
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
జాతీయ రహదారి 63 విస్తరణ కోసం భూ సేకరణ చేపట్టాల్సి ఉందని ఇందుకు రైతులు సహకరించాలని ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమయ్యారు. సమావేశంలో జాతీయ రహదారి విస్తరణలో భూములు పోతున్న రైతుల వివరాలను తెలియజేశారు. భూములు పోతున్న రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి పై మూడు విస్తరణలో కమ్మర్ పల్లి గ్రామ పరిధిలో మొత్తం 140 మంది రైతులకు సంబంధించి సుమారు 60ఎకరాల 8 గుంటల భూమి సేకరించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పెర్కిట్ నుండి మంచిర్యాల సెక్షన్ వరకు జాతీయ రహదారి 63 విస్తరణ జరుగుతుందన్నారు. జాతీయ రహదారి విస్తరిస్తున్న నేపథ్యంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. భూ సేకరణ ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తెలియజేయాలన్నారు. నష్టపరిహారం విషయంలో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు రూపంలో అందజేయాలని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బైపాస్ రోడ్డు మార్గం డిజైన్ పూర్తయినందున భూ సేకరణ తప్పదన్నారు. ఈ సందర్భంగా రైతులు ఇచ్చిన దరఖాస్తులను ఆర్డీవో స్వీకరించారు. రోడ్డు విస్తరణ కోసం నిర్ణయించిన మార్గంలో ఉన్న బోరు బావుల, పైప్ లైన్ల వివరాలను ఇప్పటికే సేకరించినట్లు ఆర్డీవో తెలిపారు. సమావేశంలో పలువురు రైతుల అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శరత్, సర్వేయర్ బాలక్రిష్ణ హరి, బాధిత రైతులు, తదితరులు పాల్గొన్నారు.