ఎన్డీఏకు రెబల్‌

– స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి పవన్‌సింగ్‌
న్యూఢిల్లీ : భోజ్‌పురి నటుడు, బీజేపీ సభ్యుడు పవన్‌సింగ్‌ ఎన్డీఏను కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో పవన్‌ను బీజేపీ బహిష్కరించింది. ఇందుకు సంబంధించి బుధవారం లేఖను విడుదల చేసింది. పవన్‌సింగ్‌ చేసిన పని పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని విమర్శిం చింది. ప్రస్తుతం పవన్‌ సింగ్‌ ఎన్డీఏ అభ్యర్థి ఉపేందర్‌ కుష్వాహాకు పోటీగా బీహార్‌లోని కరాకట్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. గతంలో పవన్‌ బీజేపీ సభ్యుడిగా ఉన్నప్పటికీ నామినేషన్‌లకు ముందు ఆర్‌జేడీ టికెట్‌ అడిగినట్టు సమాచారం. అక్కడి నుంచి నిరాశ ఎదురవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కరాకట్‌ లోక్‌సభ స్థానానికి జూన్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇది ఏడవ దశ, చివరిది కూడానూ. ఆ స్థానానికి కుష్వాహాతో పాటు రాష్ట్రీయ లోక్‌ మోర్చా అధినేత, కేంద్ర మాజీ మంత్రి రాజారాం సింగ్‌, మజ్లీస్‌ పార్టీ నుంచి ప్రియాంక చౌదరి బరిలో ఉన్నారు. ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ ఈ లేఖపై స్పందిస్తూ ‘ఉపేంద్ర కుష్వాహాను ఓడించేం దుకు బీజేపీ కుట్ర మాత్రమే. అంతర్గతంగా పవన్‌సింగ్‌కు బీజేపీ మద్దతుగానే ఉంది’ అన్నారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సమరత్‌ చౌదరి స్పందిస్తూ ”ఎవరైనా పార్టీకి వ్యతిరే కంగా ఎన్నికల్లో పోటీ చేస్తే, సహజంగానే ఆ పార్టీ చర్యలు తీసుకుంటుంది.” అన్నారు.