విలువలు లేవు. వావి వరుసలు లేవు. షరతులు అస్సలే లేవు. చిత్తుగా తాగుతూ.. మత్తుగా ఊగుతూ.. డ్రగ్స్‌లో జోగుతూ.. నచ్చిన వారితో ఆ పూట గడిపామా.. ఇదే రేవ్ పార్టీ కల్చర్. డబ్బున్న మనుషుల ఆగడాలకు ఇది అడ్డా! బహిరంగ సరసాలకే కాదు, విచ్చలవిడి శృంగారానికి కేరాఫ్ అడ్రస్. కండ్లు మూసుకుపోయిన బలవంతులు.. తమ వాంఛలు తీర్చుకోవడానికి ఎంచుకున్న ‘పవిత్ర స్థలం’ ఈ రేవ్ పార్టీ. సంబురాల ముసుగులో డ్రగ్స్ రాకెట్లు దూసుకుపోతుంటాయి. సెక్స్ బ్రాకెట్లు నిస్సిగ్గుగా సకిలిస్తుంటాయి. మానవ సంబంధాలపై దాడి చేస్తున్న పెనుభూతమిది. ఈ మధ్య తరుచుగా తెలుగు రాష్టాల్లో వినిపిస్తున్న మాట.. రేవ్‌పార్టీ. ఇదొక విశృంఖల విధ్వంసం. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, భావి భారత పౌరుల భవిష్యత్తుకు మరణశాసనం రాస్తున్న రేవ్ పార్టీలపై జోష్ కథనం..
రేవ్ పార్టీలకు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు, ధనవంతుల పిల్లలు ఈ కూపంలో దొరుకుతున్నారు. అసలు రేవ్ పార్టీల ప్రధాన ఉద్దేశం డ్రగ్స్‌ను అలవాటు చేయడం, అమ్మడం. ఆ పార్టీకి వచ్చిన వారంతా కచ్చితంగా పెడ్లర్ దగ్గర డ్రగ్స్ తీసుకోవాల్సిందే. అలా నెట్‌వర్క్ పెంచుకుంటూ.. వెళ్లడమే డ్రగ్ పెడ్లర్స్ లక్ష్యం. బాధితుల జీవితం ఏమవుతుందనే బాధ వారికి ఉండదు. డబ్బున్నవారిని మానసికంగా తమ వైపు తెచ్చుకొని డ్రగ్స్‌కు, ఫ్రీ సెక్స్‌కు అలవాటు చేసి బిజినెస్‌ను పెంచుకోవడమే రేవ్ పార్టీ నిర్వాహకుల ప్రధాన లక్ష్యం.
రేవ్‌పార్టీలో ఏముంటుంది..
సాధారణంగా పార్టీ అంటే మందు.. విందు.. చిందు ఉంటుంది. అది వారివారి తాహతను బట్టి నిర్వహిస్తారు. మహా అయితే తాగుతారు. సరదాగా డ్యాన్స్ చేస్తారు. అంతేగా. కానీ, రేవ్‌పార్టీలో కూడా అదే అనుకుంటారు చాలామంది! ఈ పార్టీని చూస్తే.. అంతా ఆశ్చర్యపోతారు. అంత పచ్చిగా ఉంటుంది పార్టీలో వాతావరణం. ఇక్కడ జరిగే తంతు సామాన్యుల ఊహకు అందదు. సూర్యాస్తమయంతో మొదలయ్యే విశృంఖల విన్యాసం మర్నాడు సూర్యోదయం వరకు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకాస్త పెద్ద వ్యక్తుల సహకారం ఉంటే అది మూడు నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పార్టీలకు వ్యక్తుల ఎంపిక నుంచి వారు స్వస్థలానికి క్షేమంగా వెళ్లే వరకూ అంతా గోప్యంగా సాగుతుంది. అలాగని ఎవరు పడితే వారు ఈ జోన్‌లోకి అడుగుపెట్టలేరు. పార్టీకి ఎవరు రావాలనేది నిర్వాహకులు డిసైడ్ చేస్తారు. సెలెబ్రిటీలు, సంపన్నులు, వ్యాపారవేత్తల వారసులు ఇలా డబ్బున్న వారినే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఆహ్వానిస్తారు.
ఇప్పుడు ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటిగా మారాయి. ఆ జాబితాలో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకుంది. ఈమధ్య కాలంలో ఈ సంస్కృతి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి.
