న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోమారు ఉద్వాసనలకు పాల్పడ నుందని తెలుస్తోంది. ఈసారి హెల్త్ యూనిట్‌లో ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు రిపోర్టులు వచ్చాయి. అదే విధంగా కొత్తగా ఆఫర్ చేసిన నూతన నియామకాలను నిలిపివేసింది. 2021 డిసెంబర్‌లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కంపెనీ సెర్నెర్‌ను ఒరాకిల్ కొనుగోలు చేసిన అనంతరం హెల్త్ యూనిట్‌లో ఉద్వాసనలకు పాల్పడుతోంది. రోగుల ఆరోగ్య సమాచారాన్ని నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టును సెర్నెర్ దక్కించుకోగా, సెర్నెర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పలువురు రోగులపై ప్రభావం పడటంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులను ఇంటికి పంపించాలని భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఒరాకిల్ సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించింది.