– శ్రీలంకపై కివీస్ ఘన విజయం
– శ్రీలంక 171/10, కివీస్ 172/5
– ఐసీసీ 2023 ప్రపంచకప్
ఐసీసీ 2023 ప్రపంచకప్ నాల్గో సెమీఫైనల్ బెర్త్ న్యూజిలాండ్ సొంతమైంది. గ్రూప్ దశలో వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన కేన్‌సేన.. చిన్నస్వామిలో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టింది. 172 పరుగుల లక్ష్యాన్ని 23.2 ఓవర్లలోనే ఊదేసిన న్యూజిలాండ్ ఐదో విజయం నమోదు చేసి సెమీస్ బెర్త్ లాంఛనం చేసుకుంది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌కు సైతం టెక్నికల్‌గా అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆ రెండు ఇప్పటివరకు క్రికెట్ చూడని అద్భుతం చేస్తేనే కివీస్‌ను దాటి సెమీస్‌కు చేరగలవు.
నవతెలంగాణ-బెంగళూర్
న్యూజిలాండ్ ఎట్టకేలకు మళ్లీ ఓ విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాలతో ప్రపంచకప్ వేటను ఘనంగా మొదలుపెట్టిన న్యూజిలాండ్.. ధర్మశాలలో టీమ్ ఇండియా చేతిలో ఓడి లయ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. తాజాగా ప్రపంచకప్ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఓటములకు చెక్ పెట్టడమే కాకుండా సెమీఫైనల్ బెర్త్ సైతం దాదాపు సొంతం చేసుకుంది. 172 పరుగుల ఛేదనలో ఓపెనర్లు డెవాన్ కాన్వే (45, 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (42, 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), డార్లీ మిచెల్ (43, 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కదం తొక్కారు. 23.2 ఓవర్లలోనే లాంఛనం ముగించిన న్యూజిలాండ్ కీలక నెట్ రన్‌రేట్‌ను అమాంతం మెరుగుపర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (51, 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), టెయిలెండర్ మహీశ్ తీక్షణ (38 నాటౌట్, 91 బంతుల్లో 3 ఫోర్లు) లంకేయులకు గౌరవప్రద స్కోరు అందించారు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (3/37) మూడు వికెట్ల ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
దంచికొట్టారు
లక్ష్యం 172 పరుగులు. పెద్ద విషయం కాదు. కానీ వర్షం సూచనలు ఉన్నాయి. అసలే అదృష్టం ఏమాత్రం కలిసిరాని జట్టు. దీంతో న్యూజిలాండ్ ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు. చిన్న టార్గెట్‌ను సైతం గట్టిగానే కొట్టారు. ఓపెనర్లు డెవాన్ కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించి గెలుపు ఖాయం చేశారు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిసిన రచిన్ రవీంద్ర ఐసీసీ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన అండర్-25 బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. 1996 ప్రపంచకప్‌లో సచిన్ 523 పరుగులు చేయగా.. రచిన్ ఈ టోర్నీలో 565 పరుగులు సాధించాడు. ప్రమాదకర ఓపెనర్లు వెన్వెంటనే నిష్క్రమించినా.. డార్లీ మిచెల్ (43) తర్వాత కథ చూసుకున్నాడు. కేన్ విలియమ్సన్ (14), మార్క్ చాప్‌మన్ (7) త్వరగా అవుటైనా.. కివీస్ ఎటువంటి ఒత్తిడికి గురి కాలేదు. వేగంగా ఆడిన మిచెల్ శ్రీలంక ఆశలను ఆవిరి చేశాడు. మధుశంక ఓవర్లో వరుస బౌండరీలు బాదిన గ్లెన్ ఫిలిప్స్ లాంఛనం ముగించాడు. శ్రీలంక బౌలర్లలో ఎంజెలో మాథ్యూస్ 2 వికెట్లు పడగొట్టాడు.
లంక విలవిల
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కివీస్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 70 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకున్న లంకేయులు.. 171 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో విజృంభించగా.. లాకీ ఫెర్గుసన్, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్రలు రెండేసి వికెట్లతో మెరిశారు. ఓపెనర్ కుశాల్ పెరీరా (51) టాప్ ఆర్డర్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అర్థ సెంచరీతో ఓ ఎండ్‌లో నిలబడ్డాడు. 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. మహీశ్ తీక్షణ (38 నాటౌట్) తెగువతో శ్రీలంక 171 పరుగులు చేసింది. నిశాంక (2), మెండిస్ (6), సమరవిక్రమ (1), అసలంక (8), కరుణరత్నె (6) విఫలమయ్యారు. గ్రూప్ దశలో 9 మ్యాచుల్లో ఏడింట ఓడిన శ్రీలంక ఐసీసీ 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేదు!.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్ : నిశాంక (సి) లేథమ్ (బి) సౌథీ 2, పెరీరా (సి) శాంట్నర్ (బి) ఫెర్గుసన్ 51, మెండిస్ (సి) రవీంద్ర (బి) బౌల్ట్ 6, సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1, అసలంక (ఎల్బీ) బౌల్ట్ 8, మాథ్యూస్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 16, ధనం జయ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 19, కరుణరత్నె (సి) లేథమ్ (బి) ఫెర్గుసన్ 6, తీక్షణ నాటౌట్ 38, చమీర (సి) బౌల్ట్ (బి) రవీంద్ర 1, మధుశంక (సి) లేథమ్ (బి) రవీంద్ర 19, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (46.4 ఓవర్లలో ఆలౌట్) 171.
వికెట్ల పతనం : 1-3, 2-30, 3-32, 4-70, 5-70, 6-104, 7-105, 8-113, 9-128, 10-171.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 10-3-37-3, టిమ్ సౌథీ 8-0-52-1, లాకీ ఫెర్గుసన్ 10-2-35-2, మిచెల్ శాంట్నర్ 10-2-22-2, రచిన్ రవీంద్ర 7.4-0-21-2, గ్లెన్ ఫిలిప్స్ 1-0-3-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : కాన్వే (సి) డిసిల్వ (బి) చమీర 45, రవీంద్ర (సి) డిసిల్వ (బి) తీక్షణ 42, విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14, డార్లీ మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43, చాప్‌మాన్ రనౌట్ 7, గ్లెన్ ఫిలిప్స్ నాటౌట్ 17, టామ్ లేథమ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (23.2 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం : 1-86, 2-88, 3-130, 4-145, 5-162.
బౌలింగ్ : దిల్షాన్ మధుశంక 6.2-0-58-0, మహీశ్ తీక్షణ 7-0-43-1, ధనంజయ డిసిల్వ 2-0-22-0, దుష్మంత చమీర 4-1-20-1, ఎంజెలో మాథ్యూస్ 4-0-29-2.