ప్రశ్నించారు.
చేతబడి మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లు: మూఢనమ్మకాలకు, చేతబడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలన్న ఓ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టించడం వెనుక కృషి దభోల్కర్‌దనే చెప్పాలి. అయన నేతృత్వంలో ‘మహారాష్ట్ర అంధ్ నిర్మూలన సమితి’ ఈ బిల్లుని తయారుచేసి దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టించింది. దానికి చట్ట రూపం తెచ్చేలా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. దాంతో దభోల్కర్ మతవిరోధి అనీ, ఈ బిల్లు హిందూమతానికి వ్యతిరేకమని బీజేపీ, శివసేనలతోపాటు కొన్ని ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.
తరువాత అయన ‘ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిల్లుని గురించి చెబుతూ మొత్తం బిల్లులో దేవుడు, మతం అనే పదాలే లేవని స్పష్టంచేశారు. అయన హత్యకు కొన్ని రోజుల ముందు అంటే 2013 ఆగస్టు 6న దభోల్కర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ఈ బిల్లును ఏడుసార్లు ప్రవేశ పెట్టినప్పటికీ దీనిపై చర్చ జరగలేదనీ, ప్రగతిశీల భావాలు గలవాళ్ళని అప్పటి ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చౌహన్ నిరుత్సాహపరిచారని అన్నారు. ఈ బిల్లు మోసపూరిత దోపిడీకి వ్యతిరేకంగా తేబడిందే తప్ప, దేవుడికి, మతానికి వ్యతిరేకంకాదని స్పష్టంచేశారు. అయితే 2013 ఆగస్టు 20న అయన హత్య జరిగిన తరువాతి రోజు మహారాష్ట్ర క్యాబినెట్ ‘చేతబడులు, మూఢాచారాల’ వ్యతిరేక ఆర్డినెన్సు తెచ్చి, పార్లమెంట్ ఆమోదం కోసం పంపింది. ఈ ఆర్డినెన్సును 29 సవరణలతో 18 డిసెంబర్ 2013 నాడు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఆయనకు అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. చివరకు 2013 ఆగస్టు 20న ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళుతుండగా… 7.30 ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు దభోల్కర్‌ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి మోటారు సైకిలుపై పారిపోతారు. అయన అక్కడికక్కడే చనిపోతారు. హిందూ మతవాద ”సనాతన్ సంస్థ” ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసుల పరిశోధనలో తేలింది. తరువాతి కాలంలో ఈ ‘సనాతన్ సంస్థ’ ఎం.ఎం కల్బుర్గీ, గోవింద్ పన్సారే, గౌరి లంకేశ్‌ల హత్యలకూ కారణమని తేలింది.
దభోల్కర్ హత్య జరిగిన పదేళ్ళకి, స్పెషల్ సీబీఐ కోర్టు 2013 మే 10న ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు చెరో రూ.5 లక్షల జరిమానా విధించింది. అయితే అసలు కుట్రదారుడైన వీరేంద్ర సింగ్ శరత్చంద్ర తవాడే, అతని ఇద్దరు సహచరులను సరైన సాక్ష్యాధారాలను చూపలేక పోయిందన్న సాకుతో సీబీఐ కోర్టు విడుదల చేసింది.
ఏది ఏమైనప్పటికీ దేశం ఒక సంఘ సంస్కర్తను, హేతువాదిని కోల్పోయింది. ‘అల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్’ అయన హత్య జరిగిన 20 అగస్టును ‘నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే’ గా నిర్వహిస్తున్నది.
(దభోల్కర్ పదకొండవ వర్ధంతి సందర్భంగా…)
– పి. జయ ప్రకాష్ , 8374851426