నవతెలంగాణ – కంఠేశ్వర్
జీవితాన్ని రసతరంగంలా మార్చుకున్న ఆదర్శ మూర్తి, మహాకవి, అవధాని, కవి పండితుడు, పండిత కవి డాక్టర్ నటేశ్వర శర్మ అని, ఆయన మరణం వాగ్దేవికి పుత్రశోకం కలిగించిందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కవి పండిత లోకం పెద్ద దిక్కును కోల్పోయిందని, తెలంగాణ రాష్ట్రం మేరునగం లాంటి సాహితీ మూర్తిని పోగొట్టుకుందని ఆయన నివాళులర్పించారు. హరిదా రచయితల సంఘం స్థాపన సమయంలో అయాచితం చేసిన మార్గ నిర్దేశనాన్ని ఆయన తలుచుకున్నారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఆయన ఒక దీపస్తంభమని నివాళి ఘటించారు. కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ నటేశ్వర శర్మ సంస్మరణ సభ నటేశ్వరునకు నివాళి అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రముఖ కవి పంచ రెడ్డి లక్ష్మణ మాట్లాడుతూ డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ ప్రాచీన కవిత్వానికి ఆధునిక కవిత్వానికి వారధిగా నిలిచాడని, తెలంగాణ సాహిత్యం పెద్దదిక్కు కోల్పోయిందని వేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ సరస్వతీ పుత్రుడనీ పద్యాన్ని అయినా, వచనాన్నైనా రసవత్తరంగా రాయడంలో ఆయనది అందివేసిన చేయి అని అంజలి ఘటించారు. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమల శ్రీనివాస్ ఆర్య మాట్లాడుతూ అవధానిగా డాక్టర్ నటేశ్వర శర్మ శిఖరాగ్రాలను అధిరోహించాడని, ఎంతోమంది కవి పండితులకు ఆయన మార్గదర్శిగా ఎంతో ఎత్తుకు ఎదిగారని నివాళి అర్పించారు. కవి గాయకుడు సిర్ప లింగం మాట్లాడుతూ డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ ఇంత అద్భుతమైన కవీశ్వరుడు అంతే అద్భుతంగా పద్యాన్ని గానం చేస్తాడని, ప్రాణం పోస్తాడని నివాళి అర్పించారు. నవలా రచయిత పోతునూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పోతన కాళిదాసుల వంటి మహాకవి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ అని సంస్కృత తెలుగు భాషలలో ఆయన కృషి అపారమని కొనియాడారు. తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలలో అయాచితం నటీశ్వర శర్మ పద్య కవిగా చూపిన ప్రతిభ అపారమైనదని గుర్తు చేసుకున్నారు. కవి బాగుల యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ నటేశ్వర శర్మ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ నుంచి, ఓరియంటల్ డిపార్ట్మెంట్ డీన్ దాకా చేపట్టిన ప్రతి పదవిని సాహిత్య వికాసం కోసం వినియోగించాడని తెలిపారు. ప్రముఖ కవి మల్లవరపు చిన్నయ్య మాట్లాడుతూ 60 పైగా రచనలు చేసిన సంపూర్ణ కవి అయాచితం నటీశ్వర శర్మ అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, పోతునూరి లక్ష్మణ్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, వాగుల యాదగిరి, పంచ రెడ్డి లక్ష్మణ, శ్రీనివాస్ మల్లవరపు చిన్నయ్య, గుత్ప ప్రసాద్, కొయ్యాడ శంకర్, మీసాల శ్రీనివాస్ రావు, కిరణ్, కొమిరిశెట్టి నాగరాజు, సిర్పలింగం తదితరులు పాల్గొన్నారు.