స్థాయిని బట్టి ఎంట్రీ ఫీజు
పార్టీ స్థాయి, అందులో లభ్యమయ్యే సరుకును బట్టి ఎంట్రీ ఫీజు ధర రూ.25 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎంపిక చేసిన వ్యక్తులనే పార్టీకి పిలుస్తారు. ఇక్కడ ఆడా, మగా భేషజాలు ఉండవు. అందరూ కస్టమర్లే! సదరు వ్యక్తికి ఎలాంటి దురభ్యాసాలూ లేకపోతే.. సిగరెట్‌తో మత్తుప్రాశన చేస్తారు. గంజాయితో డోసు పెంచుతారు. డ్రగ్స్ ఇచ్చి వశపరుచుకుంటారు. మగువను ఎగదోసి పూర్తిగా లోబరుచుకుంటారు. అలా డ్రగ్ పెడ్లర్స్ ఉచ్చులో చిక్కుకున్న వాళ్లను సిగల్ యాప్ ద్వారా రేవ్ పార్టీలకు ఆహ్వానిస్తారు. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. పార్టీ జరిగే చోట సిగల్స్ ఉండవు. ఫోన్లు ఉన్నా పనిచేయవు. కెమెరాలు అస్సలు ఉండవు. పార్టీకి పికప్ పాయింట్ నుంచి డ్రాపింగ్ వరకు నో మొబైల్స్, నో కెమెరా, నో అప్‌డేట్స్.. అంతా ష్.. గప్‌చుప్. మత్తంతా దిగిన తర్వాత కస్టమర్ కోరిన చోట పదిలంగా దింపుతారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజారుమెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్‌ఎస్‌డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.
పార్టీలో పరాకాష్ఠ అదే
రేవ్‌పార్టీల్లో డ్రగ్స్ తర్వాత సెక్స్‌దే ఆధిపత్యం. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు హెచ్‌ఐవీ టెస్టులు కూడా చేస్తుంటారు. ఒక్కసారి అన్‌లిమిటెడ్ పార్టీలకు వెళ్లిన తర్వాత ఎవరు.. ఎవరితో సెక్స్‌లో పాల్గొంటారో వారికే తెలియదు. పశుత్వం కట్టలు తెంచుకుంటుంది. పార్ట్‌నర్స్‌ను మార్చుకుంటూ.. దిగజారుతుంటారు. ఈ తరహా రేవ్‌పార్టీలకు హాజరయ్యేవారిలో ఆడవాళ్ల శాతమూ ఎక్కువే! వీరిలో కొందరు డబ్బుల కోసం వస్తే.. మరికొందరు డ్రగ్స్ కోసం ఉచ్చులో చిక్కుతారు. కొందరు పార్టీకి ముందే సెక్స్ పార్ట్‌నర్‌ను ఎంచుకుంటే.. మరికొందరు పార్టీకి వచ్చిన తర్వాత నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారు. ఒక్కసారి పార్టీ మొదలయ్యాక మనుషులు మగాలుగా మారిపోతారు. అక్కడ తాగుబోతులే బెటర్ అనిపిస్తుంది. డ్రగ్స్ కావాలనుకునేవాళ్లు ఒక చోట చేరుతారు. శృంగారం కావాలనుకువాళ్లు మరో జోన్‌లోకి ప్రవేశిస్తారు. విచ్చలవిడి సెక్స్ కావాలని తపించేవారు ఇంకో గూటికి చేరుకుంటారు. అక్కడ గంటల తరబడి మగత్వం రాజ్యమేలుతుంది. ఒక్కోసారి రోజుల తరబడి కొనసాగుతుంది.
ఈ పార్టీ కాస్త వైల్డ్ బిహేవియర్‌తో చేసుకుంటుంటారు. ఈ రేవ్‌పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. చెవులు దద్దరిల్లే మ్యూజిక్ తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఆల్కహాల్‌తో పాటు డ్రగ్స్‌ను కూడా తీసుకుంటూ.. చీకటిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్‌ను ప్లే చేస్తుంటే ఒళ్ళు మరిచి వివేకం కోల్పోయి వావి వరసలు లేకుండా డాన్సులు చేస్తుంటారు. వీరు అన్నీ మరచి చిందులు వేయడానికి ఈ రేవ్ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా మారుతుంది.
