93 శాతం రూ.2వేల నోట్లు వెనక్కి.. : ఆర్బీఐ

ముంబయి: ఆర్బీఐ ఉపసంహరిం చుకున్న రూ.2,000 నోట్లలో ఇప్పటి వరకు 93 శాతం నోట్లు బ్యాంక్‌లకు చేరాయి. ఆగస్ట్‌ 31 నాటికి రూ.3.32 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయని శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2023 మే 19న మార్కెట్‌ నుంచి రూ.2000 నోటును చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 30 వరకు ఈ నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. మొత్తం నోట్లలో 93 శాతం నోట్లు వెనక్కి రాగా ఇక ప్రజల వద్ద కేవలం రూ. 0.24 లక్షల కోట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ నెలతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నవారు వెంటనే మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది.