నవతెలంగాణ-సంగారెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మెన్ జస్టిస్ డాక్టర్ సమీమ్ అక్తర్ బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ కుల సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ ఎస్సీ కుల సంఘాల నుంచి 212 వినతులు అందాయన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి న్యాయపరమైన అంశాలు, సామాజిక పరిస్థితులు, చారిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేయడం కోసం కమిషన్ ఏర్పాటైందని తెలిపారు. సమాజంలోని అన్ని ఎస్సీ వర్గాల అభిప్రాయాలు పరిశీలించి, తగిన నివేదిక సిద్ధం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అధ్యయనం కోసం ప్రతిపాదనలు, వినతులు కీలకమైనవన్నారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో బహిరంగ విచారణకు హాజరై కమిషన్‌కు వినతులు అందజేశారు. అనంతరం కంది మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అదనపు సంచాలకులు శ్రీధర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, సంబంధిత అధికారులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.