ప్రత్యేక రాష్ట్రంలో ఊరి ఉత్సవాలకు గుర్తింపు

– కుటుంబసభ్యుల్లో ఆనందం నింపుతున్న ఉత్సవాలు
– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ-మంథని
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఊరి ఉత్సవాలకు గుర్తింపు లభించిందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని డివిజన్ పరిధిలోని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని అంగడి బజార్ లో అత్యంత వైభవంగా జరుగుతున్న బొడ్రాయి సహా భూలక్ష్మి,మహాలక్ష్మీ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొని ఊరి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కుశ్రీహర్షిని రాకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈసందర్బంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ పూర్వం ప్రతి గ్రామంలో బొడ్రాయి,గ్రామదేవతల విగ్రహాలను సంప్రదాయ పద్దతిలో ప్రతిష్టంచుకునే వారని,ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ముందు వరకు ఈ ఉత్సవాలు కనుమరుగై పోయాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మళ్లీ ప్రతి గ్రామంలో పాలరాతితో బొడ్రాయి, గ్రామదేవతల విగ్రహాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.బొడ్రాయి, భూలక్ష్మి,మహాలక్ష్మి విగ్రహల ప్రతిష్టాపనతో ఊరికి కొత్త శోభ లబిస్తుందన్నారు.ఉత్సవాల సందర్బంగా ఎక్కడెక్కడే ఉండే ఇంటి ఆడబిడ్డలు,బంధువులు, కుటుంబసభ్యులు ఒక్క చోటికి చేరడంతో ప్రతి కుటుంబంలోఆనందం నిండుతుందన్నారు.ఇటీవలి కాలంలో అకాల, వడగండ్ల వానలు అనేక ఇబ్బందులు పెడుతున్నాయని, రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని,అమ్మవారి కనికరంతో చెడగొట్టు వానలు ఆగిపోవాలని ఆయన వేడుకున్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎలాంటి ఇబ్బందులులేకుండా అమ్ముకుని రైతులు సుభిక్షంగా ఉండేలా అమ్మవారి దీవెనలు ఉండాలని ఆయన ఈసందర్బంగా గ్రామదేవతలను వేడుకున్నారు.కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో బొడ్రాయి,భూలక్ష్మి,మహలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని,అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను జెడ్పీ చైర్మన్‌ అభినందించారు.అనంతరం జెడ్పీ చైర్మన్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.