మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై మంగళవారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ రీ వెరిఫికేషన్ చేశారు. గ్రామంలో గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి అర్హులను ఎంపిక చేసేందుకు సిబ్బంది చేసిన సర్వేలో భాగంగా తన యాప్ కు వచ్చిన ఐదు శాతం ఇందిరమ్మ ఇండ్లపై ఆయన రీ వెరిఫికేషన్ చేశారు. సిబ్బంది చేసిన సర్వేలో పొందుపరిచిన వివరాలను రీ వెరిఫికేషన్ లో ఆయన మరోసారి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. సర్వేలో లబ్ధిదారుల గుర్తింపులో ఏమైనా పొరపాట్లు చేశారా అనే విషయాలను ఎంపీడీవో రీ వెరిఫికేషన్ లో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడి ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సిబ్బంది చేసిన సర్వేలో భాగంగా ఆయా గ్రామాల్లో ఐదు శాతం రాండమ్ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో సిబ్బంది ఏమైనా పొరపాట్లు చేసినట్లు గుర్తిస్తే రీ సర్వే చేసేందుకు తిప్పి పంపనట్లు తెలిపారు. సిబ్బంది సర్వేలో లబ్ధిదారుల వివరాలు తన రీ వెరిఫికేషన్ లో సరిపోళితే అట్టి లబ్ధిదారుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఖాళీ స్థలం ఉన్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.