ఐదేండ్లలో రెట్టింపైన క్రెడిట్‌ కార్డులు : ఆర్బీఐ

Credit cards doubled in five years: RBIన్యూఢిల్లీ : గడిచిన ఐదేళ్లలో క్రెడిట్‌ కార్డుల జారీ రెట్టింపు అయ్యిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. డిసెంబర్‌ 2019లో 5 కోట్లుగా ఉన్న క్రెడిట్‌ కార్డులు ప్రస్తుతం 10.80 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. ఇదే సమయంలో డెబిట్‌ కార్డుల జారీలో మాత్రం పెద్దగా పెరుగుదల లేకపోవడం విశేషం. 2019 డిసెంబర్‌ నాటికి 80.53 కోట్లుగా ఉన్న డెబిట్‌ కార్డులు.. ప్రస్తుతం 99.08 కోట్లకు చేరాయి. ఆర్బీఐ రిపోర్ట్‌ ప్రకారం.. 2024లో 447.23 కోట్ల కార్డు చెల్లింపుల లావాదేవీలు జరిగాయి. కార్డు చెల్లింపుల్లో డెబిట్‌ కార్డులతో పోల్చితే క్రెడిట్‌ కార్డుల చెల్లింపులే 15 శాతం అదనంగా ఉండటం విశేషం. 2024 డిసెంబర్‌ ముగింపు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 2.57 కోట్ల క్రెడిట్‌ కార్డులను జారీ చేశాయి. ఐదేండ్ల క్రితం నాటి 1.22 కోట్ల కార్డులతో పోల్చితే 110 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ప్రయివేటు రంగ బ్యాంక్‌లు 7.66 కోట్ల క్రెడిట్‌ కార్డులతో 71 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. అధిక ఫీజుల వల్ల విదేశీ బ్యాంక్‌ల కార్డుల జారీ 65.79 లక్షల నుంచి 45.94 లక్షలకు పడిపోవడం ద్వారా వాటి మార్కెట్‌ వాటా కూడా 11.9 శాతం నుంచి 4.3 శాతానికి పరిమితమయ్యాయి.