వీసా, మాస్టర్‌ కార్డ్‌లపై ఆర్‌బీఐ కొరడా

వీసా, మాస్టర్‌ కార్డ్‌లపై ఆర్‌బీఐ కొరడా– చెల్లింపులు నిలిపివేయాలని ఆదేశాలు
ముంబయి : నిబంధనలు ఉల్లఘింస్తున్న విత్త సేవల సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే మనీలాండరింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న పేటియంపై కఠిన చర్యలు తీసుకోగా.. తాజాగా వీసా, మాస్టర్‌కార్డ్‌కు షాక్‌ ఇచ్చింది. ప్రముఖ చెల్లింపు గేట్‌వే సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్‌ కమర్షియల్‌ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేయకుండా చర్యలు చేపట్టింది. కాగా.. ఎందుకు నిషేధం విధించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే కెవైసీ లేని వ్యాపారులకు ఆయా కార్డుల ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్టుగా ఆర్‌బీఐ గుర్తించింది. కార్డ్‌ నెట్‌వర్క్‌లు ఆమోదం లేకుండా పని చేస్తున్నాయని సమాచారం. ఫిన్‌టెక్‌లు, కార్డ్‌ నెట్‌వర్క్‌లు వ్యాపార విక్రేతలకు కార్డ్‌ చెల్లింపులు చేసే ప్రక్రియను సష్టం చేసే వరకు కార్డ్‌ చెల్లింపులు ఉపయోగించకూడదని ఆర్‌బీఐ వర్గాల సమాచారం. వాస్తవానికి క్రెడ్‌, పేటియం, నోబ్రోకర్‌ తదితర యాప్‌లు వినియోగదారులు కార్డుల ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తుంటాయి. ఈ రంగంలో కార్డు చెల్లింపులు సాధారణంగా ఉపయోగించడానికి అవకాశం ఉండదని సమాచారం. కమర్షియల్‌ కార్డుల ద్వారా చెల్లింపులను నిలిపివేయాలని ఆర్‌బిఐ ఆదేశాలు ఇచ్చిందని ఓ ఫిన్‌టెక్‌ ప్రతినిధి తెలిపారు. దీంతో ప్రధానంగా ఇకపై కార్డుల ద్వారా చేసే ఇంటి అద్దెలు, ట్యూషన్‌ ఫీజుల చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.