నిజమైన ప్రజాస్వామ్యాలు భిన్నంగా పనిచేస్తాయి

నిజమైన ప్రజాస్వామ్యాలు భిన్నంగా పనిచేస్తాయి– ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ తీరుపై భారత్‌ విమర్శలు
న్యూయార్క్‌ : అసత్యాలు, తప్పుడు ప్రచారానికి పాల్పడేందుకు పాక్‌ ప్రతినిధి బృందం మరోసారి ఐక్యరాజ్య సమితి ఉన్నత వేదికను ఉపయోగించుకుందని భారత్‌ తీవ్రంగా విమర్శించింది. జమ్మూ కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ మరోసారి ఈ వేదికపై లేవనెత్తడంపై భారత్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. పార్లమెంట్‌ సభ్యుడు రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ, పాక్‌ ప్రతినిధి బృందానికి ఇదొక అలవాటుగా మారిపోయిందని, భారత్‌ గురించి తప్పుడు, అసత్య సమాచారం వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. ఇటువంటి అసత్యపు ప్రామాణికాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందని విమర్శించారు. ”ఒక విషయం స్పష్టం చేయాల్సి వుంది. నిజమైన ప్రజాస్వామ్యాలు భిన్నంగా పనిచేస్తాయి. ఇటీవల స్వేచ్ఛగా, సక్రమంగా జరిగిన ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు రికార్డు సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని గుర్తుచేశారు. ఎవరెంతలా తప్పుడు ప్రచారం చేసినా క్షేత్ర స్థాయిలో వాస్తవాలేవీ మారిపోవని వ్యాఖ్యా నించారు. జమ్మూ కాశ్మీర్‌ గురించి ఎప్పుడూ పాకిస్తాన్‌ అబద్ధాలను ప్రచారం చేస్తూ వుంటుంది. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన మూడు దశల ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య సంస్థల పట్ల తమకు గల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని చెప్పారు. విచ్ఛిన్నకరమైన రాజకీయ ఎజెండా కోసం ఇటువంటి అత్యున్న వేదికను ఉపయోగిం చుకోవడానికి బదులుగా మరింత నిర్మాణా త్మకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఆయన పాక్‌ ప్రతినిధి బృందానికి విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితిలోని గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం చేపట్టే కార్యకలాపాలు, చొరవలకు భారత్‌ మద్దతు వుంటుందని శుక్లా పునరుద్ఘా టించారు. ఐక్యరాజ్య సమితి కార్యకలాపాలు, లక్ష్యాల గురించి చైతన్యం కలిగించడం ఈ కమ్యూనికేషన్స్‌ విభాగం ముఖ్య ఉద్దేశ్యంగా వుంటుంది. ఐక్యరాజ్య సమితి కార్యకలాపాలకు మద్దతును కూడగట్టేందుకు డిజిటల్‌, సాంప్ర దాయ వేదికలతో సహా పలు వేదికలను ఉపయోగించుకుని ప్రచారం చేస్తూ వుంటుంది. ఈ తప్పుడు సమాచారపు వైరస్‌పై తామందరం కలిసి కట్టుగా పోరాడతామని శుక్లా ప్రకటించారు. మరింత సానుకూలమైన, విశ్వసనీయమైన, మెరుగైన ప్రపంచం కోసం పాటుపడతామన్నారు.