వీరికి ఫ్రీ ఎంట్రీ
పార్టీకి వచ్చినవారిని సంతప్తిపరచడానికి నాణ్యమైన డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు పెడ్లర్స్. అంతేకాదు, వారిని పూర్తిగా గ్రిప్‌లో ఉంచుకునేలా అందమైన అతివలను వలగా విసురుతారు. ఇలాంటివారికి ఎంట్రీ ఫ్రీ! వయసులో ఉన్న ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసి, వాటి ఆశచూపి అంగడి సరుకుగా మార్చేస్తుంటారు. డ్రగ్స్ కోసం ఉద్యోగాలు వదిలేసే టెకీలు కొందరైతే.. అవి దొరక్క ఆత్మహత్యకు పాల్పడినవాళ్లూ ఉన్నారు. మొదట డబ్బు కోసం డ్రగ్స్ పార్టీలకు వెళ్లిన యువతులు.. ఆ మత్తులో ఉన్నదంతా పోగొట్టుకొని, సెక్స్ వర్కర్లుగా మారుతున్నవారూ ఉన్నారు.
ఉదాసీనత వద్దు
రేవ్‌పార్టీల్లో దొరికిన వారిని బాధితులుగానే పోలీసులు చూస్తున్నారు. రెండ్రోజులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. నిర్వాహకులను, డ్రగ్ సప్లయర్స్‌ను అరెస్టు చేస్తున్నారు. పోలీసుల కౌన్సెలింగ్ తీసుకున్న వాళ్లు.. నాలుగు రోజులు కాగానే షరామామూలుగా తర్వాత పార్టీ ఎక్కడుందో సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి ఉదాసీన ధోరణి వదలాలి. ఇలాంటి పార్టీల్లో పాల్గొన్నవారిని కూడా శిక్షించేలా చట్టాలు చేస్తేగానీ మార్పు రాదని బాధితులే చెబుతున్నారు. ఆ నరకం నుంచి బయటపడటానికి ఏండ్ల సమయం పడుతుంది. వారం వారం సాగే ఈ పాడు పార్టీలపై ఏడాదికి ఒకటి రెండుసార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఏం ప్రయోజనం? పార్టీ కల్చర్ ముసుగులో వికత ఆనందం పొందుతూ, సమాజాన్ని పీడిస్తున్న వాళ్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరం. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో ప్రతి వీధిలో ఓ రేవ్‌పార్టీ అడ్డా పుట్టుకొస్తుంది. మాదకద్రవ్యాలకు ఓ తరమంతా నిర్వీర్యమవుతుంది. తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్. టీనేజ్ పిల్లలను నియంత్రిస్తే బాగోదు అనుకుంటే… ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవ్వొచ్చు. పిల్లలకు స్వేచ్ఛనిచ్చినా, వారిపై ఓ కన్నేసి ఉంచడం మీ బాధ్యత అని మర్చిపోకండి.
కూకటివేళ్లతో పెకలించాలి
‘రేవ్’ అంటే మంచైనా చెడైనా హద్దు లేకుండా ప్రవర్తించడమే. హద్దులు, జాత్యహంకారం, పక్షపాతం, లింగ భేదం, నియమాలు, ద్వేషం ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ఐక్యత అనే ప్రపంచంలోకి తీసుకెళ్లడమే..! ‘రేవ్’ సంస్కృతిని సమర్థించుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. నిజమే డ్రగ్స్‌కు బానిసలైన మనుషులకు ఇవేవీ ఆలోచించే స్పహ ఉండదు కదా. దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువత ఇదే ప్రపంచమని సమర్థించుకుంటూ మత్తు పదార్థాలకు బానిసలైతే భావి తరాల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి.
వావి వరుసలు లేని ఈ రేవ్ పార్టీల విష సంస్కతికి ఎక్కువగా తల్లిదండ్రుల సంరక్షణ సరిగా లేని ధనవంతుల పిల్లలు, సినీ రాజకీయ రంగాల ప్రముఖులు అలవాటు పడుతున్నారు. మనుషులలోని వివేకాన్ని మాయం చేసి జంతువుల సంస్కతిలోకి తీసుకువెళ్లే ఒక వాతావరణాన్ని సష్టించేదే ఈ రేవ్ పార్టీ. ఇటువంటి విష సంస్కతి వ్యాప్తి చెందడం సమాజానికి మంచి సంకేతం కాదు. ‘రేవ్’ విచ్చలవిడి సంస్కతి సమాజంపై పంజా విసరకముందే దానిని కూకటివేళ్లతో పెకలించి వెయ్యాలి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417