నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు చైర్మెన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొండూరి రవీందర్‌రావు, ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్ ఆబిడ్స్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈవిషయాన్ని వెల్లడించారు. తాము పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకులో ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. వ్యాపార రీత్యా రూ. 30 వేల కోట్ల వృద్ధిని సాధించామన్నారు. 33 లక్షల ఖాతాదారులతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. అన్ని సహకార బ్యాంకులను కంప్యూటీకరణ చేసి, రాష్ట్ర ఎపెక్స్‌తో అనుసంధానం చేసినట్టు పేర్కొన్నారు. నిపుణుల సహకారంతో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా సహకార బ్యాంకుల్లో 3385 మంది సిబ్బందిని నియమించామన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా గోదాములు, పెట్రోల్ బంకులు, విత్తన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. లోను రికవరీ వంద శాతం ఉందనీ, ఇది బ్యాంకు పురోగమనంలో మైలురాయి అన్నారు. కరోనా సమయంలోనూ పేదలకు సేవలు అందించామని గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనమేరకే బ్యాంక్ ఎంపీగా రిటైర్డ్ అయిన వ్యక్తిని నియమించామన్నారు. వాణి బాల చేసిన రూ 200 కోట్ల కుంభకోణంలో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఇవ్వాల్సిన వడ్డీ బకాయిలు ఇప్పటికీ రావడం లేదని వాపోయారు. సమావేశంలో కరీంనగర్ డీసీసీబీ చైర్మెన్ రమేష్, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి, పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.