
– దాన గుణంతోనే భగవద్దర్శనం…
– ఆధ్యాత్మిక ధార్మిక సమ్మేళనంలో భగవాన్ శ్రీ రామదూత స్వామి..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ఋజువర్తన, దాన గుణం,నిబద్ధతతో జీవించే ప్రతి మనిషిలో దైవత్వం దాగి ఉంటుందని శ్రీ రామదూత స్వామి అన్నారు. అనవసరమైన కోరికలతో ,స్వార్థ చింతనతో కుటుంబాలలో అశాంతి పెరిగిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆధ్యాత్మిక, ధార్మిక సమ్మేళనం ఘనంగా నిర్వహింపబడింది.సువర్ణ లక్ష్మీ దాంపత్య వ్రతం, వేణు దత్తాత్రేయ అభయ మాల ధారణ,దీక్షలు మున్నగు ప్రత్యేక పూజలను భగవాన్ శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన అతిథిగా రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సతీ సమేతంగా పాల్గొని,ప్రత్యేక పూజలు చేశారు.వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఈటెల రాజేందర్, దాసోజు శ్రావణ్,బూడిద బిక్షమయ్య గౌడ్, యం ఎన్ అర్ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్, పలువురు పారిశ్రామిక వేత్తలు, వైద్య నిపుణులు,విద్యాసంస్థల అధిపతులు,న్యాయవాదులు ధార్మిక వేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నంత వరకు వేద మంత్రోచ్ఛరణలతో అక్కడి ప్రాంగణమంతా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లినట్లుగా ఉంది.భక్తుల భజనలతో, భగవత్ నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఎక్కడా ఏ లోపం రాకుండా భోజన ఏర్పాట్లను,ఇతర సౌకర్యాలను నిర్వాహకులు చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి భగవాన్ శ్రీ రామదూత గారు ప్రసంగించారు గత మూడేళ్ళుగా హిమాలయాలలో అనేక బీజాక్షర మంత్రాలను ఉచ్చరిస్తూ నిర్వహించిన యజ్ఞ ఫలితాన్ని ప్రజలకు ధారపోస్తున్నట్లు తెలిపారు.ప్రతి మనిషి తాను జీవించి ఉన్నంతవరకు సాటివారికి సహాయపడటంలో ముందుండాలని ఆయన అన్నారు.అనేక బీజాక్షర మంత్రాలను రాగయుక్తంగా పాడుతూ ,వాటి గొప్పదనాన్ని తెలియజేస్తూ, భక్తులకు సన్మార్గాన్ని బోధించారు.