నవంబర్‌ 4న రీ రిలీజ్‌

నవంబర్‌ 4న రీ రిలీజ్‌చిరంజీవి నటించిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమా 2004లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అలాంటి కల్ట్‌ క్లాసిక్‌ హిట్‌ను మళ్లీ థియేటర్లోకి తీసుకొస్తున్నారు. మెగా ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ చిత్రం నవంబర్‌ 4న భారీ ఎత్తున రీ రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం నాగబాబు, హీరో శ్రీకాంత్‌ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.
నాగబాబు మాట్లాడుతూ,’ఈ సినిమాను రీ రిలీజ్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. అప్పుడు అన్నయ్య ఎంతో అందంగా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌తో ఓ చిన్న సీన్‌ చేయించారు. వైష్ణవ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాడు. నా ఫ్రెండ్‌ ఆహుతి ప్రసాద్‌ ఇప్పుడు లేరు. ట్రైలర్‌ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి’ అని తెలిపారు.
‘2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. అన్నయ్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదష్టం. ఆయనది ఎంతో కష్టపడేతత్త్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌ అవుతోంది’ అని హీరో శ్రీకాంత్‌ చెప్పారు. సురేష్‌ కొండేటి, ధర్మేంద్ర తదితరులు రీ రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.